మహబూబ్నగర్ జిల్లాలోని పాలెం బస్సు దుర్ఘటన నేపథ్యంలో రవాణశాఖ అధికారులు చేపట్టిన దాడులు బుధవారం కూడా కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 20 బస్సులు సీజ్ చేసినట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో 9, కర్నూలులో 2, అనంతపురంలో 5,గుంటూరులో 4 బస్సులను సీజ్ చేసినట్లు తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలోని ఆరంగళ్ చౌరస్తాలో నాలుగు బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడిపే ప్రైవేట్ వాహనాలపై కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ ట్రాన్పోర్ట్ కమిషనర్ సుందర్ బుధవారం ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులను హెచ్చరించారు.
గత నెలలో మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తకోట మండలం పాలెంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ బస్సు అగ్నికి ఆహుతి అయింది. ఆ ఘటనలో 46 మంది మరణించారు. ఆ ఘటనతో నిద్రావస్థలో ఉన్న రాష్ట్ర రవాణ శాఖ కొద్దిపాటి ఉలికిపాటుకు గురైంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ పై దాడులు రవాణశాఖ దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.