deputy transport commissioner
-
వైఎస్సార్...మీ ఓటు తెలుసుకోండి ఇలా..
సాక్షి,కడప : నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (www.nvsp.in) ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. www.ceoandhra.nic.inవెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. కాల్ సెంటర్ఇన్చార్జి రామునాయక్, స్టెప్ సీఈఓ సెల్ నెంబర్ : 98499 09064 మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. ఈ నెల 15వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. -ప్రజల్లో చైతన్యం కోసం సాక్షి ప్రయత్నం -
14 స్కూల్ బస్సుల సీజ్
భవానీపురం : నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న స్కూల్ బస్‌లపై డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఎం.వెంకటేశ్వరరావు నేతృత్వంలో మంగళవారం తనిఖీలు నిర్వహించి, 14 వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని పాఠశాలల బస్సుల డ్రైవర్లు, యాజమాన్యాలు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలను విస్మరిస్తున్నారని తెలిపారు. జిల్లావ్యాప్తంగా సుమారు 400 బస్‌లను తనిఖీ చేశామని, డ్రైవరక్లు లెసైన్స్‌లు, బస్‌కు పర్మిట్లు లేకపోవడం, టాక్స్‌లు చెల్లించక పోవడం వంటి కారణాలతో 25 బస్‌లపై కేసులు నమోదు చేశామన్నారు. అందులో 14 బస్‌లను సీజ్ చేశామని వివరించారు. నగరంలోని పటమట, వారధి, చుట్టుగుంట ప్రాంతాలలో మూడు బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు నిర్వహించామని తెలిపారు. డ్రైవర్ల ప్రవర్తనకు సంబంధించి పలు అంశాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నామని చెప్పారు. పిల్లలను బస్‌లలో పంపే తల్లిదండ్రులు నెలకొకసారైనా వాటిలో ప్రయాణించాలని సూచించారు. అలా చేస్తే బస్ కండిషన్, డ్రైవర్ ప్రవర్తన తెలుస్తాయన్నారు. బస్‌లలో ఏర్పాటు చేసే ఫస్ట్‌ఎయిడ్ బాక్స్‌లో ప్రాథమిక చికిత్సకు సంబంధించిన మందులు ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో బస్లోపల నుంచి బయటకు ఎలా రావాలో విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరారు. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు స్కూల్ బస్ పర్మిట్ తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా ఇతర పనులకు వినియోగిస్తున్నాయన్నారు. అటువంటివారిపై కేసులు నమోదు చేస్తామని, అప్పటికీ వారిలో మార్పు రాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో రవాణా శాఖ అధికారులు వి.ఆర్.రవీంద్రనాథ్, జి.సంజీవకుమార్, బి.చెల్లారావు, వి.వి.ఎస్.ఎన్.మూర్తి, ఎన్.ఎల్ సుబ్బలక్ష్మి, ఎం.రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
డీటీసీ ఆదేశాలు బేఖాతర్
- హెచ్ఎస్ఆర్ ప్లేట్ల ప్రక్రియ ఆపాలని ఆదేశం - కొనసాగిస్తున్న కాంట్రాక్టర్ తిమ్మాపూర్ : రవాణా శాఖ జిల్లా డెప్యుటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్(డీటీసీ) ఆదేశాలను హై సెక్యురిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల(హెచ్ఎస్ఆర్పీ) కాంట్రాక్టర్ బేఖాతరు చేస్తున్నారు. ఇటీవల కార్యాలయ ఆవరణలో హెచ్ఎస్ఆర్పీ ప్రక్రియను కాంట్రాక్టర్ ప్రారంభించగా జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో పాటు రేడియం షాపుల యజమానులు ఆపాలని డీటీసీని కలిశారు. ఇతర జిల్లాల్లో ప్రారంభించకుండా కేవలం కరీంనగర్‌లోనే ప్రారంభించడంపై అభ్యంతరాలు తెలిపారు. దీనిపై డీటీసీ స్పందిస్తూ నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రారంభించిన తర్వాతనే కరీంనగర్లో ప్రారంభించాలని ఆదేశించారు. అయినా కాంట్రాక్టర్ ప్రతి రోజూ కార్యాలయ ఆవరణలో కౌంటర్ ఏర్పాటు చేస్తూనే ఉన్నాడు. హెచ్ఎస్ఆర్పీకి సంబంధించి నోడల్ ఆఫీసర్ ఆర్టీవో దుర్గప్రమీలకు తెలియకుండానే ప్రారంభించడం విమర్శలకు దారితీస్తోంది. జోనల్ ఆఫీసు వరంగల్‌లో ప్రారంభించే వరకు ఇక్కడ తాత్కాలికంగా హెచ్ఎస్ఆర్ ప్లేట్ల ఆర్డర్లు తీసుకోవడం ఆపాలని ఆర్టీవో కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఆర్డర్లు తీసుకోవడం లేదని కాంట్రాక్టర్ సమాధానమిచ్చారు. తెలంగాణలో ఏపీ జీవో... వాహనదారులు హెచ్ఎస్ఆర్ ప్లేట్లను వాడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 110 జారీ చేసినా జిల్లాలో అమలు చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అప్పటి జీవో పేరిట ఇప్పుడు సంబంధిత కాంట్రాక్టర్ హెచ్ఎస్ఆర్ ప్లేట్ల కౌంటర్‌ను ప్రారంభించాడు. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వు ఇచ్చిన తర్వాత కౌంటర్‌ను ఏర్పాటు చేయాలని కొందరు కోరుతున్నారు. ఆంధ్ర అధికారులున్నందునే అప్పటి జీవోను ఇప్పుడు అమలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
అనుమతుల్లేని స్కూల్ బస్సులను సీజ్ చేస్తాం
ఉప రవాణా కమిషనర్ సీహెచ్ శ్రీదేవి ఏలూరు సిటీ : జిల్లాలో నిబంధనలు పాటించకుండా 842 స్కూల్ బస్సులు రోడ్లపై తిరుగుతున్నాయని, ఈ నెలాఖరులోగా వాటి యాజమాన్యాలు అనుమతులు పొందకపోతే వాటిని సీజ్ చేస్తామని ఉపరవాణా కమిషనర్ సీహెచ్ శ్రీదేవి హెచ్చరించారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల యాజ మాన్యాలు కండిషన్లో లేని బస్సులను నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, ఈ విద్యాసంస్థలకు చెందిన బస్సులను ఉపేక్షించేదిలేదన్నారు. జిల్లాలో సగానికిపైగా స్కూల్ బస్సులు ఫిట్నెస్, రవాణాశాఖ అనుమతులు లేకుండా నడుపుతున్నారని తెలిపారు. జిల్లాలో 1,665 ప్రైవేట్ స్కూల్ బస్సులు ఉండగా వాటిలో 823 బస్సులకు మాత్రమే అనుమతి ఉందన్నారు. మిగిలిన 842 స్కూల్, కళాశాల బస్సులకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో ఇటీవల ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిబంధనలకు వ్యతిరేకంగా తిరుగుతున్న ఏడు బస్సులను సీజ్ చేశామని, వాటిలో కొవ్వూరులో 3, తణుకులో 2, పాలకొల్లులో 1, ఏలూరులో 1 ఉన్నాయన్నారు. నిబంధనలు పాటించని స్కూల్ బస్సులను ఆకస్మిక తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రతి పాఠశాల, కళాశాల బస్సుల్లో డ్రైవర్‌కు దృష్టి లోపం, బీపీ, చక్కెర వ్యాధి వంటివి ఉండకూడదని, డ్రైవర్ చిరునామా, మొబైల్ నెంబర్ విధిగా ఉండాలని, స్కూల్ చిరునామా, ఫోన్ నెంబర్ డిస్ప్లే చేయాల్సి ఉందన్నారు. ప్రథమ చికిత్స చేసేందుకు కిట్, బస్సు రూట్‌మ్యాప్ ఉంచాలని, వారంలో ఒకరోజు ఖచ్చితంగా విద్యార్థుల తల్లిదండ్రులు బస్సు ఫిట్నెస్ పరిశీలించేలా ఏర్పాటు చేయాలన్నారు. బస్సుల్లో ప్రయాణించే విద్యార్థుల వివరాలతో కూడిన జాబితా ను ఉండాలని డీటీసీ సూచించారు. -
20 ప్రైవేట్ బస్సులను సీజ్ చేసిన రవాణ శాఖ
మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలెం బస్సు దుర్ఘటన నేపథ్యంలో రవాణశాఖ అధికారులు చేపట్టిన దాడులు బుధవారం కూడా కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 20 బస్సులు సీజ్ చేసినట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో 9, కర్నూలులో 2, అనంతపురంలో 5,గుంటూరులో 4 బస్సులను సీజ్ చేసినట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని ఆరంగళ్ చౌరస్తాలో నాలుగు బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడిపే ప్రైవేట్ వాహనాలపై కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ ట్రాన్‌పోర్ట్ కమిషనర్ సుందర్ బుధవారం ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులను హెచ్చరించారు. గత నెలలో మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తకోట మండలం పాలెంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ బస్సు అగ్నికి ఆహుతి అయింది. ఆ ఘటనలో 46 మంది మరణించారు. ఆ ఘటనతో నిద్రావస్థలో ఉన్న రాష్ట్ర రవాణ శాఖ కొద్దిపాటి ఉలికిపాటుకు గురైంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ పై దాడులు రవాణశాఖ దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.