14 స్కూల్ బస్సుల సీజ్
భవానీపురం : నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న స్కూల్ బస్‌లపై డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఎం.వెంకటేశ్వరరావు నేతృత్వంలో మంగళవారం తనిఖీలు నిర్వహించి, 14 వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని పాఠశాలల బస్సుల డ్రైవర్లు, యాజమాన్యాలు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలను విస్మరిస్తున్నారని తెలిపారు. జిల్లావ్యాప్తంగా సుమారు 400 బస్‌లను తనిఖీ చేశామని, డ్రైవరక్లు లెసైన్స్‌లు, బస్‌కు పర్మిట్లు లేకపోవడం, టాక్స్‌లు చెల్లించక పోవడం వంటి కారణాలతో 25 బస్‌లపై కేసులు నమోదు చేశామన్నారు. అందులో 14 బస్‌లను సీజ్ చేశామని వివరించారు. నగరంలోని పటమట, వారధి, చుట్టుగుంట ప్రాంతాలలో మూడు బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు నిర్వహించామని తెలిపారు. డ్రైవర్ల ప్రవర్తనకు సంబంధించి పలు అంశాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నామని చెప్పారు.
పిల్లలను బస్‌లలో పంపే తల్లిదండ్రులు నెలకొకసారైనా వాటిలో ప్రయాణించాలని సూచించారు. అలా చేస్తే బస్ కండిషన్, డ్రైవర్ ప్రవర్తన తెలుస్తాయన్నారు. బస్‌లలో ఏర్పాటు చేసే ఫస్ట్‌ఎయిడ్ బాక్స్‌లో ప్రాథమిక చికిత్సకు సంబంధించిన మందులు ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో బస్‌లోపల నుంచి బయటకు ఎలా రావాలో విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరారు. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు స్కూల్ బస్ పర్మిట్ తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా ఇతర పనులకు వినియోగిస్తున్నాయన్నారు. అటువంటివారిపై కేసులు నమోదు చేస్తామని, అప్పటికీ వారిలో మార్పు రాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో రవాణా శాఖ అధికారులు వి.ఆర్.రవీంద్రనాథ్, జి.సంజీవకుమార్, బి.చెల్లారావు, వి.వి.ఎస్.ఎన్.మూర్తి, ఎన్.ఎల్ సుబ్బలక్ష్మి, ఎం.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.