డీటీసీ ఆదేశాలు బేఖాతర్
- హెచ్‌ఎస్‌ఆర్ ప్లేట్ల ప్రక్రియ ఆపాలని ఆదేశం
- కొనసాగిస్తున్న కాంట్రాక్టర్
తిమ్మాపూర్ : రవాణా శాఖ జిల్లా డెప్యుటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్(డీటీసీ) ఆదేశాలను హై సెక్యురిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల(హెచ్‌ఎస్‌ఆర్‌పీ) కాంట్రాక్టర్ బేఖాతరు చేస్తున్నారు. ఇటీవల కార్యాలయ ఆవరణలో హెచ్‌ఎస్‌ఆర్‌పీ ప్రక్రియను కాంట్రాక్టర్ ప్రారంభించగా జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో పాటు రేడియం షాపుల యజమానులు ఆపాలని డీటీసీని కలిశారు.
ఇతర జిల్లాల్లో ప్రారంభించకుండా కేవలం కరీంనగర్‌లోనే ప్రారంభించడంపై అభ్యంతరాలు తెలిపారు. దీనిపై డీటీసీ స్పందిస్తూ నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రారంభించిన తర్వాతనే కరీంనగర్‌లో ప్రారంభించాలని ఆదేశించారు. అయినా కాంట్రాక్టర్ ప్రతి రోజూ కార్యాలయ ఆవరణలో కౌంటర్ ఏర్పాటు చేస్తూనే ఉన్నాడు. హెచ్‌ఎస్‌ఆర్‌పీకి సంబంధించి నోడల్ ఆఫీసర్ ఆర్టీవో దుర్గప్రమీలకు తెలియకుండానే ప్రారంభించడం విమర్శలకు దారితీస్తోంది. జోనల్ ఆఫీసు వరంగల్‌లో ప్రారంభించే వరకు ఇక్కడ తాత్కాలికంగా హెచ్‌ఎస్‌ఆర్ ప్లేట్ల ఆర్డర్లు తీసుకోవడం ఆపాలని ఆర్టీవో కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఆర్డర్లు తీసుకోవడం లేదని కాంట్రాక్టర్ సమాధానమిచ్చారు.
తెలంగాణలో ఏపీ జీవో...
వాహనదారులు హెచ్‌ఎస్‌ఆర్ ప్లేట్లను వాడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 110 జారీ చేసినా జిల్లాలో అమలు చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అప్పటి జీవో పేరిట ఇప్పుడు సంబంధిత కాంట్రాక్టర్ హెచ్‌ఎస్‌ఆర్ ప్లేట్ల కౌంటర్‌ను ప్రారంభించాడు. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వు ఇచ్చిన తర్వాత కౌంటర్‌ను ఏర్పాటు చేయాలని కొందరు కోరుతున్నారు. ఆంధ్ర అధికారులున్నందునే అప్పటి జీవోను ఇప్పుడు అమలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.