రోడ్డు భద్రతపై శ్రద్ధేదీ..? | Road transport department conducts `Suffer` Event | Sakshi
Sakshi News home page

రోడ్డు భద్రతపై శ్రద్ధేదీ..?

Published Thu, Nov 7 2013 4:17 AM | Last Updated on Thu, Aug 30 2018 5:54 PM

Road transport department conducts `Suffer` Event

=    మొక్కుబడిగా ‘సఫర్’ కార్యక్రమం
 =    మూలనపడిన ‘స్పీడ్ గన్’లు
 
 సాక్షి, ఒంగోలు: రహదారులపై ప్రమాదాలను నివారించేందుకు రవాణాశాఖ ప్రవేశపెట్టిన ‘సఫర్’ (సేఫ్టీ ఆల్వేస్ ఫర్ ఆల్ రోడ్స్) కార్యక్రమంపై కిందిస్థాయి అధికారులు శ్రద్ధ చూపడం లేదు. ఫలితంగా రోజూ ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. 2003లో ప్రవేశపెట్టిన కార్యక్రమాన్ని ఏటా జనవరి 1 నుంచి 7వ తేదీ వరకు ‘రహదారి భద్రత వారోత్సవాలు’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. తొలుత ఐదారేళ్లు ఈ కార్యక్రమం సజావుగా అమలైనా క్రమంగా చిత్తశుద్ధి లోపించింది.

ప్రతి మూడు నెలలకోసారి కలెక్టర్ చైర్మన్‌గా, ఎస్పీ, ఆర్టీసీ ఆర్‌ఎం, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి, కార్పొరేషన్ కమిషనర్, ఆర్‌అండ్‌బీ ఈఈ, ఆర్‌టీఓ, జాతీయ రహదారి జనరల్ మేనేజర్, ట్రాఫిక్ సీఐ తదితరులు సభ్యులుగా ఉండే కమిటీ సమావేశమై అందులో తీసుకునే నిర్ణయాలను అమలు చేయాలి. అయితే ఈ సమావేశాలు ప్రస్తుతం ఆరు నెలలకోసారి జరుగుతున్నాయి.  
 
 అమలు కాని రోడ్ సేఫ్టీ మెజర్స్ :  ప్రమాదాల నివారణపై కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను సంబంధిత శాఖాధికారులు సక్రమంగా అమలు చేయకపోతుండటం వల్ల తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఒంగోలు నగరానికి సంబంధించి గతంలో అధికారులు తీసుకున్న సేఫ్టీ మెజర్స్ ప్రస్తుతం అమలవడం లేదు. హైవే అధికారులు సైతం సరిగా స్పందించడం లేదు. హైవేపై, ఫ్లై ఓవర్ బ్రిడ్జిలపై ఏర్పడుతున్న గుంతలను పూడ్చడం లేదు.  
 
 ‘స్పీడ్ గవర్నర్’లను ఉపయోగిస్తున్నారా...?
 ప్రమాదాలను అరికట్టేందుకు గానూ ప్రవేశపెట్టిన నిబంధనలను డ్రైవర్లు సక్రమంగా పాటించడం లేదు. మితిమీరిన వేగం, సరైన శిక్షణ లేకపోవడం,  మద్యం సేవించి వాహనాలు నడుపుతుండటం, దూరప్రాంతాలకు వెళ్లే వాహనాల్లో ఇద్దరు డ్రైవర్లు లేకపోవడం... తదితర కారణాలతో తరచూ రోడ్డుప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రత్యేకంగా జాతీయ రహదారి, ఇతర ప్రధాన రహదారుల్లో ఎక్కడ ఎంత వేగంతో వాహనాన్ని నడపాలనే సూచనలు కనిపిస్తుంటాయి. అయితే డ్రైవర్లు వాహనాలను త్వరగా గమ్యస్థానాలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా వేగం పెంచుతూ ఉంటారు. దీనిని పసిగట్టేందుకు ప్రభుత్వం ‘స్పీడ్ గవర్నర్’ (స్పీడ్ గన్) పేరుతో ఒక మెషీన్‌ను రవాణాశాఖాధికారులకు అప్పగించింది. ఆ మెషీన్ ద్వారా మోటారు వాహనాల ఇన్‌స్పెక్టర్లు వాహనం ఎంత స్పీడ్‌తో వస్తుందో గుర్తించి నిబంధనలు ఉల్లంఘించిన వారికి వెంటనే తాఖీదులు జారీ చేసి వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఈ యంత్రాన్ని సక్రమంగా వినియోగించడం లే దు.
 
 జాతీయ రహదారి పక్కన మద్యం దుకాణాలు కానీ, బార్లు కానీ ఉండకూడదు. కానీ రోడ్డు పొడవునా మద్యం దుకాణాలతో పాటు, బెల్టు షాపులు సైతం దర్శనమిస్తూనే ఉన్నాయి. దాబా హోటళ్లలో మద్యం అందుబాటులో ఉంటుండడం వల్ల లారీలు, బస్సులు, కార్లు తదితర వాహనాల డ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులు సైతం మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారు. దీంతో తరచూ ప్రమాదాలు సంభవించి ఎంతో విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. పోలీస్, ఆర్టీఏ, జాతీయ రహదారులకు సంబంధించిన అధికారులు నిత్యం పెట్రోలింగ్ చేస్తుండాలి. ఈ పెట్రోలింగ్ కూడా సక్రమంగా జరగడం లేదు.
 
 ఏటా రూ.7 కోట్ల వరకు ఆదాయం
 ఒంగోలు నగరంతో పాటు కందుకూరు, మార్కాపురం, చీరాల డివిజన్ల నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు నిత్యం పెద్ద సంఖ్యలో పలు రకాల ట్రావెల్స్ నుంచి బస్సులు వెళ్తుంటాయి. టికెట్ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రజలు ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తుండటంతో ఆర్టీసీ కన్నా ఈ బస్సులకే అధిక డిమాండ్ కనిపిస్తోంది. రవాణా శాఖకు ఒక్క ప్రకాశం జిల్లా నుంచి ఏటా ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు సుమారు రూ.6 నుంచి రూ.7 కోట్ల వరకు పన్ను చెల్లిస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
 
 తీవ్రంగా ఉన్న డ్రైవర్ల కొరత: పది, పదిహేనేళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం బస్సులు, లారీల వంటి భారీ వాహనాలకు డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉన్నట్లు సంబంధిత యజమానులు చెప్తున్నారు. పాత వారు మినహాయిస్తే కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వారి సంఖ్య బాగా తగ్గిపోతోందంటున్నారు. దీంతో ఉన్న కొద్దిమందితోనే వారు పని నడిపిస్తున్నారు. సరైన శిక్షణ పొందని, లెసైన్సులు లేని క్లీనర్లు సైతం స్టీరింగ్ పట్టుకుంటుండటంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. సాధారణ బస్సుల విషయం అటుంచితే ఓల్వో బస్సు ఖరీదు ప్రస్తుతం సుమారు రూ.1.20 కోట్లకుపైగా ఉంటుంది. సరైన శిక్షణ తీసుకుని ఈ వోల్వో వాహనాలను నడిపితే ప్రమాదాలు జరగడం చాలా తక్కువే. సాంకేతిక పరంగా బస్సు తయారీ, ఇతర విషయాల్లో హైసెక్యూరిటీ ఉంటుంది. కేవలం అవగాహన రాహిత్యం, తొందరపాటుతనం తదితర కారణాల వల్ల డ్రైవర్లు చేస్తున్న తప్పిదాలకు యాజమాన్యం భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఓల్వో వాహనాలకు సంబంధిత కంపెనీ వారు డ్రైవర్లకు ప్రత్యేకంగా శిక్షణనిస్తారు. వాహనాలు నడుపుతున్న వారు ఆ శిక్షణ తీసుకున్నారా... లేదా... ? తనిఖీ చేయాల్సిన బాధ్యత రవాణాశాఖ అధికారులపై ఉంది. 300 కి.మీ.లు దూరం తర్వాత డ్రైవర్‌కు తప్పనిసరిగా విశ్రాంతి అవసరం.  దూరప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సుల్లో తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లు ఉండాల్సి ఉండగా కొన్ని బస్సుల్లో ఒక్కరే డ్రైవర్ ఉంటున్నారు. వాహనాలు నడిపేటప్పుడు ఒక చేత్తో సెల్‌ఫోన్లు మాట్లాడుతుండటం కూడా ప్రమాదాలు సంభవించేందుకు కారణాలవుతున్నాయి.  
 
 గత అనుభవాల దృష్ట్యా ప్రస్తుతం రవాణాశాఖాధికారులు స్కూలు బస్సుల విషయాల్లో మాత్రం కఠినంగా వ్యవహరిస్తూ పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. ఇదే విధంగా ట్రావెల్స్ బస్సులపై కూడా కఠినంగా వ్యవహరించి బస్సుల యాజమాన్యం, డ్రైవర్లు నిబంధనలను పాటించేలా చూస్తే ప్రమాదాలను అరికట్టడం పెద్ద కష్టమేమీ కాదు. ప్రమాదాలు సంభవించిన తరువాత నాలుగైదు రోజులు హడావుడి చేయడం కాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటూ ముమ్మరంగా తనిఖీలు చేపడితే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చు. అయితే కొన్ని విషయాల్లో చేతులు కాలిన తరువాత కూడా ఆకులు పట్టుకోవడం లేదంటే వారి నిర్లక్ష్యం స్పష్టమవుతోంది. జాతీయ రహదారిపై ఆటోలు తిరుగుతున్నాయి. కనీసం ఒక్కో ఆటోలో కనీసం పది మంది ప్రయాణిస్తుంటారు. ఇలాంటి వాహనాలపై కూడా రవాణా, పోలీసు శాఖలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement