భద్రతకు దారేది? | Road Accidents In Telangana | Sakshi
Sakshi News home page

భద్రతకు దారేది?

Published Wed, May 30 2018 2:17 AM | Last Updated on Thu, Aug 30 2018 4:51 PM

Road Accidents In Telangana  - Sakshi

నాలుగు రోజుల క్రితం.. ఆర్టీసీ బస్సు–రెండు లారీలు–ఓ క్వాలిస్‌ ఢీకొని 13 నిండు ప్రాణాలు బలయ్యాయి.. అది రాజీవ్‌ రహదారి
..ఈ నాలుగు వరుసల రోడ్డును అనేక లోపాలతో నిర్మించారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదాలకు ఆస్కారమిచ్చే రోడ్డు ఇది. దీని లోటుపాట్లను కొంతమేర సరిదిద్దేందుకు రోడ్లు భవనాల శాఖ డీపీఆర్‌ రూపొందించి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి పంపింది. కానీ సచివాలయంలో ఆ ఫైలు మూడేళ్లుగా దుమ్ముకొట్టుకుపోతోంది. ఇక్కడ జనం ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి!

మంగళవారం.. బస్సు–లారీ ఢీకొని ఏడుగురు ప్రాణాలు విడిచారు. ఇది వరంగల్‌–కరీంనగర్‌ జాతీయ రహదారి!
..వాహనాల రద్దీ అధికంగా ఉండే ఈ రెండు వరుసల రోడ్డును నాలుగు లేన్లకు విస్తరించాలన్న ప్రణాళిక మూడేళ్లది. కానీ దాంతో తమకు సంబంధం లేదన్నట్టుగా మిషన్‌ భగీరథ అధికారులు రోడ్డును ఆనుకునే భారీ పైప్‌లైన్‌ నిర్మించారు. రోడ్డును విస్తరించాలంటే పైప్‌లైన్‌ను తొలగించాలి. కానీ ఎలా? ఈ ఆలోచనతోనే పనులు అటకెక్కాయి. ఇరుకురోడ్డుపై రక్తం పారుతోంది!

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నుంచి రామగుండం వరకు 248 కి.మీ. మేర ఉన్న రాజీవ్‌ రహదారిని 2010లో రూ.1,400 కోట్లతో 4 వరుసలుగా విస్తరించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న భారీ వృక్షాలను కొట్టేసి రెండు వైపులా రోడ్డు వేసి పని ముగిసిందనిపించారు. ఎక్కడా శాస్త్రీయ సర్వేకు అవకాశమే ఇవ్వకుండా నిర్లక్ష్యంగా రోడ్డును వెడల్పు చేశారు. ఇక ఆ తర్వాత వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సభాసంఘం వేసి విచారణకు ఆదేశించింది. నిపుణులతో కలసి రోడ్డును ఆసాంతం పరిశీలించిన సంభాసంఘం.. ఆ రోడ్డు అత్యంత నాసిరకంగా ఉందని, అనేక లోపాలున్నాయని తేల్చింది.

తెలంగాణ ఏర్పడి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రోడ్లు, భవనాల శాఖ దానికి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అధికారులు రోడ్డును పరిశీలించి కొన్ని సూచనలతో ప్రభుత్వానికి మరో నివేదిక అందించారు. రూ.వెయ్యి కోట్లతో డీపీఆర్‌ రూపొందించి పంపారు. కానీ మూడేళ్లు గడుస్తున్నా ఆ ఫైల్‌ తిరిగి రాలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకపోవటంతో లోపాలు సరిదిద్దే పనులు ఇప్పటి వరకు మొదలు కాలేదు. రోడ్లు భవనాల శాఖ చేతులెత్తేసి ఆ రోడ్డును వదిలేసింది.  

ఆ ప్రతిపాదనలు ఇవే... 

  • నాలుగు వరుసల రోడ్డు, మధ్యలో సెంట్రల్‌ మీడియన్‌ ఉండటంతో వాహనాల వేగం అధికంగా ఉంటుంది. ఇలాంటి రోడ్లు ఎట్టి పరిస్థితుల్లో ఊళ్ల మధ్య నుంచి సాగటానికి వీల్లేదు. ఇందుకు ఈ రోడ్డుపై బైపాస్‌ల నిర్మాణం ముఖ్యమని నిపుణులు తేల్చారు. శామీర్‌పేట, తుర్కపల్లి, ఒంటి మామిడి, ములుగు, గౌరారం, ప్రజ్ఞాపూర్, కొడకండ్ల, కుకునూర్‌పల్లి, దుద్దెడ, రామునిపట్ల, ఇబ్రహీంనగర్, సుల్తానాబాద్, పెద్దపల్లిల్లో బైపాస్‌లు నిర్మించాలని సూచించారు.
  • సిద్దిపేట వెలుపల సిద్దిపేట–కరీంనగర్‌ బై–పాస్‌ కూడలి వద్ద దాదాపు 800 మీటర్ల పొడవుతో నాలుగు లేన్ల ఫ్లైఓవర్‌ నిర్మించాలి. సిద్దిపేటలోకి వెళ్లే వాహనాలు.. బై–పాస్‌ మీదుగా కరీంనగర్‌ వైపు వెళ్లే వాహనాలు అక్కడ వేరు పడతాయి. 
  • సిద్దిపేట శివారులోని ఎల్కతుర్తి వద్ద సిద్దిపేట–వరంగల్‌ జంక్షన్‌పై భారీ అండర్‌పాస్‌ నిర్మించాలి. వరంగల్‌ వైపు వెళ్లే వాహనాలు పైనుంచి, ప్రధాన కారిడార్‌ దిగువ నుంచి ముందుకు సాగుతుంది. 
  • ఈ రోడ్డును ఆనుకుని ఉన్న 68 గ్రామాల వద్ద ప్రత్యేంగా బస్‌–బేలను ఏర్పాటు చేయాలి. ప్రయాణికుల బస్సులు రోడ్డుపై ఆగితే ప్రమాదాలు జరుగుతున్నందున... కొంత దిగువకు వెళ్లి ఆగుతాయి. ఇందుకోసం 20 ఎకరాలను ప్రత్యేకంగా సేకరించాల్సి ఉంది.  
  • నాలుగు లేన్ల రోడ్లలో సాధారణంగా సెంట్రల్‌ మీడియన్‌ 4.5 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. కానీ ఈ రోడ్డుపై 1.5 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేశారు. రాత్రివేళ ఎదురుగా వచ్చే వాహనాల ఫోకస్‌ లైట్లు డ్రైవర్లకు ఇబ్బందిగా మారింది. ఇప్పుడు దాన్ని వెడల్పు చేయాలంటే రోడ్డు నుంచి విస్తరించాలి. 

సమన్వయం లేని ‘మిషన్‌’..!
ప్రతి ఊరికి రక్షిత మంచినీటిని చేరవేసే మిషన్‌ భగీరథ ప్రాజెక్టు విషయంలో అధికారులు అనుసరించిన తీరు కొన్ని రోడ్ల విస్తరణకు శాపంగా మారింది. సాధారణంగా ఇలాంటి భారీ ప్రాజెక్టులు కొనసాగించేప్పుడు మిగతా విభాగాలతో సమన్వయం అవసరం. కానీ అది లోపించింది. వరంగల్‌–కరీంనగర్‌ హైవే ప్రస్తుతం రెండు వరుసలుగా ఉంది. ఈ రోడ్డుపై వాహనాల సంఖ్య విపరీతంగా పెరగటంతో నాలుగు వరుసలకు విస్తరించాలని చాలాకాలంగా అనుకుంటున్నారు. దీంతో రాష్ట్ర రహదారి నుంచి జాతీయ రహదారిగా ప్రతిపాదించారు. దీనికి కేంద్రం సమ్మతించటంతో విస్తరణ బాధ్యతను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కి అప్పగించారు. రోడ్డును విస్తరించే యోచనలో ఉన్న విషయం అన్ని విభాగాల అధికారులకు తెలుసు. కానీ మిషన్‌ కాకతీయ ప్రాజెక్టు అధికారులు దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా రోడ్డు విస్తరణకు ఉద్దేశించి గతంలోనే ఆర్‌అండ్‌బీకి సేకరించి పెట్టిన వందల అడుగుల స్థలంలో పైప్‌లైన్లు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఆర్‌అండ్‌బీ అధికారులు అభ్యంతరం చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు.

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని చూసుకో వాల్సిన ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు రోడ్డును విస్తరించాలంటే ఆ పైపులైన్లను తొలగించాల్సి వస్తోంది. దీన్ని తప్పించేందుకు అధికారులు కొత్త పంథాను అనుసరించేందుకు నడుం బిగించారు. పైప్‌లైన్‌ లేని మరోవైపు ఎక్కువ స్థలాన్ని సేకరించి అటువైపు మాత్రమే రోడ్డును విస్తరించాలనేది ఆ ఆలోచన. దీంతో అటువైపు ఉన్న ప్రజలు, తమ భూములు ఎక్కువగా పోతున్నాయని దానికి అంగీకరించడం లేదు. ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాల్సి ఉన్నా.. ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు ప్రజాగ్రహాన్ని తప్పించుకునేందుకు ఒత్తిడి తెచ్చి ఆ ప్రతిపాదనను పెండింగ్‌లో పెట్టేలా చేశారు. దీంతో రోడ్డు విస్తరణ పడకేసింది. అదే ఇరుకు రోడ్డు కొనసాగుతుండటం.. వాహనాల సంఖ్య ఇంకా పెరుగుతుండటంతో ఈ రోడ్డుపై తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మిషన్‌ భగీరథ పైపులైన్‌ లేకుండా ఉండి ఉంటే.. ఈపాటికి విస్తరణ పని మొదలై కొన్ని చోట్ల రోడ్డు విశాలంగా మారి ఉండేది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement