mission bhagiratha works
-
డ్రైవర్‌ను సస్పెన్షన్ చేసిన ఆర్టీసీ అధికారులు.. దీనితో డ్రైవర్ తీవ్రనిర్ణయం..
గోపాల్పేట: ఉరేసుకుని ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం తాడిపర్తిలో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు వివరాల మేరకు.. తాడిపర్తికి చెందిన చంద్రశేఖర్‌గౌడ్ (52) కొన్నేళ్లుగా ఆర్టీసీ డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు. నాలుగు నెలల కిందట ఆర్టీసీ అధికారులు చంద్రశేఖర్‌గౌడ్‌ను సస్పెన్షన్ చేశారు. అప్పటి నుంచి తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులకు తోడు కుటుంబ సభ్యులు అతడిపై కోపంతో ఇటీవల హైదరాబాద్‌కు వెళ్లారు. గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com విద్యుదాఘాతంతో ‘భగీరథ’ లైన్‌మేన్ మృతి గోపాల్పేట: విద్యుదాఘాతంతో మిషన్ భగీరథ పథకం లైన్‌మేన్ మృతి చెందిన ఘటన గోపాల్పేట మండలం తాడిపర్తిలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. తాడిపర్తిలో మిషన్ భగీరథ ప్రధాన పైప్‌లైన్ లీకేజీ అయింది. పైప్‌లైన్‌కు మరమ్మతు చేసేందుకుగాను కాశీంనగర్‌కు చెందిన వాటర్‌మేన్ సతీష్ (45) వెల్డింగ్ మిషన్‌కు విద్యుత్ కనెక్షన్ ఇచ్చే క్రమంలో ప్రమాదవశాత్తు షాక్‌కు గురయ్యాడు. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయంపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. పోక్సో కేసులో 20ఏళ్ల జైలుశిక్ష చిన్నచింతకుంట: పోక్సో కేసులో నిందితుడికి మహబూబ్‌నగర్ ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి శుక్రవారం 20ఏళ్ల జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. చిన్నచింతకుంట మండలం లాల్‌కోటకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పోగుల రాజుపై 2018లో పోక్సో కేసు నమోదైంది. కోర్టులో వాదోపవాదాల అనంతరం నేరం రుజువు కావడంతో నిందితుడికి 20ఏళ్ల జైలుశిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని ఎస్ఐ శేఖర్ తెలిపారు. -
మిషన్ భగీరథపై మంత్రుల సమీక్ష
సాక్షి, నల్గొండ: మిషన్ భగీరథపై నల్గొండలో బుధవారం ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ... మిషన్ భగీరథ పనులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. రూ. 40,123 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పనులు 95 శాతం ఇప్పటికే పూర్తి చేశామన్నారు. మూడు సంవత్సరాలలో 95 శాతం పనులు పూర్తి చేయడం చారిత్రాత్మకం అన్నారు. మిగిలిన 5 శాతం పనులలో లోపాలు ఉన్నాయన్నారు. అందుకే సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏజెన్సీలను వెంటనే అక్కడి నుంచి మార్చాలన్నారు. ఇప్పటికే చాలా మందిని మార్చం, ఇంకా కొందరిని మార్చాల్సి ఉందని ఎర్రబెల్లి తెలిపారు. ఏజెన్సీల నిర్లక్ష్యం ఈ పథకానికి శాపంగా మారకూడదన్నారు. (‘కోవిడ్’ కేసుల్లో చార్జ్‌షీట్స్! ) మరోవైపు మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, నల్గొండ జిల్లా కోసమే మిషన్ భగీరథ పథకం రూపుదాల్చింన్నారు. అన్ని ప్రాంతాలకు సురక్షితమైన నీటినిఅందించే బృహత్తర పథకం మిషన్ భగీరథ అని అన్నారు. ఫ్లోరిన్ ప్రాంతంగా ముద్రపడ్డ మునుగోడులోనే పైలాన్ నిర్మాణం జరిగిందన్నారు. నది జలాలు నేరుగా ఇంటింటికి అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమన్నారు. మూడేళ్లలోనే ప్రాజెక్ట్ పనులు దాదాపుగా పూర్తి చేయడం ప్రసంశించదగ్గ విషయమన్నారు. పనులన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి అధికారులు సన్నద్ధం కావాలన్నారు. మంత్రులతో పాటు ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల నరసింహయ్య, యన్ భాస్కరరావు, రవీంద్ర నాయక్, చిరుమర్తి లింగయ్య, నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ పాల్గొన్నారు. (వాహనాలను ఆ మార్గంలో అనుమతించడం లేదు) -
వీడియోకాల్‌తో ప్రతీ ఇంటి నల్లా పరిశీలన
సాక్షి, హైదరాబాద్: సోషల్ ఆడిట్లో భాగంగా ప్రతీ ఇంటి నల్లా కనెక్షన్‌ను వీడియో కాల్ ద్వారా పరిశీలించనున్నట్లు మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సబర్వాల్ వెల్లడించారు. ఇంటింటికి నల్లాతో నీరు సరఫరా అవుతున్న తీరుపై సర్పంచ్‌లతో త్వరలోనే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు. శుక్రవారం ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. అత్యుత్తమ ప్రమాణాలు, నీటి శుద్ధి ప్రక్రియతో సరఫరా అవుతున్న భగీరథ నీటిని తాగేలా ప్రజలను చైతన్య పరచాలని సూచించారు. పరిగి, గట్టు మండలాల స్థానిక ప్రజాప్రతినిధులకు భగీరథ నీటి వినియోగంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమాలకు మంచి బాగుందని అధికారులను అభినందించారు. ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న వారు తమ గ్రామా ల్లోని ప్రజలంతా భగీరథ నీటినే వినియోగించేలా చైతన్యపరుస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. సమావేశంలో ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్, చీఫ్ ఇంజనీర్లు జగన్మోహన్రెడ్డి, విజయపాల్‌రెడ్డి, విజయ్‌ప్రకాశ్, వినోభాదేవి, చెన్నారెడ్డి, రమేశ్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. -
అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
సాక్షి, సదాశివనగర్(నిజామాబాద్) : మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైంది. కరెంట్ షాక్ రూపంలో యువకుడు అకాల మరణం చెందాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం మండలంలోని మర్కల్ మల్లన్న గుట్ట వద్ద గల మిషన్ భగీరథ పంప్ హౌస్‌లో చోటు చేసుకుంది. రామారెడ్డి మండలంలోని పోసానిపేట్ గ్రామానికి చెందిన బొప్పారం నర్సింలు(36) అనే యువకుడు ఆరు నెలలుగా పంప్‌హౌస్‌లో ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో దానికి సమీపంలో ఉన్న పవర్ హౌస్‌లో భారీ శబ్ధం వినిపించడంతో అక్కడికి వెళ్లి పవర్‌ను సరిదిద్దుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలింది. దీంతో ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోసానిపేట్‌వాసులు పెద్ద ఎత్తున మల్లన్నగుట్టకు తరలివచ్చారు. మృతుడికి భార్య రజిత ఉంది. కుటుంబీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేశ్ తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తరలివచ్చిన ప్రజాప్రతినిధులు అధికారుల నిర్లక్ష్యంతోనే నర్సింలు మృతి చెందాడని పోసానిపేట్‌వాసులు భారీగా వచ్చి ఉదయం 11.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఆందోళన చేశారు. బాధిత కుటుంబానికి తగిన పరిహారం చెల్లించాలని శవంతో పంప్‌హౌస్ వద్ద బైఠాయించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలన్నారు. ఈ మేరకు పవర్‌హౌస్ నుంచి రూ.4లక్షలు, మిషన్ భగీరథ పథకం ద్వారా రూ.5లక్షలు అందిస్తామని, మృతుడి భార్య రజితకు మిషన్ భగీరథలో ఉద్యోగం కల్పిస్తామని చెప్పడంతో ఆందోళనను విరమించారు. ఘటనా స్థలాన్ని పోసానిపేట్ సర్పంచ్ గీరెడ్డి మహేందర్‌రెడ్డి, ఎంపీపీ నారెడ్డి దశరథ్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పడిగెల రాజేశ్వర్ రావు సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో డీఎస్పీ సత్తన్న, సీఐ రామాంజనేయులు, ఎస్ఐ, పోలీసులు పాల్గొన్నారు. ప్రాణం ఖరీదు రూ.9లక్షలు..! అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి కరెంట్ షాక్‌కు గురై చనిపోతే ఆ మనిషి శవాన్ని రూ.9లక్షలు ఖరీదు చేశారు. మని షి విలువ ఇంతేనా అని పలువురు అనుకోవడం చర్చనీయాంశంగా మారింది. మనిషి చనిపోతే బాధిత కుటుంబానికి చెల్లించే పరిహారం ఎందుకు పని చేయదని వారు పేర్కొంటున్నారు. ఈ నిర్లక్ష్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకో వాలని కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. -
అస్తవ్యస్తంగా ’మిషన్ భగీరథ’
సాక్షి,ఉప్పునుంతల : నాగర్‌కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలంలోని రాయిచేడ్లో మిషన్ భగీరథ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. దీంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలో వీధుల వెంట వేసిన పైప్‌లైన్ పనులు సరిగా చేయకపోవడంతో లీకేజీలతో త్రాగునీరు వృథాగా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇంటింటికీ నల్లా కనెక్షన్లో భాగంగా వేసి ఉంచిన పైప్‌లకు తూతూ మంత్రంగా నల్లాలు అమర్చారని తెలిపారు. కాంట్రాక్టర్ కేవలం వంతుకు గంతేసినట్లు పనులు చేపట్టారని ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు పనులను పర్యవేక్షించలేదని తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవడంతోపాటు భగీరథ పనులను నాణ్యతతో చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
గడువులోగా ‘భగీరథ’ గగనమే
‘రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం పనులను మార్చి 31 వరకు పూర్తి చేసి, ఏఫ్రిల్1 నుంచి ఇంటింటికీ తాగునీరు అందించాలి. 1 తర్వాత ఏ ఇంటి నుంచి కూడా మహిళ తాగునీటి కోసం గడప దాటి బయటకు రాకుండా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వాధికారులు శ్రద్ధపెట్టి నిర్దేశించిన గడువులోగా పైపులైన్ పనులు పూర్తి చేసి తాగునీటిని అందిచాలి.’ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాక మిషన్ భగీరథ పథకం అమలు తీరుపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇవీ. సాక్షి,బెల్లంపల్లి: బెల్లంపల్లిలో మిషన్ భగీరథ పథకం పనులు సీఎం చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పనులను పరిశీలిస్తే మరో మూడు, నాలుగు నెలలు గడిస్తే కానీ భగీరథ పనులు పూర్తయ్యేలా లేవు. పనులు నత్తనడకన సాగుతుండడంతో ఈ వేసవిలో కూడా పుర ప్రజలకు నీటి కష్టాలు తప్పేటట్లు కనిపించడం లేదు. మిషన్ భగీరథ పథకం ద్వారా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని అడ ప్రాజె క్టు నుంచి అంతర్గత పైపులైన్ ద్వారా బెల్లంపల్లి పుర ప్రజలకు తాగునీటిని అందించాలని సంకల్పించింది. ఇందుకు సంబంధించి పైపులైన్ పనులు ఆసిఫాబాద్ నుంచి బెల్లంపల్లి వరకు పూర్తి అ య్యాయి. కాని మున్సిపాలిటీ పరిధిలో యూఎల్ఎస్ఆర్, జీఎల్బీఆర్ల నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. వీటి పనులు మందకొడిగా సాగుతుండడంతో ఇప్పట్లో పూర్తి అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ కారణంగా ఇన్నాళ్ల నుంచి భగీరథ పథకం పనులకు గ్రహణం పట్టగా ఇప్పుడిప్పుడే నిర్మాణ పనులను ప్రారంభించారు. అసంపూర్తిగా పైపులైన్ పనులు.. మున్సిపాలిటీలో మొత్తం 34 వార్డులు ఉన్నాయి. ప్రతి ఇంటికి తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంది. అయితే మంచిర్యాల – బెల్లంపల్లి గోదావ రి నీటి పథకం పైపులైన్లు మాత్రమే వార్డులలో ఉన్నాయి. వీటికి అనుబంధంగా పలు వార్డులలో మిషన్ భగీరథ పైపులను అనుసంధానం చేయాల్సి ఉండగా, మరికొన్ని వార్డులలో కొత్తగా పైపులను విస్తరించాలి. ప్రజారోగ్యశాఖ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని, ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 8 నుంచి 10 కిలో మీటర్ల దూరం వరకు పైపులైన్ వేయాల్సి ఉంది. ఆయా పనులన్నీ ఎక్కడికక్కడ నిలిచి పోవడంతో పుర ప్రజలకు తాగునీ టిని సరఫరా చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. స్పందించని అధికారులు.. మిషన్ భగీరథ పథకం పనుల నిర్వహణపై ప్రజారోగ్యశాఖ అధికారుల్లో కనీసం చలనం లేకుండా పోయింది. ఏళ్లు గడుస్తున్నా పనులు పూర్తి కావట్లేదు. ఇటీవలే ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య క్యాంపు కార్యాలయం లో ప్రభుత్వ శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, వేసవిలో పుర ప్రజలకు తాగునీటి కష్టాలు ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. తాగునీటి సమస్య ఏర్పడితే బాధ్యులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సీఎం చెప్పినట్లుగా మిషన్ భగీరథ పథకం పనులు పూర్తి చేయడానికి ఇంకా కేవలం నెల రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. అప్పటి వరకు పనులు పూర్తి చేస్తారో? లేదో? వేచి చూడాల్సిందే. -
‘అందరి సహకారంతోనే బంగారు తెలంగాణ’
ఊట్కూర్ : అందరి సహకారంతోనే బంగారు తెలంగాణ సాధ్యమని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని తిమ్మారెడ్డిపల్లి తండాలో మిషన్ భగీరథ ట్యాంకుల శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కె దక్కుతుందన్నారు. రాష్ట్రంలో 500 పై ఓటర్లు కలిగిని గ్రామాలను పంచాయతీలు గుర్తించామన్నారు. తండాను గ్రామ పంచాయతీగా ఎన్నుకున్నందుకు తాండ వాసులు శాలువ, పూలమాలలతో సన్మానించారు. వివిధ పార్టీల నాయకులు, మహిళలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. కార్యక్రమంగా జెడ్పీటీసీ సూర్య ప్రకాశ్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ అరవింద్ కుమార్, సర్పంచ్ విజయ భాస్కర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ విజయసింహారెడ్డి, ఎంపీటీసీ కృష్ణర్జున్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భద్రతకు దారేది?
నాలుగు రోజుల క్రితం.. ఆర్టీసీ బస్సు–రెండు లారీలు–ఓ క్వాలిస్ ఢీకొని 13 నిండు ప్రాణాలు బలయ్యాయి.. అది రాజీవ్ రహదారి ..ఈ నాలుగు వరుసల రోడ్డును అనేక లోపాలతో నిర్మించారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదాలకు ఆస్కారమిచ్చే రోడ్డు ఇది. దీని లోటుపాట్లను కొంతమేర సరిదిద్దేందుకు రోడ్లు భవనాల శాఖ డీపీఆర్ రూపొందించి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి పంపింది. కానీ సచివాలయంలో ఆ ఫైలు మూడేళ్లుగా దుమ్ముకొట్టుకుపోతోంది. ఇక్కడ జనం ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి! మంగళవారం.. బస్సు–లారీ ఢీకొని ఏడుగురు ప్రాణాలు విడిచారు. ఇది వరంగల్–కరీంనగర్ జాతీయ రహదారి! ..వాహనాల రద్దీ అధికంగా ఉండే ఈ రెండు వరుసల రోడ్డును నాలుగు లేన్లకు విస్తరించాలన్న ప్రణాళిక మూడేళ్లది. కానీ దాంతో తమకు సంబంధం లేదన్నట్టుగా మిషన్ భగీరథ అధికారులు రోడ్డును ఆనుకునే భారీ పైప్‌లైన్ నిర్మించారు. రోడ్డును విస్తరించాలంటే పైప్‌లైన్‌ను తొలగించాలి. కానీ ఎలా? ఈ ఆలోచనతోనే పనులు అటకెక్కాయి. ఇరుకురోడ్డుపై రక్తం పారుతోంది! సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి రామగుండం వరకు 248 కి.మీ. మేర ఉన్న రాజీవ్ రహదారిని 2010లో రూ.1,400 కోట్లతో 4 వరుసలుగా విస్తరించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న భారీ వృక్షాలను కొట్టేసి రెండు వైపులా రోడ్డు వేసి పని ముగిసిందనిపించారు. ఎక్కడా శాస్త్రీయ సర్వేకు అవకాశమే ఇవ్వకుండా నిర్లక్ష్యంగా రోడ్డును వెడల్పు చేశారు. ఇక ఆ తర్వాత వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సభాసంఘం వేసి విచారణకు ఆదేశించింది. నిపుణులతో కలసి రోడ్డును ఆసాంతం పరిశీలించిన సంభాసంఘం.. ఆ రోడ్డు అత్యంత నాసిరకంగా ఉందని, అనేక లోపాలున్నాయని తేల్చింది. తెలంగాణ ఏర్పడి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రోడ్లు, భవనాల శాఖ దానికి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అధికారులు రోడ్డును పరిశీలించి కొన్ని సూచనలతో ప్రభుత్వానికి మరో నివేదిక అందించారు. రూ.వెయ్యి కోట్లతో డీపీఆర్ రూపొందించి పంపారు. కానీ మూడేళ్లు గడుస్తున్నా ఆ ఫైల్ తిరిగి రాలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకపోవటంతో లోపాలు సరిదిద్దే పనులు ఇప్పటి వరకు మొదలు కాలేదు. రోడ్లు భవనాల శాఖ చేతులెత్తేసి ఆ రోడ్డును వదిలేసింది. ఆ ప్రతిపాదనలు ఇవే... నాలుగు వరుసల రోడ్డు, మధ్యలో సెంట్రల్ మీడియన్ ఉండటంతో వాహనాల వేగం అధికంగా ఉంటుంది. ఇలాంటి రోడ్లు ఎట్టి పరిస్థితుల్లో ఊళ్ల మధ్య నుంచి సాగటానికి వీల్లేదు. ఇందుకు ఈ రోడ్డుపై బైపాస్‌ల నిర్మాణం ముఖ్యమని నిపుణులు తేల్చారు. శామీర్‌పేట, తుర్కపల్లి, ఒంటి మామిడి, ములుగు, గౌరారం, ప్రజ్ఞాపూర్, కొడకండ్ల, కుకునూర్‌పల్లి, దుద్దెడ, రామునిపట్ల, ఇబ్రహీంనగర్, సుల్తానాబాద్, పెద్దపల్లిల్లో బైపాస్‌లు నిర్మించాలని సూచించారు. సిద్దిపేట వెలుపల సిద్దిపేట–కరీంనగర్ బై–పాస్ కూడలి వద్ద దాదాపు 800 మీటర్ల పొడవుతో నాలుగు లేన్ల ఫ్లైఓవర్ నిర్మించాలి. సిద్దిపేటలోకి వెళ్లే వాహనాలు.. బై–పాస్ మీదుగా కరీంనగర్ వైపు వెళ్లే వాహనాలు అక్కడ వేరు పడతాయి. సిద్దిపేట శివారులోని ఎల్కతుర్తి వద్ద సిద్దిపేట–వరంగల్ జంక్షన్‌పై భారీ అండర్‌పాస్ నిర్మించాలి. వరంగల్ వైపు వెళ్లే వాహనాలు పైనుంచి, ప్రధాన కారిడార్ దిగువ నుంచి ముందుకు సాగుతుంది. ఈ రోడ్డును ఆనుకుని ఉన్న 68 గ్రామాల వద్ద ప్రత్యేంగా బస్–బేలను ఏర్పాటు చేయాలి. ప్రయాణికుల బస్సులు రోడ్డుపై ఆగితే ప్రమాదాలు జరుగుతున్నందున... కొంత దిగువకు వెళ్లి ఆగుతాయి. ఇందుకోసం 20 ఎకరాలను ప్రత్యేకంగా సేకరించాల్సి ఉంది. నాలుగు లేన్ల రోడ్లలో సాధారణంగా సెంట్రల్ మీడియన్ 4.5 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. కానీ ఈ రోడ్డుపై 1.5 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేశారు. రాత్రివేళ ఎదురుగా వచ్చే వాహనాల ఫోకస్ లైట్లు డ్రైవర్లకు ఇబ్బందిగా మారింది. ఇప్పుడు దాన్ని వెడల్పు చేయాలంటే రోడ్డు నుంచి విస్తరించాలి. సమన్వయం లేని ‘మిషన్’..! ప్రతి ఊరికి రక్షిత మంచినీటిని చేరవేసే మిషన్ భగీరథ ప్రాజెక్టు విషయంలో అధికారులు అనుసరించిన తీరు కొన్ని రోడ్ల విస్తరణకు శాపంగా మారింది. సాధారణంగా ఇలాంటి భారీ ప్రాజెక్టులు కొనసాగించేప్పుడు మిగతా విభాగాలతో సమన్వయం అవసరం. కానీ అది లోపించింది. వరంగల్–కరీంనగర్ హైవే ప్రస్తుతం రెండు వరుసలుగా ఉంది. ఈ రోడ్డుపై వాహనాల సంఖ్య విపరీతంగా పెరగటంతో నాలుగు వరుసలకు విస్తరించాలని చాలాకాలంగా అనుకుంటున్నారు. దీంతో రాష్ట్ర రహదారి నుంచి జాతీయ రహదారిగా ప్రతిపాదించారు. దీనికి కేంద్రం సమ్మతించటంతో విస్తరణ బాధ్యతను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కి అప్పగించారు. రోడ్డును విస్తరించే యోచనలో ఉన్న విషయం అన్ని విభాగాల అధికారులకు తెలుసు. కానీ మిషన్ కాకతీయ ప్రాజెక్టు అధికారులు దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా రోడ్డు విస్తరణకు ఉద్దేశించి గతంలోనే ఆర్‌అండ్‌బీకి సేకరించి పెట్టిన వందల అడుగుల స్థలంలో పైప్లైన్లు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఆర్అండ్బీ అధికారులు అభ్యంతరం చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని చూసుకో వాల్సిన ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు రోడ్డును విస్తరించాలంటే ఆ పైపులైన్లను తొలగించాల్సి వస్తోంది. దీన్ని తప్పించేందుకు అధికారులు కొత్త పంథాను అనుసరించేందుకు నడుం బిగించారు. పైప్‌లైన్ లేని మరోవైపు ఎక్కువ స్థలాన్ని సేకరించి అటువైపు మాత్రమే రోడ్డును విస్తరించాలనేది ఆ ఆలోచన. దీంతో అటువైపు ఉన్న ప్రజలు, తమ భూములు ఎక్కువగా పోతున్నాయని దానికి అంగీకరించడం లేదు. ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాల్సి ఉన్నా.. ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ప్రజాగ్రహాన్ని తప్పించుకునేందుకు ఒత్తిడి తెచ్చి ఆ ప్రతిపాదనను పెండింగ్‌లో పెట్టేలా చేశారు. దీంతో రోడ్డు విస్తరణ పడకేసింది. అదే ఇరుకు రోడ్డు కొనసాగుతుండటం.. వాహనాల సంఖ్య ఇంకా పెరుగుతుండటంతో ఈ రోడ్డుపై తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మిషన్ భగీరథ పైపులైన్ లేకుండా ఉండి ఉంటే.. ఈపాటికి విస్తరణ పని మొదలై కొన్ని చోట్ల రోడ్డు విశాలంగా మారి ఉండేది. -
‘భగీరథ’ పనులు పూర్తి చేయాలి
హుజూరాబాద్ : తెలంగాణ మున్సిపల్ డెవలప్మెంట్ ప్లాన్(టీఎండీపీ) నిధులతో హుజూరాబాద్ పట్టణంలో చేపట్టిన మిషన్ భగీరథ పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో గురువారం మున్సిపల్, పబ్లిక్ హెల్త్, ఆర్అండ్బీ, ఐబీ శాఖల అధికా రులతో సమీక్ష నిర్వహించారు. పనుల ప్రగతిపై అధికారులనడిగి తెలుసుకున్నారు. పైప్ లైన్ పనులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ట్ర యల్ రన్ చేయడానికి అవసరమైనవిధంగా పనుల్లో మరింత వేగం పెంచాలని సూచించా రు. మరో 4 నెలల్లో పైప్‌లైన్ పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు సంబంధిత శాఖ అధికారులు వివరించారు. హుజూరాబాద్ పట్టణంలో టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.15కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనుల ప్రతిపాదనలపై మున్సిపల్ కమిషనర్ స్వరూపరాణిని అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా చేపట్టనున్న జంక్షన్ల ఏర్పాటు, పనుల నిర్వహణలో చేర్పులుమార్పులపై పలు సూచనలు చేశారు. రూ.కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. హుజూ రాబాద్–జమ్మికుంట రోడ్డు వెడల్పు పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని అడిగారు. రోడ్డు వెడల్పులో భాగంగా ఇళ్లు కోల్పోతున్న యజమానులు నష్టపరిహారం అడుగుతున్నారని, దీంతో కొంత ఆలస్యమవుతున్నట్లు అధికారులు వివరించారు. పట్టణ సమీపంలోని మోడల్ చెరువు వద్ద చేపట్టిన మినీ ట్యాంక్‌బండ్ పనుల ప్రగతి వివరాలడిగి తెలుసుకున్నారు. ఆర్డీవో బోయపాటి చెన్నయ్య, మున్సిపల్ కమిషనర్ స్వరూపరాణి, పబ్లిక్ హెల్త్ ఈఈ భద్రయ్య, ఆర్అండ్బీ ఈఈ రాఘవాచార్యులు, డీఈ కృష్ణారెడ్డి, ఏఈ రాజునాయక్, మున్సిపల్ ఇంజినీర్ చంద్రమౌళి, తహసీల్దార్ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. -
దప్పిక తీరేదెలా?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘పల్లెల్లో తాగునీటికి కష్టమవుతోంది. బిందెడు నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయంటారు. ఇంతవరకు వరకు దిక్కులేదు. గడువు ముగిసినా ఇంకా పనులు పూర్తికాలేదు. మరోపక్క బోర్లలో నీళ్లు లేవు. కొత్త బోర్లు వేయరు. ప్రజలు ఏం తాగాలి? అనిప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. ప్రధానంగా తాగునీరు, విద్యుత్, రోడ్ల అంశాలపై ప్రజాప్రతినిధులు సమస్యలను లేవనెత్తారు. జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునితా మహేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మిషన్ భగీరథ పనులు కొనసాగుతున్న తీరుపై పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మిషన్ భగీరథ పనులు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఎక్కడి పైపులు అక్కడే వేస్తున్నారు. కొన్నింటిని దొంగలు ఎత్తుకెళ్తున్నారు. గ్రామాల్లో అంతర్గత పైపుల ఊసేలేదు’ అని అధికారులపై ఇబ్రహీంపట్నం ఎమ్మల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఎండకు పైపులు కరిగిపోతున్నాయని, పగిలిపోతున్నాయని ఎమ్మెల్సీ యాదవరెడ్డి సమావేశం దృష్టికి తెచ్చారు. పనుల పురోగతిపై సమీక్ష చేయడానికి వచ్చిన కలెక్టర్‌ను కూడా కాంట్రాక్టర్లు, సూపర్వైజర్లు లెక్కచేయడం లేదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భూగర్భ పైపులైన్ వేయడానికి చేవెళ్లలో ఇష్టంవచ్చినట్లు రోడ్లను తవ్వేశారని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. రోజులు గడుస్తున్నా పైపులు వేయడం లేదని, రోడ్ల పక్కన గుంతలను పూడ్చడం లేదని ధ్వజమెత్తారు. దీనిపై మంత్రి మహేందర్‌రెడ్డి సమాధానమిస్తూ.. వీలైనంత త్వరలో పనులు పూర్తిచేసి ఇంటింటికీ నీళ్లందిస్తామన్నారు. ఉమ్మడి జిల్లాకు రూ.3 వేల కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. అభివృద్ధి పనులకు, సంక్షేమ పథకాల అమలుకు ఈ నిధులను వినియోగించాలన్నారు. నిర్మాణంలో ఉన్న సబ్ స్టేసన్ల పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. గ్రామ పంచాయతీల్లో విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో కనెక్షన్లు తొలగిస్తున్నారని మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ప్రస్తావించారు. ప్రజలకు ఇబ్బంది కలగించకుండా బకాయిలు వసూలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బస్సులు లేని గ్రామాల్లో వెంటనే సర్వీసులు నడిపించాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. శామీర్‌పేట బస్సు డిపోను అభివృద్ధి చేస్తామన్నారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటి గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు. నీటితొట్లు ఏర్పాటు చేయండి గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారించాలని జెడ్పీ చైర్పర్సన్ సునితారెడ్డి అధికారులను ఆదేశించారు. ఎండాకాలం జీవాలకు పశుగ్రాసం, నీటి కొరత ఉంటున్న దృష్ట్యా నీటి తొట్లు ఏర్పాటు చేయాలన్నారు. వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి వినియోగంలోకి తీసుకరావాలని సూచించారు. మూడు విడతలుగా చెక్కులు ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం కింద రైతులకు ఆర్డర్ చెక్కులను అందజేస్తామని కలెక్టర్ రఘునందన్‌రావు తెలిపారు. రైతులు తమ గుర్తింపు కార్డు చూపించి చెక్కులను తీసుకోవాలన్నారు. మూడు విడతల్లో చెక్కుల పంపిణీ ఉంటుందని, 90 శాతం కంటే ఎక్కువ భూ రికార్డులు సరిగా ఉంటే అక్కడ మొదటి విడతలో పంపిణీ చేస్తామన్నారు. ఒక్కో గ్రామంలో నాలుగు రోజులపాటు చెక్కులను ఏఈఓ, వీఆర్ఓల ద్వారా అందజేస్తామని వివరించారు. ఈ చెక్కులను రాష్ట్రంలో ఏ బ్యాంకు బ్రాంచ్ నుంచైనా తీసుకోవచ్చన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప కొత్తగా బోర్లు వేయడానికి ప్రభుత్వం అనుమతించలేదని ఆయన వివరించారు. బోర్లు వేయకున్నా ప్రజలకు నీరందించే బాధ్యత యంత్రాంగంపై ఉందన్నారు. అనుమతులు లేని క్రషర్లను తొలగించాలని మైనింగ్ అధికారులకు సూచించారు. సాదాసీదాగా.. ఉదయం 11.15 గంటలకు ప్రారంభమైన సర్వసభ్య సమావేశం మధ్యాహ్నం 2.45 ముగిసింది. ఆద్యంతం సాదాసీదాగా కొనసాగిన ఈ సమావేశానికి పలువురు జెడ్పీటీసీలు డుమ్మా కొట్టారు. ఉమ్మడి జిల్లా వారీగా సమావేశం నిర్వహిస్తుండడం వల్ల అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరగడం లేదని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. 18 అంశాలు అతిముఖ్యమైనవి ఉన్నా.. 8 అంశాలతోనే ముగించాల్సి వస్తోందన్నారు. ఇకపై ఉమ్మడి జిల్లా వారీగా కాకుండా.. కొత్త జిల్లాల వారీగా సమావేశం నిర్వహిస్తే సమావేశానికి న్యాయం చేసినవారమవుతామని పేర్కొన్నారు. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేవారు. రైతులకు వీలైనంత త్వరగా సాయమందించాలన్నారు. -
ఫ్లో కంట్రోల్
నిజామాబాద్‌అర్బన్: మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగు నీటిని అందించడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం.. ప్రతి ఇంటికీ సమాన స్థాయిలో నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటోంది. ఎత్తు, పల్లాలు ఉన్న ప్రాంతాల్లోనూ ఒకే విధంగా నీరు సరఫరా అందించేలా చూస్తోంది. ఇందుకోసం నూతన పద్ధతిని అమలులోకి తీసుకొస్తోంది. ఇంటింటికి నల్లా ద్వారా నీరు అందించే క్రమంలో నీటి సరఫరాలో లోపాలు ఏర్పడకుండా, ప్రతి ఇంటికీ సమాన స్థాయిలో నీరందేలా కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. మిషన్ భగీరథ పైప్లైన్లకు ‘ఫ్లో కంట్రోల్ వాల్వ్’ అమర్చడం ద్వారా అన్ని ప్రాంతాలకు సమానంగా నీటిని సరఫరా చేయనుంది. జిల్లావ్యాప్తంగా ఇది వరకే కొన్నిచోట్ల పైప్లైన్లు వేయగా, అవసరమున్న చోట ఆ పైప్లైన్లకు ఫ్లో కంట్రోల్ వాల్వ్‌లు అమర్చుతున్నారు. ముఖ్యంగా ఈ పద్ధతి ద్వారా ఎత్తైన ప్రాంతాలు, తండాలు, మారుమూల గ్రామాలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తొలగనున్నాయి. ఫ్లో కంట్రోల్ వాల్వ్ అంటే.. జిల్లాలో మిషన్ భగీరథ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో వైపు ఇంటింటికి నల్లా కనెక్షన్ల పనులు కూడా కొనసాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 2165.45 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం జరగాల్సి ఉండగా, ఇప్పటికే 670.45 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ నిర్మాణానికిగాను పైపులు సరఫరా అయ్యాయి. కాగా ఇందులో 552.33 కిలోమీటర్ల పైపులైన్ల నిర్మాణం పూర్తయింది. ఇంటింటికి తాగునీరు అందించేందుకు 2,86,494 లక్షల నల్లా కనెక్షన్లు అవసరం ఉండగా, ఇప్పటి వరకు 37,834 నల్లా కనెక్షన్లు అందించారు. ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయి. అయితే అన్ని ప్రాంతాలకు సమానంగా నీరందించేందుకుగాను పైపులైన్లకు ఫ్లో కంట్రోల్ వాల్వ్‌ను అమరుస్తున్నారు. ఈ వాల్వ్‌లను పైప్‌లైన్‌లో అవసరమున్న చోట ఏర్పాటు చేయడం ద్వారా నీరు ఒకే ప్రాంతానికి వేగంగా వెళ్లకుండా, అన్ని ప్రాంతాలకు నీటిని సమానంగా అందే వీలుంటుంది. బంతి మాదిరిగా ఉండే వాల్వ్‌ను పైపులైన్లో ఏర్పాటు చేస్తారు. ఈ వాల్వ్‌కు ఉండే రంధ్రాలు నీటి ఉధృతిని నియంత్రించి, ఒకే ప్రాంతానికి వెళ్లకుండా నీటి సరఫరాను సమన్వయం చేస్తుంది. ఎత్తు నుంచి పల్లానికి నీరు వేగంగా ప్రవహిస్తుంది.. కాబట్టి పైప్లైన్లకు ఈ వాల్వ్‌లను అమర్చుతున్నారు. గ్రామాలు, పట్టణాల్లో ఎత్తుపల్లాలు ఉన్నచోట ఈ విధానం అమలు చేస్తే అందరికి సమానంగా నీరు అందుతుంది. వాల్వ్ ఏర్పాటుకు ప్రాంతాల గుర్తింపు.. ప్రస్తుతం ఆయా గ్రామాల్లో, పట్టణాల్లో ఎత్తుపల్లాలను గుర్తించి పైప్లైన్లకు ఫ్లో కంట్రోల్ వాల్వ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇదివరకే కొన్ని చోట్ల పైప్‌లైన్ నిర్మాణం పూర్తికాగా, ఈ వాల్వ్‌లు ఏర్పాటు చేసేందుకు మళ్లీ తవ్వి పూడ్చివేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఇదివరకే వాల్వ్‌ల ఏర్పాటు కూడా జరిగింది. గతంలో మున్సిపాలిటీల్లో నీటి నియంత్రణకు పైపులకు స్ప్రింగ్‌ల మాదిరి ఉండే పరికరాలను ఏర్పాటు చేసి నీటిని కంట్రోల్ చేసేవారు. అయితే కొన్నిరోజులకు స్ప్రింగ్‌లు సాగకపోవడంతో ఈ పద్ధతి విఫలమైంది. ఈ స్థానంలో ప్రస్తుతం ఫ్లో కంట్రోల్ వాల్వ్ విధానంను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని తండాలు, గ్రామ పంచాయతీలు, ఎత్తు ప్రాంతంలో ఉన్న గ్రామాలు, పట్టణాల్లో శివారు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలను ఇదివరకే గుర్తించారు. మిషన్ భగీరథలో నూతన వాల్వ్ విధానం ద్వారా అన్ని ప్రాంతాలకు సమానంగా నీరందే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. -
నాణ్యతకు తిలోదకాలు.!
తాండూర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం తాండూర్ మండలంలో అభాసుపాలవుతుంది. ఇష్టారీతిన, నిబంధనలు పాటించకుండా ట్యాంక్‌ల నిర్మాణం చేపడుతుండడంతో ప్రభుత్వ చేరేలా కనిపించడం లేదు. ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణంలో నాణ్యతలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుండడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని ఏడు పంచాయతీల పరిధిలో ప్రభుత్వం మిషన్ భగీరథ పనులు చేపట్టింది. మొత్తం 49 ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణంతో పాటు పైప్‌లైన్ నిర్మాణ పనులను ప్రారంభించింది. 49 నీటి ట్యాంకులలో ఇప్పటికీ 15 ట్యాంకుల నిర్మాణాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. ఈ 15లో ఏ ఒక్కటి కూడా పూర్తి కాలేదు. పనుల్లో కనిపించని నాణ్యత... ట్యాంకుల నిర్మాణ పనులు నాణ్యత లేకుండా సాగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాసిరకం ఇసుక వాడకం, క్యూరింగ్ సరిగా చేపట్టడం లేదు. దీంతో నాణ్యతలేమి కొట్టొచ్చినట్లు కనబడుతుంది. నిర్మాణ పనులకు కాం ట్రాక్టర్లు ముందుకు రావడం లేదనే సాకుతో అధికారులు సైతం చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు బాహటంగా విమర్శిస్తున్నారు. పనుల్లో నాణ్య త పాటించక పోవడం, క్యూరింగ్ చేపట్టక పోవడంపై స్థానికులు అధికారులకు ఫిర్యాదులు చేసిన సంఘటనలు ఉన్నా యి. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదు. అధికారులు నిర్లిప్త ధోరణిని అవలంబిస్తుండడంతో ప నులు అస్తవ్యస్తంగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేకు ఫిర్యాదు.. మిషన్ భగీరథ పథకంలో జరుగుతున్న పనుల్లో నాణ్యత పాటించడం లేదని పేర్కొంటూ కొందరు నాయకులు ఎమ్మెల్యే దృష్టికి సైతం తీసుకువెళ్లారని సమాచారం. ఈ విషయంపై ఎమ్మెల్యే ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పూర్తిస్థాయిలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. మండల పరిధిలో రూ.13.81 కోట్లతో మిషన్ భగీరథ పనులు చేపడుతున్నారు. ఇందులో రూ.8.36 కోట్లతో ట్యాంక్‌ల నిర్మాణం, రూ. 6.95 కోట్లతో అంతర్గత పైప్లైన్లు, నల్లా కనెక్షన్ల పనులు చేపడుతున్నారు. ఇంత భారీగా నిధులు వెచ్చించి చేపడుతున్న పనుల్లో నాణ్యత కనిపించ డం లేదు. చివరకు నిధులు దుర్వినియోగమయ్యే అవకాశముందని ప్రజలు చర్చించుకుంటున్నారు. అధికారులు పర్యవేక్షణ జరిపి నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూడాలని కోరుతున్నారు. నిరంతరం పర్యవేక్షిస్తున్నాం మిషన్ భగీరథ ట్యాంక్‌ల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు తీసుకోవడంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాం. పనుల నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాం. క్యూరింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాం. నాసిరకంగా పనులు చేపతితే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటాం. – దివ్య, ఏఈ, ఆర్డబ్ల్యూఎస్, తాండూర్ -
పనుల్లో నిబంధనలు పాటించాలి
జగిత్యాల రూరల్ : మిషన్ భగీరథ పనులు నిబంధనలు పాటించి నిర్వహించాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. బుధవారం జగిత్యాల మండలం ధరూర్ గ్రామంలో రూ. కోటి 26 లక్షలతో లక్ష లీటర్ల సామర్థ్యంతో నిర్మించే వాటర్‌ట్యాంక్ పైప్‌లైన్ పనులను ప్రారంభించారు. అలాగే కన్నాపూర్ గ్రామంలో రూ.3 లక్షలతో నిర్మించే బుడిగజంగాల సామూహిక భవన పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథ పనుల వల్ల గ్రామాల్లో తారురోడ్లు, సీసీరోడ్లు పూర్తిగా దెబ్బతింటున్నాయన్నారు. పనులు కాగానే మరమ్మతులు చేయాల్సి ఉండగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వదిలిపెట్టి వెళ్తున్నారని, దీంతో గ్రామాల్లో ఉన్న రోడ్లన్నీ ధ్వంసం అవుతున్నాయన్నారు. కాంట్రాక్టర్లు ముందుగానే మరమ్మతు పనులకు గ్రామపంచాయతీల్లో డిపాజిట్ చేసి పనులు నిర్వహించాలన్నారు. గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న తాగునీటి పైప్లైన్లు ధ్వంసం కాకుండా స్థానిక నాయకులను సంప్రదించి నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. అవగాహన లేకుండా నిర్మాణ పనులు చేయడం వల్ల గ్రామాల్లో ఉన్న పైప్లైన్లు ధ్వంసం అవుతున్నాయన్నారు. ప్రస్తుతం మిషన్ భగీరథ పనుల నిర్వహణ బాధ్యత ఐదేళ్లపాటు కాంట్రాక్టర్లదేనన్నారు. జెడ్పీటీసీ పెండెం నాగలక్ష్మి, సర్పంచులు కొలుగూరి జలజ, సిరిగిరి తిరుపతి, ఎంపీటీసీలు శీలం సురేందర్, గాలిపల్లి శేఖర్, నాయకులు కొలుగూరి దామోదర్‌రావు, శీలం మల్లేశం, పెండెం రాములు, సతీశ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆగ్రహం మిషన్ భగీరథ నిర్వహణ పనులపై బుధవారం తక్కళ్లపల్లి గ్రామంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ నీటి సరఫరా పైప్లైన్లు మిషన్ భగీరథ పనుల్లో ధ్వంసం కావడంతో ఐదు రోజులుగా తాగునీరు అందకపోవడంతో గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పనులను ఆయన పరిశీలించారు. మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడుతూ స్థానికులను సంప్రదించి పనులు చేయాలని, ప్రస్తుతం గ్రామస్తులకు పైపుల మరమ్మతులతో పాటు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని ఆదేశించారు. రానున్న రోజుల్లో నిర్మాణం చేసే గ్రామాల్లో తాగునీటి పథకాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తగా పనులు నిర్వహించాలన్నారు. ఆయన వెంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం దశరథరెడ్డి, గంగాధర్, మల్లారెడ్డి, సతీశ్ ఉన్నారు. -
‘మిషన్’ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి
భగీరథ, కాకతీయ పనులపై సమీక్షలో కలెక్టర్ నల్లగొండ : మిషన్ భగీరథ పనులు వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భగీరథ పనులు వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేసి కాంట్రాక్టర్లపై ఒత్తిడి పెంచి త్వరితగతిన పనులు పూర్తి చేసేవిధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇంటర్ విలేజ్ పైపులైను పనులు మే నెలాఖరు నాటికి పూర్తిచేసి 153 గ్రామాల్లో తాగునీరు అందించే విధంగా పనులు వేగవంతం చేయాలన్నారు. ఎక్కడైనా పైపులైన్ల లీకేజీ, పగిలిపోవడం జరిగితే తక్షణమే వాటిని మరమ్మతులు చేయించాలని కోరారు. సమీక్షలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రమణ, ఈఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనులు త్వరితగతిన పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో కరువు మండలాల్లో వ్యవసాయ శాఖ, పశుసంవర్ధకశాఖ చేపట్టిన కరువు నివారణ పనుల పై కూడా కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో ఎస్ఈ బి.ధర్మానాయక్, ఈఈలు, జేడీఏ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.