సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి మహేందర్‌రెడ్డి, చిత్రంలో జెడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి, కలెక్టర్ రఘునందన్‌రావు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘పల్లెల్లో తాగునీటికి కష్టమవుతోంది. బిందెడు నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయంటారు. ఇంతవరకు వరకు దిక్కులేదు. గడువు ముగిసినా ఇంకా పనులు పూర్తికాలేదు. మరోపక్క బోర్లలో నీళ్లు లేవు. కొత్త బోర్లు వేయరు. ప్రజలు ఏం తాగాలి? అనిప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. ప్రధానంగా తాగునీరు, విద్యుత్, రోడ్ల అంశాలపై ప్రజాప్రతినిధులు సమస్యలను లేవనెత్తారు. జెడ్పీ చైర్‌పర్సన్ పట్నం సునితా మహేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మిషన్ భగీరథ పనులు కొనసాగుతున్న తీరుపై పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మిషన్ భగీరథ పనులు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఎక్కడి పైపులు అక్కడే వేస్తున్నారు. కొన్నింటిని దొంగలు ఎత్తుకెళ్తున్నారు. గ్రామాల్లో అంతర్గత పైపుల ఊసేలేదు’ అని అధికారులపై ఇబ్రహీంపట్నం ఎమ్మల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఎండకు పైపులు కరిగిపోతున్నాయని, పగిలిపోతున్నాయని ఎమ్మెల్సీ యాదవరెడ్డి సమావేశం దృష్టికి తెచ్చారు.
పనుల పురోగతిపై సమీక్ష చేయడానికి వచ్చిన కలెక్టర్‌ను కూడా కాంట్రాక్టర్లు, సూపర్‌వైజర్లు లెక్కచేయడం లేదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భూగర్భ పైపులైన్ వేయడానికి చేవెళ్లలో ఇష్టంవచ్చినట్లు రోడ్లను తవ్వేశారని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. రోజులు గడుస్తున్నా పైపులు వేయడం లేదని, రోడ్ల పక్కన గుంతలను పూడ్చడం లేదని ధ్వజమెత్తారు. దీనిపై మంత్రి మహేందర్‌రెడ్డి సమాధానమిస్తూ.. వీలైనంత త్వరలో పనులు పూర్తిచేసి ఇంటింటికీ నీళ్లందిస్తామన్నారు. ఉమ్మడి జిల్లాకు రూ.3 వేల కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. అభివృద్ధి పనులకు, సంక్షేమ పథకాల అమలుకు ఈ నిధులను వినియోగించాలన్నారు. నిర్మాణంలో ఉన్న సబ్ స్టేసన్ల పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. గ్రామ పంచాయతీల్లో విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో కనెక్షన్లు తొలగిస్తున్నారని మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ప్రస్తావించారు. ప్రజలకు ఇబ్బంది కలగించకుండా బకాయిలు వసూలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బస్సులు లేని గ్రామాల్లో వెంటనే సర్వీసులు నడిపించాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. శామీర్‌పేట బస్సు డిపోను అభివృద్ధి చేస్తామన్నారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటి గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు.
నీటితొట్లు ఏర్పాటు చేయండి
గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారించాలని జెడ్పీ చైర్‌పర్సన్ సునితారెడ్డి అధికారులను ఆదేశించారు. ఎండాకాలం జీవాలకు పశుగ్రాసం, నీటి కొరత ఉంటున్న దృష్ట్యా నీటి తొట్లు ఏర్పాటు చేయాలన్నారు. వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి వినియోగంలోకి తీసుకరావాలని సూచించారు.
మూడు విడతలుగా చెక్కులు
ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం కింద రైతులకు ఆర్డర్ చెక్కులను అందజేస్తామని కలెక్టర్ రఘునందన్‌రావు తెలిపారు. రైతులు తమ గుర్తింపు కార్డు చూపించి చెక్కులను తీసుకోవాలన్నారు. మూడు విడతల్లో చెక్కుల పంపిణీ ఉంటుందని, 90 శాతం కంటే ఎక్కువ భూ రికార్డులు సరిగా ఉంటే అక్కడ మొదటి విడతలో పంపిణీ చేస్తామన్నారు. ఒక్కో గ్రామంలో నాలుగు రోజులపాటు చెక్కులను ఏఈఓ, వీఆర్‌ఓల ద్వారా అందజేస్తామని వివరించారు. ఈ చెక్కులను రాష్ట్రంలో ఏ బ్యాంకు బ్రాంచ్ నుంచైనా తీసుకోవచ్చన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప కొత్తగా బోర్లు వేయడానికి ప్రభుత్వం అనుమతించలేదని ఆయన వివరించారు. బోర్లు వేయకున్నా ప్రజలకు నీరందించే బాధ్యత యంత్రాంగంపై ఉందన్నారు. అనుమతులు లేని క్రషర్లను తొలగించాలని మైనింగ్ అధికారులకు సూచించారు.
సాదాసీదాగా..
ఉదయం 11.15 గంటలకు ప్రారంభమైన సర్వసభ్య సమావేశం మధ్యాహ్నం 2.45 ముగిసింది. ఆద్యంతం సాదాసీదాగా కొనసాగిన ఈ సమావేశానికి పలువురు జెడ్పీటీసీలు డుమ్మా కొట్టారు. ఉమ్మడి జిల్లా వారీగా సమావేశం నిర్వహిస్తుండడం వల్ల అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరగడం లేదని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. 18 అంశాలు అతిముఖ్యమైనవి ఉన్నా.. 8 అంశాలతోనే ముగించాల్సి వస్తోందన్నారు. ఇకపై ఉమ్మడి జిల్లా వారీగా కాకుండా.. కొత్త జిల్లాల వారీగా సమావేశం నిర్వహిస్తే సమావేశానికి న్యాయం చేసినవారమవుతామని పేర్కొన్నారు. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేవారు. రైతులకు వీలైనంత త్వరగా సాయమందించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment