ప్రపంచ వేగానికి కారకుడు | John Boyd Dunlop tyre inventor | Sakshi
Sakshi News home page

ప్రపంచ వేగానికి కారకుడు

Published Sun, Feb 2 2014 1:27 AM | Last Updated on Thu, Aug 30 2018 5:54 PM

ప్రపంచ వేగానికి కారకుడు - Sakshi

ప్రపంచ వేగానికి కారకుడు

  సత్వం
 మానవ చరిత్రలో ‘చక్రం’ ఆవిష్కరణ తెచ్చిన పురోగతి మామూలుది కాదు! జీవితపు వేగాన్ని చక్రం ప్రభావితం చేసింది. ఆలాంటి చక్రం ఎన్నో చక్రాలుగా బహుముఖీనంగా విస్తరించింది. ఆ చక్రానికి కొనసాగింపయిన ‘టైరు’ ప్రవేశంతో రవాణావ్యవస్థ చాలాముందుకు లంఘించింది.
 అయితే, ఒక కన్నతండ్రి ప్రేమకూ, ఇప్పటి ఆధునిక టైరు రూపకల్పనకూ సంబంధం ఉంది!
 జాన్ బాయ్డ్ డన్‌లప్ తన కొడుకు సమస్యను పరిష్కరించడం కోసం చేసిన సృజన... రవాణావ్యవస్థ రూపురేఖల్ని మార్చేసింది.
 
 స్కాట్లాండ్‌లో 1840 ఫిబ్రవరి 5న జన్మించాడు జాన్ బాయ్డ్ డన్‌లప్. ఎడింబరో విశ్వవిద్యాలయంలో చదివాడు. వృత్తిరీత్యా వెటర్నరీ సర్జన్. కొన్నాళ్ల ప్రాక్టీస్ తర్వాత ఆయన కుటుంబం స్కాట్లాండ్ నుంచి ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్ నగరానికి తరలివచ్చింది.
 
 బెల్‌ఫాస్ట్‌లో రోడ్లు కంకరతేలి ఉండటం, వాటిమీద కొడుకు తన ట్రైసైకిల్‌ను నడపడానికి తిప్పలు పడుతుండటం గమనించాడు డన్‌లప్. ట్రైసైకిల్ అంటే ఇప్పటి పిల్లల ఆటసైకిల్లాంటిది కాదు. పెద్దవాళ్లు కూడా తొక్కుకుంటూ వెళ్లేదే! అప్పటి చక్రాలు ఇనుముతోనో, చెక్కతోనో తయారుచేసేవారు. కొన్నిచోట్ల ఇనుప రీముల చుట్టూతా రబ్బరు చుట్టడం కూడా వినియోగంలోకి వచ్చినా, అది చక్రానికీ, నేలకూ మధ్య ఘర్షణను తగ్గించడానికే ఎక్కువగా ఉపయోగపడింది.
 
 1887 నాటికి అలా రబ్బరు చుడుతున్నారన్న సంగతి బెల్‌ఫాస్ట్‌లో ఇంకా తెలియదు. సహజంగానే డన్‌లప్‌కూ తెలియదు. అయితే, తన కొడుకు ఆ దోవల్లో ట్రైసైకిల్ నడపలేక పడుతున్న అవస్థను గమనించాక, ఆ ఇనుప చక్రాల చుట్టూ రబ్బరు చుడితే ఎలా ఉంటుందన్న ఆలోచన ఆయనలో తనకుతానుగా మొలకెత్తింది. అంతకంటే ముఖ్యం, ఆ రబ్బరులో గాలినింపాలని మరింత ‘అడ్వాన్సు’గా కూడా ఆలోచించాడు. అందుకు ఫుట్‌బాల్లో గాలినినింపే పంపు ఆయనకు పనికొచ్చింది. గాలినింపిన టైరు... నేలకూ, చక్రానికీ మధ్య ‘కుషన్’గా ఉపయోగపడింది. వేగం పెరిగింది. ప్రయాణం సుఖవంతం అయింది. ఇది మరింత ప్రాక్టికల్ విధానం కూడా! చాలా పెద్ద పరిష్కారాలు కూడా అప్పటి తక్షణ సమస్యలోంచే పుడతాయేమో! దళసరి రబ్బరును టైరుగా వాడొచ్చన్న ఆలోచన అదివరకే వేరొకరికి వచ్చివుండటం మూలాన డన్‌లప్ ‘టైరు ఆవిష్కర్త’ కాలేకపోయాడు. కానీ టైరులో గాలినింపి వాడాలన్న ఆలోచన అచ్చంగా ఆయనదే!


 ఈ ‘గాలి నింపిన టైరు’ గురించి ఇంకా ప్రపంచానికి తెలియదు. రెండేళ్ల తర్వాత, 1889లో డన్‌లప్ దాన్ని మరింత ఆధునికపరచి, సైక్లిస్ట్ విలియమ్ హ్యూమ్‌తో తన ఆలోచన పంచుకున్నాడు. ఈ హ్యూమ్ ‘బెల్‌ఫాస్ట్ క్రూయిజర్స్ సైక్లింగ్ క్లబ్’ జట్టు కెప్టెన్. తను రూపొందించిన టైర్లు వాడుతూ హ్యూమ్ పందెంలో పాల్గొనేలా చేశాడు డన్‌లప్. ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగించేలా, హ్యూమ్ ఆ పోటీల్లో విజయం సాధించాడు. దృఢమైన రబ్బరు కంటే గాలి నింపిన టైర్లు వేగవంతమైనవని అలా నిరూపణ జరిగింది. 1921 అక్టోబర్ 23న మరణించిన డన్‌లప్ అలా చరిత్రలో నిలిచిపోయాడు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement