
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ప్రముఖ టైర్ల తయారీ సంస్థ 'రాల్సన్ టైర్స్' (Ralson Tyres) హై-పెర్ఫార్మెన్స్ కమర్షియల్ టైర్‌లను లాంచ్ చేసింది. సైకిల్ టైర్లతో భారతదేశంలో తన వ్యాపారాన్ని ప్రారంభించిన ఈ కంపెనీ.. దేశీయ విఫణిలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కమర్షియల్ టైర్ల విభాగంలోకి కూడా అడుగుపెట్టింది.
టైర్ల విభాగంలో 50 ఏళ్ల చరిత్ర ఉన్న రాల్సన్ టైర్స్.. ఇప్పుడు తన కమర్షియల్ టైర్లను ఇండోర్‌లోని తయారీ కేంద్రంలో తయారు చేయనుంది. ఇప్పటి వరకు చిన్న టైర్లు మాత్రమే తయారైన ఈ ప్లాంట్‌లో పూర్తి స్థాయిలో పెద్ద టైర్ల ఉత్పత్తి జరగనుంది. ఈ టైర్లను భారతదేశంలో విక్రయించడంతో పాటు.. ఉత్తర అమెరికా, యూరప్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యంతో సహా ప్రపంచ మార్కెట్‌లకు ఎగుమతి చేయనుంది. మేక్ ఇన్ ఇండియా చొరవతో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
భారతదేశంలో టైర్ ఎగుమతి విలువను 2030 నాటికి ఐదు బిలియన్లకు పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇండోర్ ఫెసిలిటీలో తయారు చేసిన టైర్లను ఇప్పటికే 170 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇప్పుడు కమర్షియల్ విభాగంలో కూడా కంపెనీ తన హవా చాటుకోవడానికి సిద్ధమైంది.
భారత వాణిజ్య టైర్ల మార్కెట్ గణనీయమైన వృద్ధి చెందుతోంది. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రాల్సన్ టైర్స్ పెద్ద టైర్లను తయారు చేయడానికి పూనుకుంది. ఈ విభాగంలో కూడా కంపెనీ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూ.. కస్టమర్లకు ప్రయోజనాలను చేకూర్చుతూ ముందుకు సాగే అవకాశం ఉందని భావిస్తున్నాము.
హై-పెర్ఫార్మెన్స్ కమర్షియల్ టైర్‌లను లాంచ్ చేసిన సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ 'మంజుల్ పహ్వా' (Manjul Pahwa) మాట్లాడుతూ.. మా ప్రీమియం శ్రేణి వాణిజ్య టైర్లను భారత మార్కెట్‌కు పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ టైర్లు అత్యుత్తమ నాణ్యత, మన్నికతో.. వినియోగదారులకు ప్రయోజనాలను అందిస్తాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment