![old cars Registration renewal cost 8 times more from april 2022 - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/6/old%20cars%20Registration%20renewal.jpg.webp?itok=8YH1ZSRu)
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి 15 ఏళ్లకు మించి పాతబడిన కార్ల రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించుకోవడానికి భారీగా చార్జీలు చెల్లించుకోవాల్సి రానుంది. ప్రస్తుత స్థాయికి ఎనిమిది రెట్లు అధికంగా కట్టాల్సి వస్తుంది. ఈ మేరకు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీని ప్రకారం 15 ఏళ్లు పైబడిన కార్ల రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవడానికి రూ. 5,000 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇది రూ. 600గా ఉంది. ఇక పాత బైక్‌ల రెన్యువల్ కోసం రూ. 1,000 కట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతమిది రూ. 300గా ఉంది. మరోవైపు, 15 ఏళ్లు పైబడిన బస్సు లేదా ట్రక్కు ఫిట్‌నెస్ రెన్యువల్ సర్టిఫికెట్ కోసం రూ. 12,500 (ప్రస్తుతం రూ. 1,500), మధ్యస్థాయి గూడ్స్ లేదా ప్యాసింజర్ వాహనానికి రూ. 10,000 చార్జీలు వర్తిస్తాయి. దిగుమతి చేసుకున్న బైక్‌లకు రూ. 10,000, కార్లకు రూ.40,000 కట్టాల్సి ఉంటుంది.
అదనం..
ఫిట్‌నెస్ సర్టిఫికెట్ గడువు తీరిపోయిన తర్వాత రెన్యువల్ చేసుకోవడంలో జాప్యం జరిగితే రోజుకు రూ. 50 చొప్పున అదనంగా ఫీజు వసూలు చేస్తారు. ఒకవేళ స్మార్ట్ కార్డ్ తరహా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కావాలంటే అదనంగా రూ. 200 కట్టాల్సి ఉంటుంది. ప్రైవేట్ వాహనాల రిజిస్ట్రేషన్‌ను రెన్యువల్ చేసుకోవడంలో జాప్యం జరిగితే ప్రతి నెలకు రూ. 300 చొప్పున అదనంగా ఫీజు చెల్లించాలి. అదే వాణిజ్య వాహనాలకైతే ఇది రూ. 500.
Comments
Please login to add a commentAdd a comment