అవినీతికి లెసైన్స్! | fraud in the government offices | Sakshi
Sakshi News home page

అవినీతికి లెసైన్స్!

Published Tue, Jun 17 2014 2:20 AM | Last Updated on Thu, Aug 30 2018 5:54 PM

అవినీతికి లెసైన్స్! - Sakshi

అవినీతికి లెసైన్స్!

 ప్రభుత్వ కార్యాలయాలంటేనే అవినీతి అక్రమాలు సర్వసాధారణమయ్యాయి. అయితే, వాటన్నింట్లోకల్లా రోడ్డు రవాణా శాఖ (ఆర్టీవో) కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారాయి. లంచాలు తీసుకునేందుకు తామంతా లెసైన్సులు పొందినట్లుగా అక్కడి అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తుంటారు.నేరుగా చేసే అక్రమాలు చాలవన్నట్లు ఏజెంట్లను ప్రోత్సహిస్తున్నారు. వివిధ పనుల కోసం కార్యాలయానికి వచ్చే వారంతా ఏజెంట్ల ద్వారానే తమను సంప్రదించేలా పరిస్థితిని మార్చేశారు. దీంతో ఏజెంట్లు అడిగినంతా ముట్టజెప్పి ఆర్టీవో అధికారులు, సిబ్బంది ద్వారా పనులు చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
 
 దర్శి : రోడ్డు రవాణా శాఖ జిల్లా కార్యాలయం ఒంగోలు నగరంలో ఉండగా, దాని పరిధిలో దర్శి, మార్కాపురం, చీరాల, కందుకూరు పట్టణాల్లో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) కార్యాలయాలున్నాయి. ఆయా కార్యాలయాల్లో డ్రైవింగ్ లెసైన్సులు మంజూరు చేయడం, పలు వాహనాల రిజిస్ట్రేషన్లు, బ్రేక్ చేయించడం తదితర పనులు చేస్తుంటారు. అయితే, కొన్నేళ్లుగా అవినీతికి నిలయాలుగా ఆర్టీవో కార్యాలయాలు మారడంతో ప్రస్తుతం ఆయా కార్యాలయాలకు ప్రజలు నేరుగా వెళ్లడం మానేశారు. జిల్లా కేంద్రంలో ఆర్టీవో కార్యాలయం నుంచి దర్శి, మార్కాపురం, చీరాల, కందుకూరు పట్టణాల్లోని మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) కార్యాలయాల్లో ఏ పని కోసమైనా ముందుగా ఆయా కార్యాలయాల చుట్టూ దుకాణాలు ఏర్పాటు చేసుకుని ఉండే ఏజెంట్లను సంప్రదించాల్సి వస్తోంది.
 
కొన్నేళ్ల క్రితం అనధికారికంగా ప్రారంభమైన ఈ ఏజెంట్ల వ్యవస్థ ప్రస్తుతం ఆర్టీవో కార్యాలయాల్లో అధికారులు, సిబ్బందికంటే కూడా కీలకపాత్ర పోషిస్తోంది. ప్రజలకు ఆర్టీవో కార్యాలయంలో ఏ పని అవసరమైనా ముందుగా ఏజెంట్లను సంప్రదిస్తున్నారంటే అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అధికారులు, సిబ్బంది సైతం ఏజెంట్లతో చేతులు కలిపి వారి ద్వారా వచ్చిన వారికి వెంటనే పనులు చేసి పంపిస్తుండటం, నేరుగా కార్యాలయంలో సంప్రదించిన వారిని రోజుల తరబడి తిప్పుకుంటుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. దీన్ని ఆసరాగా చేసుకున్న ఏజెంట్లు వివిధ పనుల కోసం తమను సంప్రదించే వారిని నిలువుదోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన దానికంటే రెండుమూడు రెట్లు అదనంగా వసూలు చేస్తున్నారు. వాటిలో కొంత మొత్తాన్ని అధికారులు, సిబ్బందికి ముట్టజెప్పి సులభంగా పనులు చేయిస్తున్నారు. మిగిలిన మొత్తంతో తమ జేబులు నింపుకుంటున్నారు.
 
 ఏజెంట్లకు నంబర్ల కేటాయింపు...
ప్రభుత్వానికి చలానా రూపంలో చెల్లించాల్సినదానికంటే అదనంగా ఒక్కో పనికి ఒక్కో రేటును ఏజెంట్లు నిర్ణయించారు. అన్నిపత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ ఏజెంట్ల ద్వారా వెళ్తేనే కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది పనులు చేస్తుండటంతో ప్రజలకు వారు అడిగినంతా సమర్పించుకోక తప్పడం లేదు. ఏజెంట్లంతా వివిధ పనుల కోసం నిత్యం కార్యాలయానికి వచ్చే ప్రజలను పీల్చిపిప్పిచేస్తూ తమ జేబులు నింపుకుంటుంటారు. ఇలా చేయడం నిబంధనలకు పూర్తిగా విరుద్ధమైనప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడం, స్థానికంగా పనిచేసే అధికారులు, సిబ్బంది కూడా ఏజెంట్ల చెప్పుచేతల్లో ఉంటూ వారిచ్చే లంచాలకు కక్కుర్తిపడి పనులు చేస్తుండటంతో ఏళ్ల తరబడి ఈ పరిస్థితిలో మార్పులేకుండా పోయింది.
 
దర్శి ఎంవీఐ కార్యాలయం వద్ద 18 మంది ఏజెంట్లున్నారు. అధికారులు, సిబ్బంది వీరితో కుమ్మక్కై వారందరికీ ఏకంగా 18 నంబర్లు కేటాయించారు. ఏజెంట్లు తమ ద్వారా కార్యాలయంలోకి పంపే ఫైలుపై తమకు కేటాయించిన నంబర్ వేస్తారు. అలా వచ్చిన వారికే అధికారులు పనులు చేసి పంపిస్తుంటారు. ఇలా పనులు చేయించినందుకుగానూ జనం నుంచి చలానాలకన్నా అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని సాయంత్రానికి అధికారులు, ఏజెంట్లు పంచుకుంటారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతుండటం విశేషం.
 
కొత్త మంత్రిపైనే ఆశలు...
ప్రస్తుతం జిల్లాకు చెందిన దర్శి ఎమ్మెల్యే శిద్దా రాఘవరావు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖామంత్రిగా నియమితులవడంతో ఆయనపైనే జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలోని ఆ శాఖ కార్యాలయాల్లో ఏజెంట్ల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి అధికారులు, సిబ్బంది నిజాయితీగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అయితే, ఏళ్ల తరబడి అడ్డదారుల్లో హైస్పీడ్‌తో వెళ్తున్న వారిని మార్చడం అంత సులభం కాదు. దీనిపై మంత్రి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement