Motor Vehicle Inspector
-
కాకినాడలో రవాణాశాఖ బ్రేక్ ఇన్స్పెక్టర్పై కత్తితో దాడి.. తెగిపడిన వేలు
కాకినాడ క్రైం: ఫిట్నెస్, ఇన్సూరెన్స్ గడువు ముగిసినందున వాహనాన్ని సీజ్ చేసేందుకు యత్నించిన అధికారి, అతని డ్రైవర్‌పై వాహన యజమాని హత్యాయత్నానికి పాల్పడిన ఘటన జిల్లా కేంద్రం కాకినాడలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ ఇంద్రపాలేనికి చెందిన పెంటా వెంకట దుర్గాప్రసాద్ ఆటోపై కొబ్బరి బొండాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. స్థానిక ఫెలోషిప్ సెంటర్లోని దేవదాయ, ధర్మదాయ శాఖ కార్యాలయం సమీపాన శుక్రవారం ఉదయం ఆటో నిలిపి వ్యాపారం చేసుకుంటున్నాడు. సాధారణ తనిఖీల్లో భాగంగా జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ)గా విధులు నిర్వర్తిస్తున్న మిద్దే చిన్నారావు అక్కడకు వెళ్లారు. దుర్గాప్రసాద్ ఆటో నంబరు తనిఖీ చేసి, గతేడాది నవంబర్లోనే వాహనం ఫిట్నెస్ ముగిసిందని, ఇన్స్రూెన్సు కూడా లేదని చెప్పారు. ఈ క్రమంలో ఆటోను సీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. వద్దని దుర్గాప్రసాద్ వారించాడు. తాను ఆటో నడుపుతూ వ్యాపారం చేయడం లేదని, కేవలం రోడ్డు పక్కన నిలిపి మాత్రమే జీవనోపాధి కోసం వ్యాపారం చేసుకుంటున్నానని చెప్పాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన చిన్నారావు ఆటోను సీజ్ చేసే ప్రక్రియ ప్రారంభించారు. దీంతో దుర్గాప్రసాద్ ఆటో వద్దకు వెళ్లి కొబ్బరి బొండాలు నరికే కత్తి తీసుకొచ్చాడు. కారులో ఉన్న చిన్నారావును బెదిరించేందుకు కారు అద్దంపై కత్తితో వేటు వేశాడు. ‘ఏంటి చంపుతావా?’ అంటూ చిన్నారావు బయటకి రాబోయారు. అప్పటికే వర్షం పడుతుండడంతో కారు దిగిన వెంటనే చిన్నారావు కాలు జారి పడిపోయాడు. ఆయనపై దుర్గాప్రసాద్ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దాడిని నిలువరించేందుకు ఏఎంవీఐ కారు డ్రైవర్ గుత్తుల వీర వెంకట సత్యనారాయణ యత్నించగా దుర్గాప్రసాద్ అతడి పైనా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో చిన్నారావు మెడ, తల, చేయి, పొట్ట భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. చేతి వేలు తెగి పడింది. పెద్దపేగు పూర్తిగా బయటికి వచ్చేసింది. డ్రైవర్ సత్యనారాయణకు రెండు చేతులపై గాయాలయ్యాయి. డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. వారికి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ హేమలతాదేవి తెలిపారు. కాగా కత్తి దాడిలో తెగిపడిన చిన్నారావు చేతి వేలిని అతికించేందుకు జీజీహెచ్ వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చిన్నారావు శరీరంపై మొత్తం 34 కత్తిపోట్లు, గాయాలు గుర్తించామని వైద్యులు తెలిపారు. జీజీహెచ్‌లో బాధిత కుటుంబ సభ్యులను జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియా, ఎస్పీ ఎం. రవీంద్రనాథ్‌బాబు పరామర్శించారు. నిందితుడు దుర్గాప్రసాద్‌ను అరెస్టు చేశామని టూ టౌన్ సీఐ నాయక్ తెలిపారు. -
ఏలూరులో లారీడ్రైవర్పై మోటార్ వెహికల్ ఇన్సెపెక్టర్ దాష్టీకం
సాక్షి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): తెలంగాణ రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్‌పై రవాణా అధికారులు దాష్టీకానికి పాల్పడిన ఘటన సోమవారం ఏలూరులో జరిగింది. మహబూబ్ నగర్, మక్తల్ ప్రాంతానికి చెందిన బీ.రాజు లారీలో పత్తి లోడును తణుకుకు తీసుకెళ్తున్నాడు. లారీ ఏలూరు చేరుకోగా ఆశ్రం ఆసుపత్రికి సమీపంలో మోటార్ వెహికల్ ఇన్సెపెక్టర్ ఈ.మృత్యుంజయ రాజు లారీని ఆపి పత్రాలు చూపాలని కోరారు. తన వద్ద ఉన్న అన్ని అనుమతుల పత్రాలను చూపించారు. పత్రాలు సక్రమంగా ఉన్నా రూ.15 వేలు లంచం ఇవ్వాలని ఇన్సెపెక్టర్ ఒత్తిడి తెచ్చారు. లంచం ఇచ్చేది లేదని రాజు తెగేసి చెప్పాడు. ఆగ్రహించిన ఇన్సెపెక్టర్, అతని కారు డ్రైవర్, హోమ్ గార్డులు లారీ డ్రైవర్‌పై దాడి చేసి కొట్టారు. తనను ఎందుకు కొడుతున్నారని అడగడంతో మరింత రెచ్చిపోయి కొట్టారు. రూ. 15 వేలు లంచం ఇవ్వడానికి ఇష్టపడలేదు.. నీకు రూ. 20 వేలు జరిమానా విధిస్తున్నామని బెదిరించారు. ఈ తతంగాన్నంతా లారీ డ్రైవర్ తన మొబైల్ ఫోన్లో వీడియో తీస్తుండగా దానిని రవాణా అధికారులు లాక్కుని పగుల కొట్టారు. నిబంధనల మేరకు సరుకు రవాణా చేస్తున్న తన వద్ద లంచం డిమాండ్ చేయడమే కాక ఇవ్వడానికి నిరాకరించడంతో దాడి చేసి కొట్టి, తన ఫోన్‌ను ధ్వంసం చేయడంపై డ్రైవర్ రాజు సోమవారం ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న స్పందనలో ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై రవాణ శాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేశాడు. దీనిపై తక్షణమే స్పందించిన కలెక్టర్, రవాణా ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. తనపై దౌర్జన్యం చేసిన రవాణా అధికారులకు శిక్ష పడేవరకూ తాను పోరాటం కొనసాగిస్తానని డ్రైవర్ జు ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా లేకపోయినా ఇన్సెపెక్టర్ విధించిన జరిమానా కట్టేస్తానని చెప్పి రవాణా శాఖకు రూ. 20 వేలు మొత్తాన్ని చెల్లించాడు. చదవండి: (Vizag: ఇన్ఫోసిస్ కోసం చకచకా.. విశాఖలో పూర్తి స్థాయి కార్యకలాపాలు) షోకాజ్ నోటీసులు జారీ ఈ సంఘటనపై విచారణ చేపట్టిన రవాణా శాఖ ఉన్నతాధికారులు మోటార్ వెహికల్ అధికారి మృత్యుంజయ రాజు లారీ డ్రైవర్‌పై దౌర్జన్యం చేయడంతోపాటు అతని నుంచి లంచం డిమాండ్ చేసినట్టుగా గుర్తించారు. దీనిపై ఇన్సెపెక్టర్కు షోకాజ్ నోటీసులు జారీ చేశామని జిల్లా ఇన్ఛార్జ్ ఉప రవాణా కమీషనర్ పురేంద్ర తెలిపారు. ఇన్సెపెక్టర్ కారును, అతని ఎన్ఫోర్స్మెంట్ ఐడీని స్వాధీనం చేసుకున్నామని, రెండు రోజుల్లో షోకాజ్ నోటీసులకు వివరణ ఇవ్వాలని ఆదేశించామని తెలిపారు. ఈ సంఘటనలో ఇన్సెపెక్టర్ కారు డ్రైవర్‌తో పాటు హోం గార్డుపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
వాహనంతో ఢీకొట్టి ఎంవీఐ హత్య.. రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియో: సీఎం
సాక్షి, చెన్నై: మేకల దొంగల చేతుల్లో ఎస్ఐ హత్యకు గురైన ఘటన మరవకముందే మరో ఘటన చోటుచేసుకుంది. తనిఖీల్లో ఉన్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ)ను వాహనంతో ఢీకొట్టి హతమార్చిన ఘటన కరూర్‌లో సోమవారం ఉదయం జరిగింది. సీసీ కెమెరాల ఆధారంగా వాహనాన్ని గుర్తించిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కరూర్ రీజనల్ ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో ఇన్స్పెక్టర్గా కనకరాజ్ పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం కరూర్ బైపాస్ రోడ్డులోని పుత్తాం పుదుర్ వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్నారు. అటు వైపుగా వచ్చిన ఓ వాహనం ఆయన్ను ఢీకొట్టి వెళ్లి పోయింది. దీనిని ప్రమాదంగా తొలుత భావించారు. చదవండి: (‘వేడుకున్నా కనికరించలేదు’.. అందుకే ఆ ఎస్ఐని చంపేశాం..) గాయపడ్డ ఆయన్ను ఆస్పత్రికి తరలించగా మరణించారు. రంగంలోకి దిగిన కరూర్ పోలీసులు సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా విచారణ చేశారు. ఓ వ్యాన్ మహిళలను ఎక్కించుకుని అతి వేగంగా వెళ్లడాన్ని గుర్తించారు. ఎలాంటి అనుమతులు పొందకుండా ఓ జౌళి సంస్థకు చెందిన వ్యాన్ అధిక లోడింగ్‌తో వెళ్తూ, ఆపేందుకు యత్నించిన కనకరాజ్‌ను ఢీకొట్టి వెళ్లినట్టు తేలింది. వ్యాన్‌ను పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనను సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా పరిగణించారు. నిందితులను అరెస్టు చేయాలని ఆదేశించారు. మృతుడి కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ప్రకటించారు. చదవండి: (మేకల దొంగల వీరంగం.. స్పెషల్ ఎస్సై హత్య.. రూ.కోటి ఎక్స్‌గ్రేషియా) -
అవినీతి ‘శివ’తాండవం
సాక్షి, తాడిపత్రి : ఆయన రూటే సప‘రేటు’. ఏజెంట్లను అడ్డుపెట్టుకొని లక్షలాది రూపాయలను దండుకున్నాడు. నాపరాళ్ల ట్రాక్టర్ల డ్రైవర్లతోనూ మామూళ్లు వసూలు చేసి లక్షలు వెనకేసుకున్నాడు. ఈ అవినీతి తిమింగళం నేడు ఏసీబీ వలలో చిక్కుకుంది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టి కోట్లకు పడగలెత్తిన కర్నూలు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) అక్కిరాజు శివప్రసాద్ అరెస్టయ్యారు. కర్నూలు, హైదరాబాద్, బెంగళూరుతో పాటు మొత్తం ఐదు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఇప్పటికే రూ.8 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించారు. ఆయన పేరుమీద దాదాపు రూ.20 కోట్ల మేర ఆస్తులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అనంతపురానికి చెందిన ఈయన గతంలో తాడిపత్రిలో నాలుగేళ్లపాటు ఎంవీఐగా విధులు నిర్వహించారు. రెండు నెలల క్రితమే బదిలీపై ఇక్కడి నుంచి కర్నూలుకు వెళ్లారు. కర్నూలులో పట్టుబడిన ఈయన అవినీతి ప్రస్థానం తాడిపత్రి నుంచే మొదలైంది. ఎఫ్‌సీ ఇవ్వాలంటే రూ.4వేలు సాధారణంగా పసుపు పచ్చ నంబర్ ప్లేట్ గల మూడు, నాలుగు చక్రాల వాహనాలకు ఎఫ్‌సీ సర్టిఫికేట్ (ఎఫ్‌సీ) ఇవ్వాలంటే రూ.4వేల నుంచి రూ.5వేలు ముట్టజెప్పాల్సిందే. సాధారణంగా ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే రూ.800తో సరిపెట్టుకోవచ్చు. అయితే అలా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి ఏవేవో సాకులు చెప్పి వెనక్కు పంపించేవాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ ఏజెంట్ల దార్వా ఎఫ్‌సీ కోసం వెళితే వెంటనే పనిచేసి వారి ద్వారా ముడుపులు తీసుకునేవారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రాక్టర్ల నుంచి రూ.20 లక్షలు వసూళ్లు తాడిపత్రి ప్రాంతం కర్నూలు, కడప జిల్లా సరిహద్దు. కర్నూలు జిల్లా నుంచి అధికంగా నాపరాళ్ల లోడు ట్రాక్టర్లు తాడిపత్రి పట్టణంలోని నాపరాళ్ల పరిశ్రమలకు సరుకును దిగుమతి చేసేందుకు వస్తూంటాయి. అదనపు లోడుతో వస్తున్న ట్రాక్టర్ల నుంచి కూడా ఈయన లక్షల్లో మామూలు వసూలు చేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక్కొ ట్రాక్టర్‌కు నెలకు రూ3.వేలు చొప్పున ఏజెంట్ల ద్వారా నెలకు రూ.15 లక్షల నుంచి రూ.20లక్షల వరకు వసూలు చేశాడన్న ఆరోపణలున్నాయి. స్పీడ్ గవర్నర్ పరికరాల విక్రయాల్లోనూ వాటా వాహనం వేగ నియంత్రణ కోసం అమర్చే స్పీడ్ గవర్నర్ పరికరాల విక్రయాల్లో కూడా భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ వాహనానికి స్పీడ్ గవర్నర్ పరికరం అమర్చాలంటే దాని అసలైన ఖరీదు రూ.4,500 నుంచి రూ.5000 వరకు పలుకుతోంది. కానీ ఎంవీఐ శివప్రసాద్ తన బినామీ ఏజెంట్‌ను నియమించుకొని ఒక్కొక్క స్పీడ్ గవర్నర్ పరికరాన్ని అదనంగా రూ.2వేలు అంటే రూ.7వేలకు విక్రయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి రోజూ ఎఫ్సీకి వెళ్లిన ప్రతి వాహనానికీ స్పీడ్ గవర్నర్ పరికరాన్ని విధిగా అమర్చుకోవాలని నిబంధనలు విధించడంతో గత్యంతరం లేని పరిస్థితులో వాహనదారులు అమర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతం వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో ఈ స్పీడ్ గవర్నెన్స్ పద్ధతి రద్దు అయినట్లు తెలిసింది. ఏజెంట్ల ద్వారానే లైసెన్సులు మంజూరు సాధారణంగా రవాణా సంస్థలో ఏజెంట్ల వ్యవస్తను రద్దు చేసింది. కానీ తాడిపత్రిలో ఆర్టీఓ కార్యాలయంలో ఏజెంట్లు నిత్యం తారసపడుతూనే ఉంటారు. ఎంవీఐ శివప్రసాద్ ఏజెంట్ల ద్వారా వచ్చిన లైసెన్సులను మాత్రమే పరిశీలించి ఎల్ఎల్ఆర్, ఆర్సీలు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఏజెంట్లు టూవీలర్, ఫోర్‌వీలర్‌కు లైసెన్సు కావాలంటే రూ.4వేలు చెల్లించాల్సిందే. ఈ మొత్తంలో ఎంవీఐ శివప్రసాద్‌కు వాటా అన్న విషయాన్ని ఇక్కడి ఏజెంట్లు బాహాటంగా పేర్కొంటున్నారు. ఏజెంట్ల కార్యాలయాలు కూడా ఆర్టీఏ కార్యాలయం ప్రాంగణంలోనే ఉండడం విశేషం. -
తవ్వేకొద్దీ శివప్రసాద్ అవినీతి బాగోతం
సాక్షి, కర్నూలు : ఏసీబీ అధికారుల ముందు అవినీతి దొంగ వ్యవహారం బట్టబయలైంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాయన్న ఆరోపణలతో కర్నూలు మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎ.శివ ప్రసాద్ ఇంట్లో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. కర్నూలు, హైదరాబాద్, బెంగుళూరుతోపాటు మొత్తం అయిదు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఇప్పటికే రూ. 8 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించారు. అంతేగాక ఇతని పేర దాదాపు రూ. 20 కోట్ల మేర ఆస్తులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఏసీబీ సోదాలు సాయంత్రం వరకూ కొనసాగే అవకాశం ఉంది. శివప్రసాద్ అక్రమ ఆస్తులు చిట్టా.. ► బెంగళూరులోని కార్తీక్ నగర్లో మూడు కోట్ల విలువైన జీప్లస్ సెవెన్ అపార్ట్ మెంట్, ఉదాల్ హల్లిలో రెండు కోట్ల విలువ చేసే ఇంటి స్థలం. ► హైదరాబాద్‌లోని జయభేరి ఆరెంజ్ ఆర్కేట్ లో కోటిన్నర విలువచేసే అపార్ట్మెంట్, గాజుల మల్లాపురంలో కోటి రూపాయల ఇంటి స్థలం. ► ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంట్లో రూ.1.45 లక్షల నగదు, కిలో బంగారం లభించింది. ► మనీ ట్రాన్స్ఫర్ కోసం భార్య పేరు మీద ఆక్సీ ట్రీ హోటల్ ప్రైవేట్ లిమిటెడ్ , సిన్బిడ్స్ అనే రెండు సూట్ కేసు కంపెనీల స్ధాపన. ► యుగాండా దేశంలోని బ్యాంకుల్లో లాకర్స్ ఉన్నాయి. -
రవాణా శాఖలో ఓడీల బాగోతం..
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ డీటీవో కార్యాలయంలో ఎంవీఐగా పనిచేస్తున్న కె.వేణు నిన్న మొన్నటి వరకు ఇన్చార్జి డీటీవో, డీటీసీగా వ్యవహరించారు. ఇటీవలే పదోన్నతిపై పురుషోత్తం డీటీసీగా విధుల్లో చేరగా, వేణు ఎంవీఐ, ఇన్చార్జి డీటీవోగా కొనసాగుతున్నారు. వరంగల్ రూరల్ రెగ్యులర్ ఎంవీఐ రమేష్‌రాథోడ్ జనగామ ఇన్చార్జి ఎంవీఐతో పాటు డీటీవోగా మూడు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భూపాలపల్లి ఎంవీఐగా రెగ్యులర్ పోస్టులో ఉన్న పి.రవిందర్ ఇన్చార్జి డీటీవోతో పాటు ఖమ్మం ఇన్చార్జి ఎంవీఐగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ రెగ్యులర్ ఎంవీఐగా ఉన్న బద్రునాయక్ అక్కడే ఇన్చార్జి డీటీవోగా, ఖమ్మం ఇన్చార్జి డీటీవోగా వ్యవహరిస్తున్నారు. ఇలా రవాణాశాఖలో కొందరు మోటారు వెహికిల్ ఇన్స్పెకర్లు (ఎంవీఐలు) ఇప్పుడు అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌లోని కొందరు పెద్దల ఆశీస్సులు ఉంటే చాలు... పదోన్నతులు, హోదాలతో పని లేకుండా ఇన్చార్జి డీటీవోలు, డీటీసీలుగా కూడా కొనసాగుతున్నారు. అవీ చాలదన్నట్లు పొరుగు జిల్లాల బాధ్యతల కోసం పైరవీలు సాగిస్తున్నట్లు మంత్రి పేషీకి చేరిన ఫిర్యాదులు వెల్లడిస్తున్నాయి. రవాణాశాఖలో ఎంవీఐ ఉద్యోగం.. వారి ఆదాయం గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అయితే మరీ ‘నీకది.. నాకిది’ అన్న చందంగా ఆన్ డెప్యూటేషన్ల పేరిట ఇష్టారాజ్యంగా పరిమితికి మించిన పోస్టింగ్‌లు తెచ్చుకుంటుండటం ఆ శాఖలో వివాదస్పదం అవుతోంది. రవాణాశాఖలో ఆన్ డెప్యూటేషన్(ఓడీ)ల పేరిట అక్రమార్జన తంతు సాగుతోంది. ఆ శాఖలోని కొందరు ఉన్నతాధికా రులు, మరికొందరు ఉద్యోగ సంఘాల నాయకుల కనుసన్నల్లో ఈ దందా నడుస్తోంది. వివిధ కారణాలతో రవాణాశాఖలో ప్రమోషన్లకు అడ్డుచక్రం వేసిన సదరు వ్యక్తులు ఖాళీల పేరిట కథ నడిపిస్తున్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత ‘సిండికేట్’గా ఏర్పడిన కొందరు కీలక అధికారులు పో స్టుకో రేటును ఫిక్స్ చేసి అనుయాయులకు ‘ఆన్ డెప్యూటేçషన్’ పేరిట అదనపు బాధ్యతలు కట్టబెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఈ బాగోతం ఇటీవల వివాదస్పదంగా మారింది. ‘ఏ శాఖలో కూడా ఆన్ డెప్యూటేషన్లు ఉండవద్దు.. అవసరమైతే డీపీసీలు పెట్టి నియమాకాలు, పదోన్నతులు ఇవ్వాలి’ అంటూ ఇటీవ ల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఆ ఉ త్తర్వులు రవాణాశాఖలో మాత్రం వర్తించడం లేదు. ఫలితంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆన్ డెప్యూటేషన్ పోస్టింగ్‌ల వ్యవహారం ఏకంగా రవా ణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేషీకి చేరడం ఆ శాఖలో చర్చనీయాంశం అవుతోంది. ఖాళీల పేరిట ‘ఓడీ’ల వ్యవహారం... రవాణాశాఖలో 2013 తర్వాత పదోన్నతులు లేవు. దీంతో కొందరు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు ‘ఖాళీల’ పేరిట ఈ తతంగం నడిపిస్తున్నారు. కానిస్టేబుళ్లు, క్లర్క్‌ల నుంచి అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ)ల నుంచి ఎంవీఐల పదోన్నతులు నిలిచిపోయాయి. ఎంవీఐల నుంచి డీటీవో/ఆర్టీవోల పదోన్నతుల్లో జాప్యం జరిగినా.. ఇటీవలే హఠాత్తుగా ఐదుగురు జిల్లా రవాణాశాఖ అధికారుల (డీటీవోల)కు ఉప కమిషనర్ (డీటీసీ)లుగా పదోన్నతి కల్పిస్తూ పోస్టింగ్‌లు ఇచ్చారు. ఇందులో భాగంగానే వరంగల్ డీటీసీగా పురుషోత్తంను నియమించారు. ఇదిలా వుంటే క్లర్క్‌లు, కానిస్టేబుళ్ల నుంచి ఏఎంవీఐలుగా ప్రమోషన్లు పొందిన వారి పదోన్నతుల ఫైలు ఆరేళ్లుగా ముందుకు సాగడం లేదు. కొందరు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతల విజ్ఞాపన మేరకు రవాణాశాఖలో పదోన్నతుల కోసం డిపార్టుమెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) వేయాలని 2014 అక్టోబర్‌లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రక్రియ మొదలైనట్లే కనిపించినా అనేక కారణాలతో డీపీసీ ఇప్పటివరకు జరగలేదు. ఫలితంగా పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోగా... రవాణాశాఖలో ఖాళీల పేరిట ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను బుట్టదాఖలు చేసి పెద్ద ఎత్తున ‘రేటు’ ఫిక్స్ చేసి ఆన్ డెప్యూటేషన్లను సాగిస్తున్నారని ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. ములుగు కోసం పోటీలో ఆ ఇద్దరు... ట్రాన్‌పోర్ట్ డిపార్టుమెంట్లో పని చేస్తున్న ఇద్దరు అధికారులు కొత్తగా ఏర్పడిన ములుగు జిల్లా కోసం కూడా పోటీ పడుతుండటం ఆ శాఖలో హాట్‌టాపిక్‌గా మారింది. వరంగల్ రూరల్ రెగ్యులర్ ఎంవీఐ రమేష్‌రాథోడ్ జనగామ ఇన్చార్జి ఎంవీఐతో పాటు డీటీవోగా మూడు బాధ్యతలు నిర్వహిస్తూ ములుగు ఇన్చార్జి డీటీవో కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. భూపాలపల్లి ఎంవీఐగా రెగ్యులర్ పోస్టులో ఉన్న పి.రవిందర్ ఇన్చార్జి డీటీవోతో పాటు ఖమ్మం ఇన్చార్జి ఎంవీఐగా కూడా బాధ్యతల్లో ఉండి, ములుగు కోసం ప్రయత్నం చేస్తున్నట్లు ఆ శాఖ అధికారులు చర్చించుకుంటున్నారు. మహబూబాబాద్ రెగ్యులర్ ఎంవీఐగా, అక్కడే ఇన్చార్జి డీటీవోగా, ఖమ్మం ఇన్చార్జి డీటీవోగా వ్యవహరిస్తున్న బద్రునాయక్కు కూడా ఈ రేసులో ఉన్నట్లు మంత్రి పేషీకి చేరిన ఫిర్యాదులో పేర్కొనడం ఆ శాఖలో చర్చనీయాశంగా మారింది. -
రేణిగుంట ఎంవీఐపై ఏసీబీ సోదాలు
-
లారీల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసు సీబీసీఐడీకి బదిలీ
-మంగళగిరి కార్యాలయంలో వివరాలు సేకరణ -త్వరితగతిన విచారించి నిందితులను జైలుకు పంపుతాం -సీబీసీఐడీ ఎస్పీ కె.వి.మోహనరావు మంగళ గిరి(గుంటూరు జిల్లా) లారీలు లేకుండా అక్రమంగా రిజస్ట్రేషన్లు ఎందుకు చేయాల్సివచ్చింది.. దాని వెనుక ఉన్న సూత్రధారులెవరు.. పాత్రధారులెవరనే అంశంపై లోతుగా విచారించి సాక్ష్యాలు సేకరించి నిందితులను జైలుకు పంపుతామని సీబీసీఐడీ ఎస్సీ కె.వి.మోహనరావు చెప్పారు. ఈ ఏడాది జూలై 11న 27లారీలు లేకుండానే కొందరు తమ పేరిట రిజస్ట్రేషన్లు చేయించుకోగా.. చేసిన గుంటూరు జిల్లా మంగళగిరి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శివనాగేశ్వరరావు సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రవాణశాఖ ఈ కేసును సీబీసీఐడీకి బదిలీ చేసింది. ఇందులో భాగంగా గురువారం మంగళగిరి ఎంవీఐ కార్యాలయానికి చేరుకున్న ఎస్పీ మోహనరావు ఇన్చార్జి ఎంవీఐ బాలకృష్ణను అడిగి వివరాలు సేకరించారు. ఎంవీఐతో కలిసి విధులు నిర్వహించిన సిబ్బంది స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మోహనరావు మాట్లాడుతూ.. సీఐడీ అధికారులను నాలుగు బృందాలుగా నియమించి విజయవాడ, మంగళగిరిల్లోని నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు కేసులో ఎనిమిది మంది నిందితులుగా ఉన్నారని, విచారణ వేగంగా చేసి అందరినీ సాక్ష్యాధారాలతో అరెస్టు చేస్తామని చెప్పారు. మంగళగిరి పట్టణంలోని కొప్పురావు కాలనీ చిరునామాతో అనీల రవీంద్రనాథ్ 12 లారీలు, పొట్లూరి ఆనంద రవిశంకర్ 10 లారీలు, జూపల్లి పద్మావతి 2, నూతక్కి గ్రామం చిరునామాతో ఎలిశెట్టి లక్ష్మీనారాయణ 3 లారీలను కొనుగోలు చేసినట్లు రిజస్ట్రేషన్ చేయించగా.. వారికి విజయవాడ జాస్పర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కొనుగోలు చేసినట్లు నకిలీ పత్రాలను అందజేసిందన్నారు. విజయవాడ ఆటోనగర్‌కు చెందిన తరుణోమయ బాడీ బిల్డింగ్ కంపెనీ లారీలకు బాడీలు తయారుచేసినట్లు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వగా.. స్టార్ వేబ్రిడ్జి లారీల కాటా పత్రాలను సమకూర్చిందన్నారు. వారందరికీ ఎంవీఐ శివనాగేశ్వరరావు సహకరించడంతో ఇరవై నాలుగు గంటలలో మొత్తం వ్యవహారం నడిచిందని తెలిపారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంతో సంబంధం ఉన్న నిందితులందరికీ శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన వెంట సీఐలు రామచంద్రరావు, ఇంద్ర శ్రీనివాసరావు, సిబ్బంది ఉన్నారు. -
కాకినాడ ఎవీఐ ఇంటిపై ఏసీబీ దాడి
-భారీగా డాక్యుమెంట్లు స్వాధీనం కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఆర్టీఏ కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్(ఎంవీఐ)గా పనిచేస్తున్న అప్పారావు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. ఆయన ఇంటితో పాటు మరో ఏడు చోట్ల ఏకకాలంలో అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో బుధవారం ఉదయం ఈ తనిఖీలు చేపట్టారు. రూ.1.50 లక్షల నగదు, అరకేజీ బంగారు ఆభరణాలు, 70 లక్షల రూపాయలకు చెందిన ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడతో పాటు ఏలూరు తదితర ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ కోట్లలోనే ఉంటుందని భావిస్తున్నారు. కాకినాడ ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. -
డ్రైవర్లు ఏకాగ్రత పెంచుకోవాలి : ఎంవీఐ రమేష్
అనంతపురం న్యూసిటీ : వ్యసనాలు, నిర్లక్ష్యం వీడి డ్రైవర్లు ఏకాగ్రత పెంచుకుని, ప్రమాదాల నివారణకు పాటుపడాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) రమేష్ ఆర్టీసీ కార్మికులకు పిలుపునిచ్చారు. శుక్రవారం అనంతపురం డిపోలో జరిగిన ప్రమాద రహిత వారోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. మెకానికల్ విభాగం కండీషన్ కల్గిన బస్సులను డ్రైవర్లకు అందుబాటులో ఉంచాలన్నారు. ఆర్ఎం చిట్టిబాబు మాట్లాడుతూ డ్రైవింగ్‌లో పరిణతి సాధించినప్పుడు ప్రమాదాల నివారణ సాధ్యపడుతుందన్నారు. రాష్ట్రంలో అధిక కిలోమీటర్లు తిప్పిన ఘనత అనంతపురం రీజియన్‌కే దక్కిందని, ఇది కార్మికుల కృషి ఫలితమేనని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీటీఎం జీ వెంకటేశ్వరరెడ్డి, అనంతపురం డీఎం బాలచంద్రప్ప, ఏఓ శంకర్ రెడ్డి, సీఐలు గౌడ్, నరసింహులు, కంట్రోలర్ పీసీకే స్వామి, కార్మిక సంఘాల నాయకులు రామిరెడ్డి, గోపాల్, కొండయ్య, తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన వెహికల్ ఇన్స్పెక్టర్
మేడ్చల్ (రంగారెడ్డి) : నిబంధనలకు అనుగుణంగా లైసెన్స్ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసిన మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏసీబీకి చిక్కాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మేడ్చల్ చెక్‌పోస్ట్ వద్ద శనివారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న జి.వెంకటేశ్వర్లు ఓ డీసీఎం ఓనర్ నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదనపు సమాచారం కోసం అతడిని విచారణ చేస్తున్నారు. -
ఎంవీఐ అత్యుత్సాహం
మార్టూరు : ఓ ఎంవీఐ (మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్) అత్యుత్సాహం ప్రదర్శించారు. అధికారం చేతిలో ఉంది కదా.. అని నడి రోడ్డుపై రౌడీయిజం చేశాడు. తన కారు అద్దానికి లారీ తగిలిందంటూ డ్రైవర్‌ను చితకబాదాడు. చేతిలో ఉన్న కర్రతో విచక్షణారహితంగా బాది అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని జొన్నతాళి సమీపంలో జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి జరిగింది. క్షతగాత్రుని కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా యడ్లపాడుకు చెందిన లారీ డ్రైవర్ నూతలపాటి వరప్రసాద్ ఉలవపాడు నుంచి గుంటూరుకు జామాయిల్లోడుతో బయల్దేరాడు. మార్టూరు మండలం జొన్నతాళి సమీపంలోకి రాగానే ఒంగోలు వైపు నుంచి కారు వేగంగా వచ్చి లారీ ముందు ఆగింది. కారుకు లారీ తగిలి అద్దం పగిలిందంటూ ఓ వ్యక్తి బయటకు వచ్చాడు. తాను మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డినంటూ కర్రతో వీపుపై, కాళ్లపై విచక్షణా రహితంగా బాదాడు. పూటుగా మద్యం తాగి ఉండి ఏం చేస్తున్నాడో అతనికే తెలియదు. లారీ డ్రైవర్ దండం పెట్టి బతిమాలినా వదిలి పెట్టకుండా మెడపై కర్ర ఉంచి బలంగా నొక్కాడు. లారీని నేరుగా పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి డ్రైవర్‌ను పోలీసులకు అప్పగించాడు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ పోలీసులు వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం ఎంవీఐ రామకృష్ణారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం డ్రైవర్నున చికిత్స కోసం చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుని ఫిర్యాదు మేరకు ఎంవీఐ రామకృష్టారెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్సై ఆంజనేయులు తెలిపారు. -
‘టీఎస్’ రిజిస్ట్రేషన్ షురూ..
పెబ్బేరు: స్థానిక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్(ఎంవీఐ) కార్యాల యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వాహనాల రిజి స్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జి ల్లాలు, ఎంవీఐ కార్యాలయాల వారీగా నెంబర్ సిరీస్‌ను కేటాయించింది. జిల్లాకు టీఎస్ 06 సిరీస్‌ను కేటాయించగా పెబ్బేరు ఎంవీఐ కార్యాలయానికి ఈసీ(ఉఇ)ను కేటాయించారు. శని వారం నాటికి సుమారు 150 వావానాలకు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు పెబ్బేరు ఎంవీఐ రాజామహమ్మద్ తెలిపారు. ఇదివరకే రి జిస్ట్రేషన్లు చేయించుకున్న వాహనాల నెంబర్లు మారే అంశంపై ప్రభుత్వం త్వరలోనే ఆదేశాలు జారీచేస్తుందని చెప్పారు. పాతనెంబర్ల మార్పు అంశంపై స్పష్టత రాలేదన్నారు. కొతరాష్ట్రంలో కొత్తనెంబర్లను చూసి వాహనదారులు మురిసిపోతున్నారు. -
రూ.3 కోట్లకు పైగా అక్రమాస్తులు
తాడేపల్లిగూడెం : కృష్ణాజిల్లా గన్నవరంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న బి.వెంకట మురళీకృష్ణ కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రూ.3 కోట్లకు పైగా అక్రమాస్తులు కలిగి ఉన్నట్టు ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు జిల్లా ఏసీబీ డీఎస్పీ ఐ.వెంకటేశ్వరరావు తెలిపారు. మురళీకృష్ణ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు అందిన ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసిన జిల్లా ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో బుధవారం వేకువ జాము నుంచి రెండు జిల్లాల్లోనూ బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఒంగోలు, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ఏసీబీ అధికారులు ఎనిమిది బృందాలుగా ఏర్పడి, ఏలూరు డీఎస్పీ ఐ.వెంకటేశ్వరరావు, రాజమండ్రి డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. ముర ళీకృష్ణ అక్రమ ఆదాయంతో బినామీల పేరిట విలువైన భవనాలు, షాపులు, స్థలాలు కొనడంతో పాటు, ఫైనాన్స్ కంపెనీలకు సొమ్మును మళ్లించినట్టు అధికారులు ఫిర్యాదులు అందారుు. దీంతో ప్రాథమికంగా ఏఏ ప్రాంతాల్లో మురళీకృష్ణకు, అతని మామకు (పిల్లనిచ్చిన వ్యక్తి) ఆస్తులు ఉన్నాయో గుర్తించారు. ఆ మేరకు కృష్ణాజిల్లాలో ఆరు చోట్ల, పశ్చిమ గోదావరిలో ఐదు చోట్ల సోదాలు నిర్వహించారు. కృష్ణా జిల్లా కంకిపాడు రైతు బజారు సమీపంలో రూ.కోటి విలువైన భవనం ముర ళీకృష్ణ పేరు మీద, మొగల్రాజపురంలో మూడు షాపులు అతని మామ పేరు మీద ఉన్నట్టు గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. దీనితోడు పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో మణి ఫైనాన్స్ కంపెనీలో మురళీకృష్ణ అక్రమార్జనలు మళ్లించినట్టుగా అనుమానాలున్నాయని, దీంతో ఫైనాన్స్ కార్యాలయంలో కొన్ని పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మురళీకృష్ణకు బంధువుగా చెబుతున్న జువ్వలపాలెంలోని ఒక వ్యక్తి ఇంటిలో రాజమండ్రి డీఎస్పీ న ర్రా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సోదాలు చేశారు. ఇక్కడి నుంచి కొన్ని కాగితాలను అధికారులు వారి వెంట తీసుకెళ్లారు. మామకు దర్శిపర్రు గ్రామంలో ఉన్న ఇంటిని ఏసీబీ అధికారులు సోదా చేశారు. ఇదే మండలంలో మురళీకృష్ణకు స్వగ్రామం ముదునూరు, ఆకుతీగపాడు గ్రామాల్లో ఆస్తులు, తాడేపల్లిగూడెం పట్టణంలో రూ.40 లక్షలు విలువైన స్థలాలు ఉన్నట్టు సోదాల అనంతరం గుర్తించినట్టు జిల్లా ఏసీబీ డీఎస్పీ ఐ.వెంకటే శ్వరరావు తెలిపారు. వీటి విలువ రూ.3 కోట్లకు పైగా ఉంటుందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన విలేకరులకు తెలిపారు. తనిఖీల్లో ఏసీబీ అధికారులు ఎస్.రామకృష్ణ, గణేష్ (విశాఖపట్నం), లకో్ష్మజీ (విజయనగరం), ఆజాద్ (శ్రీకాకుళం), రాజశేఖర్, సంజీవరావు (తూర్పు గోదావరి) విల్సన్ (పశ్చిమ గోదావరి) పాల్గొన్నారు. -
అవినీతికి లెసైన్స్!
ప్రభుత్వ కార్యాలయాలంటేనే అవినీతి అక్రమాలు సర్వసాధారణమయ్యాయి. అయితే, వాటన్నింట్లోకల్లా రోడ్డు రవాణా శాఖ (ఆర్టీవో) కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారాయి. లంచాలు తీసుకునేందుకు తామంతా లెసైన్సులు పొందినట్లుగా అక్కడి అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తుంటారు.నేరుగా చేసే అక్రమాలు చాలవన్నట్లు ఏజెంట్లను ప్రోత్సహిస్తున్నారు. వివిధ పనుల కోసం కార్యాలయానికి వచ్చే వారంతా ఏజెంట్ల ద్వారానే తమను సంప్రదించేలా పరిస్థితిని మార్చేశారు. దీంతో ఏజెంట్లు అడిగినంతా ముట్టజెప్పి ఆర్టీవో అధికారులు, సిబ్బంది ద్వారా పనులు చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దర్శి : రోడ్డు రవాణా శాఖ జిల్లా కార్యాలయం ఒంగోలు నగరంలో ఉండగా, దాని పరిధిలో దర్శి, మార్కాపురం, చీరాల, కందుకూరు పట్టణాల్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) కార్యాలయాలున్నాయి. ఆయా కార్యాలయాల్లో డ్రైవింగ్ లెసైన్సులు మంజూరు చేయడం, పలు వాహనాల రిజిస్ట్రేషన్లు, బ్రేక్ చేయించడం తదితర పనులు చేస్తుంటారు. అయితే, కొన్నేళ్లుగా అవినీతికి నిలయాలుగా ఆర్టీవో కార్యాలయాలు మారడంతో ప్రస్తుతం ఆయా కార్యాలయాలకు ప్రజలు నేరుగా వెళ్లడం మానేశారు. జిల్లా కేంద్రంలో ఆర్టీవో కార్యాలయం నుంచి దర్శి, మార్కాపురం, చీరాల, కందుకూరు పట్టణాల్లోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) కార్యాలయాల్లో ఏ పని కోసమైనా ముందుగా ఆయా కార్యాలయాల చుట్టూ దుకాణాలు ఏర్పాటు చేసుకుని ఉండే ఏజెంట్లను సంప్రదించాల్సి వస్తోంది. కొన్నేళ్ల క్రితం అనధికారికంగా ప్రారంభమైన ఈ ఏజెంట్ల వ్యవస్థ ప్రస్తుతం ఆర్టీవో కార్యాలయాల్లో అధికారులు, సిబ్బందికంటే కూడా కీలకపాత్ర పోషిస్తోంది. ప్రజలకు ఆర్టీవో కార్యాలయంలో ఏ పని అవసరమైనా ముందుగా ఏజెంట్లను సంప్రదిస్తున్నారంటే అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అధికారులు, సిబ్బంది సైతం ఏజెంట్లతో చేతులు కలిపి వారి ద్వారా వచ్చిన వారికి వెంటనే పనులు చేసి పంపిస్తుండటం, నేరుగా కార్యాలయంలో సంప్రదించిన వారిని రోజుల తరబడి తిప్పుకుంటుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. దీన్ని ఆసరాగా చేసుకున్న ఏజెంట్లు వివిధ పనుల కోసం తమను సంప్రదించే వారిని నిలువుదోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన దానికంటే రెండుమూడు రెట్లు అదనంగా వసూలు చేస్తున్నారు. వాటిలో కొంత మొత్తాన్ని అధికారులు, సిబ్బందికి ముట్టజెప్పి సులభంగా పనులు చేయిస్తున్నారు. మిగిలిన మొత్తంతో తమ జేబులు నింపుకుంటున్నారు. ఏజెంట్లకు నంబర్ల కేటాయింపు... ప్రభుత్వానికి చలానా రూపంలో చెల్లించాల్సినదానికంటే అదనంగా ఒక్కో పనికి ఒక్కో రేటును ఏజెంట్లు నిర్ణయించారు. అన్నిపత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ ఏజెంట్ల ద్వారా వెళ్తేనే కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది పనులు చేస్తుండటంతో ప్రజలకు వారు అడిగినంతా సమర్పించుకోక తప్పడం లేదు. ఏజెంట్లంతా వివిధ పనుల కోసం నిత్యం కార్యాలయానికి వచ్చే ప్రజలను పీల్చిపిప్పిచేస్తూ తమ జేబులు నింపుకుంటుంటారు. ఇలా చేయడం నిబంధనలకు పూర్తిగా విరుద్ధమైనప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడం, స్థానికంగా పనిచేసే అధికారులు, సిబ్బంది కూడా ఏజెంట్ల చెప్పుచేతల్లో ఉంటూ వారిచ్చే లంచాలకు కక్కుర్తిపడి పనులు చేస్తుండటంతో ఏళ్ల తరబడి ఈ పరిస్థితిలో మార్పులేకుండా పోయింది. దర్శి ఎంవీఐ కార్యాలయం వద్ద 18 మంది ఏజెంట్లున్నారు. అధికారులు, సిబ్బంది వీరితో కుమ్మక్కై వారందరికీ ఏకంగా 18 నంబర్లు కేటాయించారు. ఏజెంట్లు తమ ద్వారా కార్యాలయంలోకి పంపే ఫైలుపై తమకు కేటాయించిన నంబర్ వేస్తారు. అలా వచ్చిన వారికే అధికారులు పనులు చేసి పంపిస్తుంటారు. ఇలా పనులు చేయించినందుకుగానూ జనం నుంచి చలానాలకన్నా అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని సాయంత్రానికి అధికారులు, ఏజెంట్లు పంచుకుంటారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతుండటం విశేషం. కొత్త మంత్రిపైనే ఆశలు... ప్రస్తుతం జిల్లాకు చెందిన దర్శి ఎమ్మెల్యే శిద్దా రాఘవరావు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖామంత్రిగా నియమితులవడంతో ఆయనపైనే జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలోని ఆ శాఖ కార్యాలయాల్లో ఏజెంట్ల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి అధికారులు, సిబ్బంది నిజాయితీగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అయితే, ఏళ్ల తరబడి అడ్డదారుల్లో హైస్పీడ్‌తో వెళ్తున్న వారిని మార్చడం అంత సులభం కాదు. దీనిపై మంత్రి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. -
ఆర్టీఏ కార్యాలయంలో దళారుల పెత్తనం
ఖమ్మం క్రైం, న్యూస్‌లైన్ : ఆర్టీఏ కార్యాలయం.. దళారుల నిలయంగా మారింది. అక్కడ పెత్తనమంతా వారిదే. అక్కడ వారు ‘షాడో’ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. ఓ దళారీ ఏకంగా.. ఎంవీఐ సీటులోనే కూర్చుని, అన్ని వ్యవహారాలు చూసుకుంటున్నారు. వీరు ప్రతి పనికి ఓ రేటు నిర్ణయిస్తున్నారు. మీ వాహనాన్ని ఆర్టీఏ అధికారుల నుంచి విడిపించుకోవాలన్నా, లెసైన్స్.. ఫిట్నెస్ సర్టిఫికెట్.. ఇలా ఏ పని కావాలన్నా ఆ షాడో అధికారి వద్దకు వెళ్లి, అడిగినంత ‘ఫీజు’ ఇచ్చుకుంటే చాలు.. క్షణాలో పనయిపోతుంది. ఈ దళారీని కాదని నేరుగా వెళ్లారో.. అంతే సంగతులు. మీకు ఈ జన్మలో ఆ పని కానట్టే! రకరకాల నిబంధనలు, పత్రాలు, పరీక్షల పేరుతో ఇబ్బందులు పెడతారు. రోజులతరబడి తిప్పించుకుంటారు. చివరికి, ‘ఈ పాట్లన్నీ ఎందుకు..? ఆ ఏజెంటు(షాడో అధికారి)కు ఎంతోకొంత ఇచ్చుకుంటే తేలిగ్గా పనవుతుంది కదా..!’ అనుకుని, మీరంతట మీరే ఆ దళారి వద్దకు వెళతారు. అంటే, ఆ దళారీ లక్ష్యం నెరవేరినట్టే..!! ‘షాడో ఎంవీఐ’..! ఇక్కడ ఇలాంటి చిన్నాచితకా దళారులు ఎంతోమంది ఉన్నారు. వారందరిలో ఓ దళారీ తీరు ప్రత్యేకం. అతడిని ‘దళారీ’ అనేకంటే.. ‘షాడో ఎంవీఐ’ అనడం సబబుగా ఉంటుంది. ఎందుకంటే, ఆయన నేరుగా ఆర్టీఏ కార్యాలయంలోకి వెళ్లి, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) కుర్చీలో కూర్చుంటాడు. ఫైల్స్ చూస్తుంటాడు. ఆన్లైన్లో దరఖాస్తులను పరిశీలిస్తుంటాడు. కార్యాలయంలోని మిగిలి న సిబ్బంది, కిందిస్థాయి అధికారులు కూడా ఆయన ఆదేశాలను పాటిస్తుంటారు..!! ఆన్లైన్లో వచ్చిన అప్లికేషన్లను అప్రూవల్ చే స్తుంటారు. అసలు ఎంవీఐ చేయాల్సిన పనులన్నీ ఈ నకిలీ ఎంవీఐ చేస్తుంటాడు. ఇతగాడు రోజుకు వంద వరకు డ్రైవిం గ్ లెసైన్స్‌లను క్లియర్ చేస్తుంటారు. ఒక్కో లెసైన్స్‌కు 300 రూపాయలు పుచ్చుకుంటాడు. ఫిట్నెస్ సర్టిఫికెట్, కొత్త వాహనాలకు నెంబర్, పట్టుకున్న వాహనాన్ని విడిపించేం దుకు.. ఇలా, ప్రతి పనికీ ఈ దళారీ ఓ ‘రేటు’ నిర్ణయిస్తాడు. ఇక్కడ ఇలా ‘షాడో అధికారి’ అన్నీ తానై చేస్తుంటే అసలు అధికారులు ఎక్కడ ఉన్నట్టో...! ఆర్టీఏ ఏం చేస్తున్నట్టో...!! నా దృష్టికి రాలేదు... ‘షాడో అధికారి’ పెత్తనం విషయమై ఆర్టీఏ మోహినిన్ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా... ఆ విషయం తన దృష్టికి రాలేదని, కార్యాలయాన్ని తనిఖీ చేస్తానని, తగిన చర్యలు తీసుకుంటానని అన్నారు. -
ఎంవీఐపై చీటింగ్ కేసు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రవాణా శాఖలో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ)గా విధులు నిర్వహిస్తున్న ఓ అధికారిపై హైదరాబాద్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఆర్టీఏలో కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తానని అదే సంస్థలో పనిచేస్తున్న 98 మంది హోంగార్డులను నమ్మించి సుమారు రూ.5 కోట్లు వసూలు చేసి మోసగించారని ఎంవీఐపై ఆరోపణ. వివరాలిలా ఉన్నాయి. రాజమండ్రికి చెందిన భీంరావు కత్తిపూడి చెక్‌పోస్టు వద్ద రవాణా శాఖలో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. సరిగ్గా రెండేళ్ల క్రితం మోసానికి తెర లేపాడు. రవాణా శాఖలో 23 జిల్లాల్లో పనిచేస్తున్న సుమారు 98 మంది హోంగార్డులకు నేరుగా కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. అందుకు ఒక్కొక్కరు రూ.5 లక్షలు ఇవ్వాలని బేరం పెట్టాడు. అతని వలలో పడ్డ అన్ని జిల్లాల హోంగార్డులు విడతల వారీగా ఒక్కొక్కరు రూ.4 లక్షల చొప్పున అతనికి చెల్లించారు. హైదరాబాద్ జిల్లాలో పనిచేస్తున్న 13 మంది హోంగార్డులు బెల్సన్ తాజ్ హోటల్లో భీంరావుకు ఒకసారి రూ.20 లక్షలు మరోసారి రాజమండ్రిలోని అతని గెస్ట్‌హౌస్‌లో అతని వద్ద విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు మస్తాన్‌రావు, కృష్ణ, సత్తిబాబు, రాజేష్‌లకు మరో రూ.20 లక్షలు, భీంరావుకు మూడు విడతలుగా రూ.12 లక్షలు ఇచ్చారు. ఇలా అన్ని జిల్లాల హోంగార్డుల నుంచి అతను సుమారు రూ.5 కోట్లు వసూలు చేశాడు. ఏళ్లు గడుస్తున్నా కానిస్టేబుల్ ఉద్యోగాలు రాకపోవడంతో హోంగార్డులు భీంరావుకు ఫోన్‌చేసి తమ బాధను వెళ్లబోసుకునేవారు. అతను రేపుమాపు అంటూ దాటవేస్తూ వచ్చాడు. అనుమానం వచ్చిన వివిధ జిల్లాల హోంగార్డులు రెండు నెలలుగా రాజమండ్రిలోని అతని నివాసానికి వెళ్లడం ప్రారంభించడంతో వారికి చిక్కకుండా తిరిగాడు. ఫోన్ చేసి వేడుకుంటే ఎస్సీఎస్టీ కేసులు పెట్టిస్తానని బెదిరించాడు. దాంతో పలువురు హోంగార్డులు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మను కలిసి ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు సీసీఎస్ పోలీసులు ఎంవీఐ భీంరావుతో పాటు అతనికి సహకరించిన హోంగార్డులు మస్తాన్‌రావు, కృష్ణ, సత్తిబాబు, రాజేష్‌లపై బుధవారం చీటింగ్ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఎంవీఐపై చీటింగ్ కేసు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రవాణా శాఖలో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ)గా విధులు నిర్వహిస్తున్న ఓ అధికారిపై హైదరాబాద్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. అతని వద్ద పనిచేస్తున్న మరో నలుగురు హోంగార్డులను సైతం నిందితులుగా చేర్చారు. ఆర్టీఏలో కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తానని అదే సంస్థలో పనిచేస్తున్న 98 మంది హోంగార్డులను నమ్మించి సుమారు రూ.5 కోట్లు వసూలు చేసి మోసగించారని ఎంవీఐపై ఆరోపణ. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన కొందరు హోంగార్డులు నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మకు ఫిర్యాదు చేయడంతో సీసీఎస్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన భీంరావు అదే జిల్లాలో కత్తిపూడి చెక్‌పోస్టు వద్ద రవాణా శాఖలో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. సరిగ్గా రెండేళ్ల క్రితం మోసానికి తెర లేపాడు. రవాణా శాఖలో 23 జిల్లాల్లో పనిచేస్తున్న సుమారు 98 మంది హోంగార్డులకు నేరుగా కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. తనకు ప్రభుత్వ పెద్దలతో పరిచయం ఉందని నేరుగా ప్రత్యేక జీవోను విడుదల చేసి తద్వారా కానిస్టేబుల్‌గా పదోన్నతులు కల్పిస్తానని కూడా నమ్మించాడు. అందుకు ఒక్కొక్కరు రూ.5 లక్షలు ఇవ్వాలని బేరం పెట్టాడు. అతని వలలో పడ్డ అన్ని జిల్లాల హోంగార్డులు అధికారి అడిగిన దాంట్లో విడతల వారీగా ఒక్కొక్కరు రూ.4 లక్షల చొప్పున చెల్లించారు. ఇక హైదరాబాద్ జిల్లాలో పనిచేస్తున్న 13 మంది హోంగార్డులు బెల్సన్ తాజ్ హోటల్లో భీంరావుకు ఒకసారి రూ.20 లక్షలు మరోసారి రాజమండ్రిలోని అతని గెస్ట్‌హౌస్‌లో అతని వద్ద విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు మస్తాన్‌రావు, కృష్ణ, సత్తిబాబు, రాజేష్‌లకు మరో రూ.20 లక్షలు, భీంరావుకు మూడు విడతలుగా రూ.12 లక్షలు ఇచ్చారు. ఇలా అన్ని జిల్లాల హోంగార్డుల నుంచి అతను సుమారు రూ.5 కోట్లు వసూలు చేశాడు. సంవత్సరాలు గడుస్తున్నా కానిస్టేబుల్ ఉద్యోగాలు రాకపోవడంతో ఒక్కో జిల్లా నుంచి హోంగార్డులు పలుమార్లు భీంరావుకు ఫోన్‌చేసి తమ బాధను వెళ్లబోసుకునేవారు. అయినా అతను రేపుమాపు అంటూ దాటవేస్తూ వచ్చాడు. అనుమానం వచ్చిన ఆయా జిల్లాల హోంగార్డులు రెండు నెలల నుంచి రాజమండ్రిలోని అతని నివాసానికి రావడం మొదలు పెట్టడంతో వారికి చిక్కకుండా తిరిగాడు. అతను విధులు నిర్వహిస్తున్న కత్తిపూడి చెక్‌పోస్టుకు వెళ్లితే అక్కడ కూడా కనిపించలేదు. అతనికి ఫోన్ చేసి వేడుకుంటే తన ఇంటికి వస్తె ఎస్సీఎస్టీ కేసులు బుక్ చేయిస్తానని బెదిరించాడు. దీంతో హోంగార్డులు అతని ఇంటికి వెళ్లడం మానేశారు. ఏం చేయాలో తెలియక తమలో తాము కుమిలిపోయారు. అప్పుగా తెచ్చిన డబ్బుకు వస్తున్న హోంగార్డు జీతం మొత్తం మిత్తీలకు పోతున్నాయని బాధపడ్డ పలువురు హోంగార్డులు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మను కలిసి ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు సీసీఎస్ పోలీసులు ఎంవీఐ భీంరావుతో పాటు అతనికి సహకరించిన హోంగార్డులు మస్తాన్‌రావు, కృష్ణ, సత్తిబాబు, రాజేష్‌లపై బుధవారం చీటింగ్ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.