ఖమ్మం క్రైం, న్యూస్‌లైన్ : ఆర్టీఏ కార్యాలయం.. దళారుల నిలయంగా మారింది. అక్కడ పెత్తనమంతా వారిదే. అక్కడ వారు ‘షాడో’ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. ఓ దళారీ ఏకంగా.. ఎంవీఐ సీటులోనే కూర్చుని, అన్ని వ్యవహారాలు చూసుకుంటున్నారు. వీరు ప్రతి పనికి ఓ రేటు నిర్ణయిస్తున్నారు.
మీ వాహనాన్ని ఆర్‌టీఏ అధికారుల నుంచి విడిపించుకోవాలన్నా, లెసైన్స్.. ఫిట్‌నెస్ సర్టిఫికెట్.. ఇలా ఏ పని కావాలన్నా ఆ షాడో అధికారి వద్దకు వెళ్లి, అడిగినంత ‘ఫీజు’ ఇచ్చుకుంటే చాలు.. క్షణాలో పనయిపోతుంది. ఈ దళారీని కాదని నేరుగా వెళ్లారో.. అంతే సంగతులు. మీకు ఈ జన్మలో ఆ పని కానట్టే! రకరకాల నిబంధనలు, పత్రాలు, పరీక్షల పేరుతో ఇబ్బందులు పెడతారు. రోజులతరబడి తిప్పించుకుంటారు. చివరికి, ‘ఈ పాట్లన్నీ ఎందుకు..? ఆ ఏజెంటు(షాడో అధికారి)కు ఎంతోకొంత ఇచ్చుకుంటే తేలిగ్గా పనవుతుంది కదా..!’ అనుకుని, మీరంతట మీరే ఆ దళారి వద్దకు వెళతారు. అంటే, ఆ దళారీ లక్ష్యం నెరవేరినట్టే..!!
‘షాడో ఎంవీఐ’..!
ఇక్కడ ఇలాంటి చిన్నాచితకా దళారులు ఎంతోమంది ఉన్నారు. వారందరిలో ఓ దళారీ తీరు ప్రత్యేకం. అతడిని ‘దళారీ’ అనేకంటే.. ‘షాడో ఎంవీఐ’ అనడం సబబుగా ఉంటుంది. ఎందుకంటే, ఆయన నేరుగా ఆర్‌టీఏ కార్యాలయంలోకి వెళ్లి, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) కుర్చీలో కూర్చుంటాడు. ఫైల్స్ చూస్తుంటాడు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను పరిశీలిస్తుంటాడు. కార్యాలయంలోని మిగిలి న సిబ్బంది, కిందిస్థాయి అధికారులు కూడా ఆయన ఆదేశాలను పాటిస్తుంటారు..!! ఆన్‌లైన్‌లో వచ్చిన అప్లికేషన్‌లను అప్రూవల్ చే స్తుంటారు. అసలు ఎంవీఐ చేయాల్సిన పనులన్నీ ఈ నకిలీ ఎంవీఐ చేస్తుంటాడు. ఇతగాడు రోజుకు వంద వరకు డ్రైవిం గ్ లెసైన్స్‌లను క్లియర్ చేస్తుంటారు. ఒక్కో లెసైన్స్‌కు 300 రూపాయలు పుచ్చుకుంటాడు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్, కొత్త వాహనాలకు నెంబర్, పట్టుకున్న వాహనాన్ని విడిపించేం దుకు.. ఇలా, ప్రతి పనికీ ఈ దళారీ ఓ ‘రేటు’ నిర్ణయిస్తాడు.
ఇక్కడ ఇలా ‘షాడో అధికారి’ అన్నీ తానై చేస్తుంటే అసలు అధికారులు ఎక్కడ ఉన్నట్టో...! ఆర్‌టీఏ ఏం చేస్తున్నట్టో...!!
నా దృష్టికి రాలేదు...
‘షాడో అధికారి’ పెత్తనం విషయమై ఆర్‌టీఏ మోహినిన్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా... ఆ విషయం తన దృష్టికి రాలేదని, కార్యాలయాన్ని తనిఖీ చేస్తానని, తగిన చర్యలు తీసుకుంటానని అన్నారు.