మార్టూరు : ఓ ఎంవీఐ (మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్) అత్యుత్సాహం ప్రదర్శించారు. అధికారం చేతిలో ఉంది కదా.. అని నడి రోడ్డుపై రౌడీయిజం చేశాడు. తన కారు అద్దానికి లారీ తగిలిందంటూ డ్రైవర్‌ను చితకబాదాడు. చేతిలో ఉన్న కర్రతో విచక్షణారహితంగా బాది అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని జొన్నతాళి సమీపంలో జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి జరిగింది. క్షతగాత్రుని కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా యడ్లపాడుకు చెందిన లారీ డ్రైవర్ నూతలపాటి వరప్రసాద్ ఉలవపాడు నుంచి గుంటూరుకు జామాయిల్‌లోడుతో బయల్దేరాడు. మార్టూరు మండలం జొన్నతాళి సమీపంలోకి రాగానే ఒంగోలు వైపు నుంచి కారు వేగంగా వచ్చి లారీ ముందు ఆగింది.
కారుకు లారీ తగిలి అద్దం పగిలిందంటూ ఓ వ్యక్తి బయటకు వచ్చాడు. తాను మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణారెడ్డినంటూ కర్రతో వీపుపై, కాళ్లపై విచక్షణా రహితంగా బాదాడు. పూటుగా మద్యం తాగి ఉండి ఏం చేస్తున్నాడో అతనికే తెలియదు. లారీ డ్రైవర్ దండం పెట్టి బతిమాలినా వదిలి పెట్టకుండా మెడపై కర్ర ఉంచి బలంగా నొక్కాడు. లారీని నేరుగా పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి డ్రైవర్‌ను పోలీసులకు అప్పగించాడు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ పోలీసులు వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం ఎంవీఐ రామకృష్ణారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం డ్రైవర్‌నున చికిత్స కోసం చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుని ఫిర్యాదు మేరకు ఎంవీఐ రామకృష్టారెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్సై ఆంజనేయులు తెలిపారు.
ఎంవీఐ అత్యుత్సాహం
Published Mon, Dec 8 2014 1:45 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
Advertisement