ఏలూరులో లారీడ్రైవర్‌పై మోటార్‌ వెహికల్‌ ఇన్సెపెక్టర్‌ దాష్టీకం | Motor Vehicle Inspector attack on Lorry Driver at Eluru | Sakshi
Sakshi News home page

ఏలూరులో లారీడ్రైవర్‌పై మోటార్‌ వెహికల్‌ ఇన్సెపెక్టర్‌ దాష్టీకం

Published Tue, Nov 22 2022 11:22 AM | Last Updated on Tue, Nov 22 2022 11:22 AM

Motor Vehicle Inspector attack on Lorry Driver at Eluru - Sakshi

రవాణా శాఖ అధికారుల దాష్టీకానికి గురైన లారీ డ్రైవర్‌ రాజు  

సాక్షి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): తెలంగాణ రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్‌పై రవాణా అధికారులు దాష్టీకానికి పాల్పడిన ఘటన సోమవారం ఏలూరులో జరిగింది. మహబూబ్‌ నగర్, మక్తల్‌ ప్రాంతానికి చెందిన బీ.రాజు లారీలో పత్తి లోడును తణుకుకు తీసుకెళ్తున్నాడు. లారీ ఏలూరు చేరుకోగా ఆశ్రం ఆసుపత్రికి సమీపంలో మోటార్‌ వెహికల్‌ ఇన్సెపెక్టర్‌ ఈ.మృత్యుంజయ రాజు లారీని ఆపి పత్రాలు చూపాలని కోరారు. తన వద్ద ఉన్న అన్ని అనుమతుల పత్రాలను చూపించారు. పత్రాలు సక్రమంగా ఉన్నా రూ.15 వేలు లంచం ఇవ్వాలని ఇన్సెపెక్టర్‌ ఒత్తిడి తెచ్చారు. లంచం ఇచ్చేది లేదని రాజు తెగేసి చెప్పాడు.

ఆగ్రహించిన ఇన్సెపెక్టర్, అతని కారు డ్రైవర్, హోమ్‌ గార్డులు లారీ డ్రైవర్‌పై దాడి చేసి కొట్టారు. తనను ఎందుకు కొడుతున్నారని అడగడంతో మరింత రెచ్చిపోయి కొట్టారు. రూ. 15 వేలు లంచం ఇవ్వడానికి ఇష్టపడలేదు.. నీకు రూ. 20 వేలు జరిమానా విధిస్తున్నామని బెదిరించారు. ఈ తతంగాన్నంతా లారీ డ్రైవర్‌ తన మొబైల్‌ ఫోన్‌లో వీడియో తీస్తుండగా దానిని రవాణా అధికారులు లాక్కుని పగుల కొట్టారు.  

నిబంధనల మేరకు సరుకు రవాణా చేస్తున్న తన వద్ద లంచం డిమాండ్‌ చేయడమే కాక ఇవ్వడానికి నిరాకరించడంతో దాడి చేసి కొట్టి, తన ఫోన్‌ను ధ్వంసం చేయడంపై డ్రైవర్‌ రాజు సోమవారం ఏలూరు జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో జరుగుతున్న స్పందనలో ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై రవాణ శాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేశాడు. దీనిపై తక్షణమే స్పందించిన కలెక్టర్, రవాణా ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. తనపై దౌర్జన్యం చేసిన రవాణా అధికారులకు శిక్ష పడేవరకూ తాను పోరాటం కొనసాగిస్తానని డ్రైవర్‌ జు ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా లేకపోయినా ఇన్సెపెక్టర్‌ విధించిన జరిమానా కట్టేస్తానని చెప్పి రవాణా శాఖకు రూ. 20 వేలు మొత్తాన్ని చెల్లించాడు. 

చదవండి: (Vizag: ఇన్ఫోసిస్‌ కోసం చకచకా.. విశాఖలో పూర్తి స్థాయి కార్యకలాపాలు)

షోకాజ్‌ నోటీసులు జారీ 
ఈ సంఘటనపై విచారణ చేపట్టిన రవాణా శాఖ ఉన్నతాధికారులు మోటార్‌ వెహికల్‌ అధికారి మృత్యుంజయ రాజు లారీ డ్రైవర్‌పై దౌర్జన్యం చేయడంతోపాటు అతని నుంచి లంచం డిమాండ్‌ చేసినట్టుగా గుర్తించారు. దీనిపై ఇన్సెపెక్టర్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని జిల్లా ఇన్‌ఛార్జ్‌ ఉప రవాణా కమీషనర్‌ పురేంద్ర తెలిపారు. ఇన్సెపెక్టర్‌ కారును, అతని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఐడీని స్వాధీనం చేసుకున్నామని, రెండు రోజుల్లో షోకాజ్‌ నోటీసులకు వివరణ ఇవ్వాలని ఆదేశించామని తెలిపారు. ఈ సంఘటనలో ఇన్సెపెక్టర్‌ కారు డ్రైవర్‌తో పాటు హోం గార్డుపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement