సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ డీటీవో కార్యాలయంలో ఎంవీఐగా పనిచేస్తున్న కె.వేణు నిన్న మొన్నటి వరకు ఇన్‌చార్జి డీటీవో, డీటీసీగా వ్యవహరించారు. ఇటీవలే పదోన్నతిపై పురుషోత్తం డీటీసీగా విధుల్లో చేరగా, వేణు ఎంవీఐ, ఇన్‌చార్జి డీటీవోగా కొనసాగుతున్నారు.
వరంగల్ రూరల్ రెగ్యులర్ ఎంవీఐ రమేష్‌రాథోడ్ జనగామ ఇన్‌చార్జి ఎంవీఐతో పాటు డీటీవోగా మూడు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భూపాలపల్లి ఎంవీఐగా రెగ్యులర్ పోస్టులో ఉన్న పి.రవిందర్ ఇన్‌చార్జి డీటీవోతో పాటు ఖమ్మం ఇన్‌చార్జి ఎంవీఐగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ రెగ్యులర్ ఎంవీఐగా ఉన్న బద్రునాయక్ అక్కడే ఇన్‌చార్జి డీటీవోగా, ఖమ్మం ఇన్‌చార్జి డీటీవోగా వ్యవహరిస్తున్నారు.
ఇలా రవాణాశాఖలో కొందరు మోటారు వెహికిల్ ఇన్‌స్పెకర్లు (ఎంవీఐలు) ఇప్పుడు అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌లోని కొందరు పెద్దల ఆశీస్సులు ఉంటే చాలు... పదోన్నతులు, హోదాలతో పని లేకుండా ఇన్‌చార్జి డీటీవోలు, డీటీసీలుగా కూడా కొనసాగుతున్నారు. అవీ చాలదన్నట్లు పొరుగు జిల్లాల బాధ్యతల కోసం పైరవీలు సాగిస్తున్నట్లు మంత్రి పేషీకి చేరిన ఫిర్యాదులు వెల్లడిస్తున్నాయి.
రవాణాశాఖలో ఎంవీఐ ఉద్యోగం.. వారి ఆదాయం గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అయితే మరీ ‘నీకది.. నాకిది’ అన్న చందంగా ఆన్ డెప్యూటేషన్ల పేరిట ఇష్టారాజ్యంగా పరిమితికి మించిన పోస్టింగ్‌లు తెచ్చుకుంటుండటం ఆ శాఖలో వివాదస్పదం అవుతోంది.
రవాణాశాఖలో ఆన్ డెప్యూటేషన్(ఓడీ)ల పేరిట అక్రమార్జన తంతు సాగుతోంది. ఆ శాఖలోని కొందరు ఉన్నతాధికా రులు, మరికొందరు ఉద్యోగ సంఘాల నాయకుల కనుసన్నల్లో ఈ దందా నడుస్తోంది. వివిధ కారణాలతో రవాణాశాఖలో ప్రమోషన్లకు అడ్డుచక్రం వేసిన సదరు వ్యక్తులు ఖాళీల పేరిట కథ నడిపిస్తున్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత ‘సిండికేట్’గా ఏర్పడిన కొందరు కీలక అధికారులు పో స్టుకో రేటును ఫిక్స్ చేసి అనుయాయులకు ‘ఆన్ డెప్యూటేçషన్’ పేరిట అదనపు బాధ్యతలు కట్టబెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఈ బాగోతం ఇటీవల వివాదస్పదంగా మారింది. ‘ఏ శాఖలో కూడా ఆన్ డెప్యూటేషన్‌లు ఉండవద్దు.. అవసరమైతే డీపీసీలు పెట్టి నియమాకాలు, పదోన్నతులు ఇవ్వాలి’ అంటూ ఇటీవ ల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఆ ఉ త్తర్వులు రవాణాశాఖలో మాత్రం వర్తించడం లేదు. ఫలితంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆన్ డెప్యూటేషన్ పోస్టింగ్‌ల వ్యవహారం ఏకంగా రవా ణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేషీకి చేరడం ఆ శాఖలో చర్చనీయాంశం అవుతోంది.
ఖాళీల పేరిట ‘ఓడీ’ల వ్యవహారం...
రవాణాశాఖలో 2013 తర్వాత పదోన్నతులు లేవు. దీంతో కొందరు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు ‘ఖాళీల’ పేరిట ఈ తతంగం నడిపిస్తున్నారు. కానిస్టేబుళ్లు, క్లర్క్‌ల నుంచి అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్ (ఏఎంవీఐ)ల నుంచి ఎంవీఐల పదోన్నతులు నిలిచిపోయాయి. ఎంవీఐల నుంచి డీటీవో/ఆర్‌టీవోల పదోన్నతుల్లో జాప్యం జరిగినా.. ఇటీవలే హఠాత్తుగా ఐదుగురు జిల్లా రవాణాశాఖ అధికారుల (డీటీవోల)కు ఉప కమిషనర్ (డీటీసీ)లుగా పదోన్నతి కల్పిస్తూ పోస్టింగ్‌లు ఇచ్చారు.
ఇందులో భాగంగానే వరంగల్ డీటీసీగా పురుషోత్తంను నియమించారు. ఇదిలా వుంటే క్లర్క్‌లు, కానిస్టేబుళ్ల నుంచి ఏఎంవీఐలుగా ప్రమోషన్లు పొందిన వారి పదోన్నతుల ఫైలు ఆరేళ్లుగా ముందుకు సాగడం లేదు. కొందరు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతల విజ్ఞాపన మేరకు రవాణాశాఖలో పదోన్నతుల కోసం డిపార్టుమెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) వేయాలని 2014 అక్టోబర్‌లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రక్రియ మొదలైనట్లే కనిపించినా అనేక కారణాలతో డీపీసీ ఇప్పటివరకు జరగలేదు. ఫలితంగా పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోగా... రవాణాశాఖలో ఖాళీల పేరిట ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను బుట్టదాఖలు చేసి పెద్ద ఎత్తున ‘రేటు’ ఫిక్స్ చేసి ఆన్ డెప్యూటేషన్లను సాగిస్తున్నారని ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.
ములుగు కోసం పోటీలో ఆ ఇద్దరు...
ట్రాన్‌పోర్ట్ డిపార్టుమెంట్‌లో పని చేస్తున్న ఇద్దరు అధికారులు కొత్తగా ఏర్పడిన ములుగు జిల్లా కోసం కూడా పోటీ పడుతుండటం ఆ శాఖలో హాట్‌టాపిక్‌గా మారింది. వరంగల్ రూరల్ రెగ్యులర్ ఎంవీఐ రమేష్‌రాథోడ్ జనగామ ఇన్‌చార్జి ఎంవీఐతో పాటు డీటీవోగా మూడు బాధ్యతలు నిర్వహిస్తూ ములుగు ఇన్‌చార్జి డీటీవో కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.
భూపాలపల్లి ఎంవీఐగా రెగ్యులర్ పోస్టులో ఉన్న పి.రవిందర్ ఇన్‌చార్జి డీటీవోతో పాటు ఖమ్మం ఇన్‌చార్జి ఎంవీఐగా కూడా బాధ్యతల్లో ఉండి, ములుగు కోసం ప్రయత్నం చేస్తున్నట్లు ఆ శాఖ అధికారులు చర్చించుకుంటున్నారు.
మహబూబాబాద్ రెగ్యులర్ ఎంవీఐగా, అక్కడే ఇన్‌చార్జి డీటీవోగా, ఖమ్మం ఇన్‌చార్జి డీటీవోగా వ్యవహరిస్తున్న బద్రునాయక్‌కు కూడా ఈ రేసులో ఉన్నట్లు మంత్రి పేషీకి చేరిన ఫిర్యాదులో పేర్కొనడం ఆ శాఖలో చర్చనీయాశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment