సాక్షి ప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం హెలికాప్టర్‌లోహైదరాబాద్ నుంచి బయలుదేరి 11.35 గంటలకు జనగామ కలెక్టరేట్ ప్రాంగణంలో దిగుతారు. 11.45 గంటలకు కలెక్టరేట్ నూతన భవన సముదాయాన్ని ప్రారంభించి, అక్కడే అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3.05 గంటలకు వరంగల్–హైదరాబాద్ హైవే పక్కన యశ్వంతాపూర్ శివారులో టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 3.30 గంటలకు అదే ప్రాంతంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు ప్రసంగం ముగింపు ఉంటుంది. 5.15 గంటలకు హెలికాప్టర్‌లో సీఎం హైదరాబాద్‌కు తిరిగి వెళతారు.
ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు
రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు గురువారం బహిరంగ సభాస్థలిని, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. జన సమీకరణపై కసరత్తు చేశారు. ముఖ్యమంత్రి ప్రారంభించనున్న కలెక్టరేట్ సముదాయం, పార్టీ కార్యాలయాన్ని కలెక్టర్, పోలీసు కమిషనర్‌లతో కలిసి సందర్శించారు.
సీఎంకు ఘనస్వాగతం పలకాలి: మంత్రులు
కరువు జిల్లాగా ఉన్న జనగామను సస్యశ్యామలం చేసి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలకాలని మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటుపై అక్కసు వెళ్లగక్కిన నేపథ్యంలో మండిపడుతున్న తెలంగాణ ప్రజలు శుక్రవారం జరిగే సభకు భారీ ఎత్తున పోటెత్తనున్నారని చెప్పారు. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం, టీఆర్‌ఎస్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించిన తర్వాత, పార్టీ జిల్లా అధ్యక్షులు పదవీ బాధ్యతలు చేపడతారని, అనంతరం సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment