ఎంవీఐపై చీటింగ్ కేసు | cheating case on motor vehicle inspector | Sakshi
Sakshi News home page

ఎంవీఐపై చీటింగ్ కేసు

Published Thu, Dec 12 2013 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM

cheating case on motor vehicle inspector

 సాక్షి, హైదరాబాద్:  రాష్ట్ర రవాణా శాఖలో మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ)గా విధులు నిర్వహిస్తున్న ఓ అధికారిపై హైదరాబాద్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఆర్టీఏలో కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తానని అదే సంస్థలో పనిచేస్తున్న 98 మంది హోంగార్డులను నమ్మించి సుమారు రూ.5 కోట్లు వసూలు చేసి మోసగించారని ఎంవీఐపై ఆరోపణ. వివరాలిలా ఉన్నాయి. రాజమండ్రికి చెందిన భీంరావు కత్తిపూడి చెక్‌పోస్టు వద్ద రవాణా శాఖలో మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సరిగ్గా రెండేళ్ల క్రితం మోసానికి తెర లేపాడు. రవాణా శాఖలో 23 జిల్లాల్లో పనిచేస్తున్న సుమారు 98 మంది హోంగార్డులకు నేరుగా కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు.

అందుకు ఒక్కొక్కరు రూ.5 లక్షలు ఇవ్వాలని బేరం పెట్టాడు. అతని వలలో పడ్డ అన్ని జిల్లాల హోంగార్డులు విడతల వారీగా ఒక్కొక్కరు రూ.4 లక్షల చొప్పున అతనికి చెల్లించారు. హైదరాబాద్ జిల్లాలో పనిచేస్తున్న 13 మంది హోంగార్డులు బెల్‌సన్ తాజ్ హోటల్‌లో భీంరావుకు ఒకసారి రూ.20 లక్షలు మరోసారి రాజమండ్రిలోని అతని గెస్ట్‌హౌస్‌లో అతని వద్ద విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు మస్తాన్‌రావు, కృష్ణ, సత్తిబాబు, రాజేష్‌లకు మరో రూ.20 లక్షలు, భీంరావుకు  మూడు విడతలుగా రూ.12 లక్షలు ఇచ్చారు. ఇలా అన్ని జిల్లాల హోంగార్డుల నుంచి అతను సుమారు రూ.5 కోట్లు వసూలు చేశాడు. ఏళ్లు  గడుస్తున్నా కానిస్టేబుల్ ఉద్యోగాలు రాకపోవడంతో హోంగార్డులు  భీంరావుకు ఫోన్‌చేసి తమ బాధను వెళ్లబోసుకునేవారు.

అతను రేపుమాపు అంటూ దాటవేస్తూ వచ్చాడు. అనుమానం వచ్చిన వివిధ జిల్లాల హోంగార్డులు రెండు నెలలుగా రాజమండ్రిలోని అతని నివాసానికి వెళ్లడం ప్రారంభించడంతో వారికి చిక్కకుండా తిరిగాడు.  ఫోన్ చేసి వేడుకుంటే ఎస్సీఎస్టీ కేసులు పెట్టిస్తానని బెదిరించాడు. దాంతో పలువురు హోంగార్డులు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మను కలిసి ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు సీసీఎస్ పోలీసులు ఎంవీఐ భీంరావుతో పాటు అతనికి సహకరించిన హోంగార్డులు మస్తాన్‌రావు, కృష్ణ, సత్తిబాబు, రాజేష్‌లపై బుధవారం చీటింగ్ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement