bhim rao
-
గిరిజనుడిపై పులి దాడి
ఖానాపూర్ మండలం సోమర్‌పేట పంచాయతీ కులాంగూడ గ్రామ సమీపంలో భీంరావు(34) అనే గిరిజనుడిపై పులి దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడిని ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన యువకుని వివరాలు తెలియాల్సి ఉంది. అప్రమత్తమైన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. -
మళ్లీ తెరపైకి భీమ్రావ్ బాడా వివాదం
మంత్రి కాన్యాయ్‌ను అడ్డుకున్న బస్తీవాసులు సమస్యపై భిన్నస్వరాలు విన్పించిన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి ఈటెల నాంపల్లి: గతంలో హామీ ఇచ్చిన మేరకు భీమ్రావ్బాడా బస్తీవాసులకు న్యాయం చేయాలని కోరుతూ స్థానికులు గురువారం రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. నాంపల్లిలోని గృహకల్ప ప్రాంగణంలో ఓ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రి ఈటెల, డిప్యూటీ సీఎం వస్తున్నారని తెలుసుకున్న బస్తీ వాసులు సాయంత్రం 4 గంటలకు అక్కడికి చేరుకున్నారు. సమావేశం ముగియగానే మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి ఈటెల బస్తీవాసుల వద్దకు వచ్చి మాట్లాడారు. గతంలో బస్తీని ఖాళీ చేయించిన సమయంలో టీఆర్ఎస్ తరపున మీరే హాజరయ్యారని, బాధితులకు భరోసా ఇచ్చారని, ఈ మేరకు ఇప్పుడు అధికారంలో ఉన్నందున న్యాయం చేయాలని బస్తీవాసులు మంత్రిని కోరారు. దీనిపై స్పందించిన ఈటెల.. బస్తీ వాసులకు న్యాయం చేసేందుకు టీఆర్ఎస్ సర్కార్ చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. దీంతో బస్తీవాసులు శాంతించి మంత్రికి జిందాబాద్‌లు కొట్టారు. డిప్యూటీ సీఎం వర్సెస్ మంత్రి భీమ్రావ్ బాడా వివాదం గురువారం డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి ఈటెల రాజేందర్ల మధ్య వాగ్వివాదానికి దారితీసింది. బస్తీవాసుల ముందే ఈఅంశంపై ఇరువురు భిన్నస్వరాలు విన్పించారు. భీమ్రావ్ బాడాలో పేదలకు ఇళ్లను నిర్మించాలని ఈటె ల రాజేందర్ రెవెన్యూ మంత్రి కూడా అయిన మహమూద్ అలీని కోరారు. అయితే ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఉన్న స్థలంలో పేదలకు ఇళ్లు ఎలా ఇస్తారంటూ ఆయన ప్రశ్నించారు. దీనిపై ఈటెల మాట్లాడుతూ ముఖ్యమైన ప్రాంతాల్లో పేదలు ఉండకూడదనడం సబబుకాదన్నారు. ఈ దశలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ జోక్యం చేసుకుని వాదనలకు తెరదించారు. కాగా బస్తీ వివాదంపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి మరో రెండు నెలలు సమయం ఇస్తున్నామని, న్యాయం చేయకుంటే ఉద్యమిస్తామని గంగపుత్ర సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్.కొమురయ్య హెచ్చరించారు. -
ఎంవీఐపై చీటింగ్ కేసు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రవాణా శాఖలో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ)గా విధులు నిర్వహిస్తున్న ఓ అధికారిపై హైదరాబాద్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఆర్టీఏలో కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తానని అదే సంస్థలో పనిచేస్తున్న 98 మంది హోంగార్డులను నమ్మించి సుమారు రూ.5 కోట్లు వసూలు చేసి మోసగించారని ఎంవీఐపై ఆరోపణ. వివరాలిలా ఉన్నాయి. రాజమండ్రికి చెందిన భీంరావు కత్తిపూడి చెక్‌పోస్టు వద్ద రవాణా శాఖలో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. సరిగ్గా రెండేళ్ల క్రితం మోసానికి తెర లేపాడు. రవాణా శాఖలో 23 జిల్లాల్లో పనిచేస్తున్న సుమారు 98 మంది హోంగార్డులకు నేరుగా కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. అందుకు ఒక్కొక్కరు రూ.5 లక్షలు ఇవ్వాలని బేరం పెట్టాడు. అతని వలలో పడ్డ అన్ని జిల్లాల హోంగార్డులు విడతల వారీగా ఒక్కొక్కరు రూ.4 లక్షల చొప్పున అతనికి చెల్లించారు. హైదరాబాద్ జిల్లాలో పనిచేస్తున్న 13 మంది హోంగార్డులు బెల్సన్ తాజ్ హోటల్లో భీంరావుకు ఒకసారి రూ.20 లక్షలు మరోసారి రాజమండ్రిలోని అతని గెస్ట్‌హౌస్‌లో అతని వద్ద విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు మస్తాన్‌రావు, కృష్ణ, సత్తిబాబు, రాజేష్‌లకు మరో రూ.20 లక్షలు, భీంరావుకు మూడు విడతలుగా రూ.12 లక్షలు ఇచ్చారు. ఇలా అన్ని జిల్లాల హోంగార్డుల నుంచి అతను సుమారు రూ.5 కోట్లు వసూలు చేశాడు. ఏళ్లు గడుస్తున్నా కానిస్టేబుల్ ఉద్యోగాలు రాకపోవడంతో హోంగార్డులు భీంరావుకు ఫోన్‌చేసి తమ బాధను వెళ్లబోసుకునేవారు. అతను రేపుమాపు అంటూ దాటవేస్తూ వచ్చాడు. అనుమానం వచ్చిన వివిధ జిల్లాల హోంగార్డులు రెండు నెలలుగా రాజమండ్రిలోని అతని నివాసానికి వెళ్లడం ప్రారంభించడంతో వారికి చిక్కకుండా తిరిగాడు. ఫోన్ చేసి వేడుకుంటే ఎస్సీఎస్టీ కేసులు పెట్టిస్తానని బెదిరించాడు. దాంతో పలువురు హోంగార్డులు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మను కలిసి ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు సీసీఎస్ పోలీసులు ఎంవీఐ భీంరావుతో పాటు అతనికి సహకరించిన హోంగార్డులు మస్తాన్‌రావు, కృష్ణ, సత్తిబాబు, రాజేష్‌లపై బుధవారం చీటింగ్ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.