మళ్లీ తెరపైకి భీమ్‌రావ్ బాడా వివాదం
- మంత్రి కాన్యాయ్‌ను అడ్డుకున్న బస్తీవాసులు
- సమస్యపై భిన్నస్వరాలు విన్పించిన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి ఈటెల
నాంపల్లి: గతంలో హామీ ఇచ్చిన మేరకు భీమ్‌రావ్‌బాడా బస్తీవాసులకు న్యాయం చేయాలని కోరుతూ స్థానికులు గురువారం రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. నాంపల్లిలోని గృహకల్ప ప్రాంగణంలో ఓ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రి ఈటెల, డిప్యూటీ సీఎం వస్తున్నారని తెలుసుకున్న బస్తీ వాసులు సాయంత్రం 4 గంటలకు అక్కడికి చేరుకున్నారు. సమావేశం ముగియగానే మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి ఈటెల బస్తీవాసుల వద్దకు వచ్చి మాట్లాడారు.
గతంలో బస్తీని ఖాళీ చేయించిన సమయంలో టీఆర్‌ఎస్ తరపున మీరే హాజరయ్యారని, బాధితులకు భరోసా ఇచ్చారని, ఈ మేరకు ఇప్పుడు అధికారంలో ఉన్నందున న్యాయం చేయాలని బస్తీవాసులు మంత్రిని కోరారు. దీనిపై స్పందించిన ఈటెల.. బస్తీ వాసులకు న్యాయం చేసేందుకు టీఆర్‌ఎస్ సర్కార్ చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. దీంతో బస్తీవాసులు శాంతించి మంత్రికి జిందాబాద్‌లు కొట్టారు.
డిప్యూటీ సీఎం వర్సెస్ మంత్రి
భీమ్‌రావ్ బాడా వివాదం గురువారం డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి ఈటెల రాజేందర్‌ల మధ్య వాగ్వివాదానికి దారితీసింది. బస్తీవాసుల ముందే ఈఅంశంపై ఇరువురు భిన్నస్వరాలు విన్పించారు. భీమ్‌రావ్ బాడాలో పేదలకు ఇళ్లను నిర్మించాలని ఈటె ల రాజేందర్ రెవెన్యూ మంత్రి కూడా అయిన మహమూద్ అలీని కోరారు.
అయితే ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఉన్న స్థలంలో పేదలకు ఇళ్లు ఎలా ఇస్తారంటూ ఆయన ప్రశ్నించారు. దీనిపై ఈటెల మాట్లాడుతూ ముఖ్యమైన ప్రాంతాల్లో పేదలు ఉండకూడదనడం సబబుకాదన్నారు. ఈ దశలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ జోక్యం చేసుకుని వాదనలకు తెరదించారు. కాగా బస్తీ వివాదంపై టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మరో రెండు నెలలు సమయం ఇస్తున్నామని, న్యాయం చేయకుంటే ఉద్యమిస్తామని గంగపుత్ర సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్.కొమురయ్య హెచ్చరించారు.