spears
-
కరీంనగర్ నుంచే కేజీ టు పీజీ
హుస్నాబాద్ రూరల్: ఎన్నికల హామీల్లో భాగంగా కేజీ టు పీజీ విద్యా పథకాన్ని కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభిస్తానని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. హుస్నాబాద్‌లోని వెంకటేశ్వర గార్డెన్లో పార్లమెంటరీ కార్యదర్శి వొడితెల సతీష్‌కుమార్ ఆత్మీయ సన్మాన సభ శుక్రవారం రాత్రి జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఈటెల మాట్లాడుతూ.. పద్నాలుగేళ్ల తెలంగాణ ఉద్యమంలో జైళ్లకు వెళ్లి బాధలు భరించిన తెలంగాణ బిడ్డల అభివృద్ధి కోసం, బంగారు రాష్ట్రం నిర్మాణం కోసం కృషి చేస్తామన్నారు. తమకు మంత్రి పదవులు వస్తే తెలంగాణ ప్రజలందరికీ మంత్రి పదవులు వచ్చాయనే సంతోషంతో ఉన్నామన్నారు. ఇది బీద తెలంగాణ కాదని, బీదగా మార్చబడ్డ తెలంగాణ అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ.17వేల కోట్ల బడ్జెట్‌ను రూపొందించామని నాటి పాలకులు ప్రగల్భాలు పలికారని, తెలంగాణ వస్తే రూ.లక్ష కోట్ల బడ్జెట్‌ను పెట్టిన ఘనత టీఆర్ఎస్ సర్కారుకే దక్కిందన్నారు. ఉమ్మడి సర్కారు హయాంలో రూ.1,030కోట్ల నిధులను పింఛన్ల కోసం వెచ్చిసే..్త తెలంగాణ సర్కారు ఇప్పటికే రూ.4వేల కోట్లు పింఛన్ డబ్బులను పంపిణీ చేయడమే కాకుండా అదనంగా మరో రూ.370కోట్లను విడుదల చేసిందన్నారు. ఏడున్నర ఎకరాల భూమి, నాలుగు గదుల ఇల్లు, ట్రాక్టరు, కారు ఉన్నప్పటికీ వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆహార భద్రత కార్డును అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు సన్న బియ్యం సరఫరా చేసేందుకు ప్రస్తుతం రెండు లక్షల టన్నుల సన్నబియ్యం నిల్వ ఉంచామన్నారు. సచివాలయాన్ని ఎన్నడూ చూడని తెలంగాణ బిడ్డలు ఈ రోజు ధైర్యంగా వచ్చి చూస్తున్నారన్నారు. సచివాలయానికి వచ్చే వారి వద్దనుంచి చెమట వాసన వస్తున్నదని ఐఏఎస్ అధికారులు వ్యాఖ్యానిస్తే చెమట వాసన వచ్చే ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలేనని గర్వంగా సమాధానమిచ్చామని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంటు కోసం రూ.500 కోట్లు తెలంగాణ విద్యార్థుల కోసం రూ.5వేల కోట్ల ని ధులను త్వరలోనే విడుదల చేయనున్నట్లు మంత్రి ఈటెల తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంటు గురించి కొందరు విద్యార్థులు సమావేశంలో మంత్రిని అడుగగా స్పందించిన ఆయన రేపే నిధుల విడుదల ఫైలుపై సంతకం చేయనున్నట్లు ప్రకటించడంతో విద్యార్థులు హ ర్షధ్వానాలు చేశారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ కార్యదర్శి వొడితెల సతీష్‌కుమార్, మాజీ ఎమ్మె ల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జడ్పీ వైస్‌చైర్మన్ రా యిరెడ్డి రాజిరెడ్డి, న గర పంచాయతీ చైర్మన్ సు ద్దాల చంద్రయ్య, మాజీ జెడ్పీటీసీ కర్ర శ్రీహరి, ఎంపీపీ భూక్య మంగ తదితరులు పాల్గొన్నారు. కమలాపూర్స్కూల్లో అదనంగా 5వ తరగతి విభాగం సాక్షి,హైదరాబాద్: కరీంనగర్ జిల్లా కమలాపూర్‌లోని మహత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పాఠశాలలో 5వ తరగతికి సంబంధించి అదనంగా 40 సీట్లతో మరో సెక్షన్‌ను ఏర్పాటుచేసేందుకు రూ.82 లక్షలకు పరిపాలనాపరమైన మంజూరు ఇచ్చారు. ఈమేరకు శనివారం రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి టి.రాధ ఆదేశాలు జారీచేశారు. -
1 నుంచి ఆరు కేజీల బియ్యం
కుటుంబంలో అందరికీ పంపిణీ: మంత్రి ఈటెల హాస్టళ్లకు, మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్యం కూడా పేదలకు గులాబీ రంగులో రేషన్ కార్డులు.. పాత గులాబీ కార్డుల స్థానంలో తెల్ల కార్డులు కార్డుల జారీ ఆలస్యమైనా సరుకులు అందిస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పేదలకు వచ్చే జనవరి 1నుంచి ఒక్కొక్కరికి ఆరు కేజీల చొప్పున బియ్యం పంపిణీని ప్రారంభిస్తామని ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి ఆరు కేజీల చొప్పున బియ్యం ఇస్తామని, అలాగే హాస్టళ్లకు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యాన్ని కూ డా 1వ తేదీ నుంచి పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. ఈ మేరకు బియ్యం పంపిణీ కార్యక్రమంలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లాల కలెక్టర్లకు, అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. మంత్రి ఈటెల శనివారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. కొత్త కార్డులు సరుకులకే పరిమితం: అల్పాదాయ వర్గాలకు గతంలో ఉన్న తెల్ల రేషన్‌కార్డు ల స్థానంలో కొత్తగా గులాబీ రంగు రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు ఈటెల తెలిపారు. ఇప్పటివరకూ ఉన్న గులాబీ కార్డుల స్థానంలో తెల్ల రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. కొత్తగా జారీ చేసే గులాబీ రంగు కార్డులు బియ్యం, కిరోసిన్, గోధుమలు, పంచదార, కందిపప్పు వంటి రేషన్ సరుకులకు మాత్రమే పరిమితమని మంత్రి మరోసారి స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ తదితర పథకాలకు ఈ కార్డులను పరిగణనలోకి తీసుకోబోరని చెప్పారు. జనవరి నెలాఖరులోగా 99 శాతం రేషన్ కార్డుల పంపిణీని పూర్తి చేస్తామని... కొత్త కార్డులు అందడం ఆలస్యమైనా జనవరి 1వ తేదీ నుంచే బియ్యం పంపిణీ కొనసాగుతుందని ఈటెల వెల్లడించారు. అర్హులైన పేదలకు రేషన్ కార్డుల జారీ ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో గతంలో ఉన్న రేషన్‌కార్డుల కన్నా ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులకు కార్డులు అందజేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. పాఠశాలలు, హాస్టళ్లలో: ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్ని వసతి గృహాలకు సన్న రకం(బీపీటీ) బియ్యాన్ని జనవరి 1నుంచి పంపిణీ చేయనున్నట్లు ఈటెల తెలిపారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజ న కార్యక్రమానికి కూడా సన్న బియ్యాన్ని ఈ నెల 2వ తేదీ నుంచి (1న సెలవు మేరకు) పం పిణీ చేయాలని నిర్ణయించామని చెప్పారు. గ్రా మాల్లో సర్పంచులు, మండలాల్లో ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీల్లో కా ర్పొరేటర్లు, చైర్మన్లు, నగరాల్లో మేయర్లు, నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా కేంద్రాల్లో మంత్రులందరూ ఈ బియ్యం పంపి ణీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: సంక్షే మ పథకాలను పూర్తి పారదర్శకంగా అమలుచేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని మంత్రి ఈటెల చెప్పారు. గతంలో కన్నా ఎక్కువ బియ్యం, ఎక్కువ రేషన్‌కార్డులు ఇస్తున్నామని... ఎక్కడైనా అవకతవకలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. రేషన్‌కార్డుల సంఖ్యకు అనుగుణంగా గ్రామాలు, మండల కేంద్రాలు, మున్సిపాలిటీల వారీగా రేషన్ షాపులను పెంచుతామని తెలిపా రు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, పౌర సరఫరాల శాఖ అధికారులు ఉన్నారు. -
భారీ పెట్టుబడుల వల్లే ద్రవ్యలోటు
వ్యవసాయం, విద్యుత్, నీటిపారుదల, తాగునీరు, రహదారులకు అధిక ప్రాధాన్యం ద్రవ్యపరపతి విధానం వెల్లడించిన మంత్రి ఈటెల సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం మొదటి సంవత్సరంలోనే మౌలికవసతుల కల్పనకు పెద్దపీట వేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ద్రవ్యలోటు భారీగా కనిపిస్తున్నదని, దీనిని రానున్న కాలంలో ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడి ఉండేలా కృషి చేస్తామని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ శాసనసభకు హామీ ఇచ్చారు. ప్రభుత్వ ద్రవ్యపరపతి విధానాన్ని ఆయన శుక్రవారం సభ ముందుంచారు. పన్నుల ఆదాయం పెంచుకోవడం, ప్రజాధనాన్ని ఉత్పాదకత పెంచే రంగాలపై వ్యయం చేయనున్నట్టు తెలి పారు. ఆదాయమార్గాలను పెంచుకుంటామని, పన్నుల హేతుబద్దీకరణ, లావాదేవీల వ్యయం తగ్గించుకోవడం, రెవెన్యూ లీకేజీని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పదినెలల కాలానికి 35,378 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేశామని ఇది దాదాపు 15 శాతం అధికమని వివరించారు. కాగా పన్నేతర ఆదాయం కింద అన్ని విభాగాల నుంచి రూ. 13,242 కోట్లు వస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భూముల క్రమబద్దీకరణతో 6,500 కోట్లు వస్తాయని అంచనా వేసినట్టు ఆర్థికమంత్రి వెల్లడించారు. ఆదాయం అంచనా వేయలేం తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిందని గతంలో ఆదాయానికి సంబంధించి లెక్కలు లేనందున 2015-16 సంవత్సరం, 2016-17 సంత్సరానికి నిజమైన ఆదాయ అంచనా వేయడం సాధ్యం కాలేదని పేర్కొన్నారు. తెలంగాణలో 2004-05 నుంచి 2013-14 వరకు సరాసరి అభివృద్ధి రేటు 9.83 శాతంగా ఉందని, రాష్ట్ర స్థూలఉత్పత్తి 2004-05 స్థిరధరలతో పోలిస్తే రూ. 2,07,069 కోట్లు అని పేర్కొన్నారు. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే.. ఇది 5.55 శాతం అధికమని పేర్కొన్నారు. అయితే 2009-10 సంవత్సరం నుంచి అభివృద్ధి తగ్గుతూ వచ్చిందని మంత్రి సభకు వివరించారు. పారిశ్రామికరంగం బాగా దెబ్బతినగా, సేవారంగంలో పురోగతి నెమ్మదించిందని మంత్రి వివరించారు. అయినప్పటికీ, జాతీయ స్థూలఉత్పత్తితో పోలిస్తే, రాష్ట్ర పురోగతి మెరుగ్గానే ఉన్నట్టు మంత్రి వివరించారు. 2013-14 సంవత్సరంలో రాష్ట్ర స్థూలఉత్పత్తిలో సేవారంగంలో 7.15 శాతంగానూ, వ్యవసాయం 4.58 శాతం, పరిశ్రమల రంగం 2.70 శాతం ఉన్నట్టు తెలిపారు. అసంఘటిత ఉత్పత్తుల రంగంలో 2.29 శాతం, మైనింగ్, క్వారీల్లో 2.58 శాతం నెగెటివ్ గ్రోత్ ఉన్నట్టు వివరించారు. మొత్తం ఆదాయంలో 90 శాతానికి మించి ప్రభుత్వ గ్యారంటీలు ఇవ్వలేదని మంత్రి పేర్కొన్నారు. పెరిగిన వ్యక్తిగత ఆదాయం కాగా తెలంగాణ రాష్ట్రంలో వ్యక్తిగత తలసరి ఆదాయం పెరిగిందని వివరించారు. 2009-10 సంవత్సరంలో వ్యక్తిగత తలసరి ఆదాయం 51,955 రూపాయలుంటే.. 2013-14 సంవత్సరం నాటికి అది 93,151 రూపాయలకు చేరిందని పేర్కొన్నారు. -
అర్హులందరికీ ఆసరా
సంక్షేమ పథకాలపై అపోహలొద్దని, అర్హులందరికీ ఆసరా అందిస్తామని రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, కె.తారకరామారావు స్పష్టం చేశారు. పెరిగిన పింఛన్ల పంపిణీ(ఆసరా) పథకాన్ని హుజూరాబాద్, మానకొండూర్, జగిత్యాల నియోజకవర్గాల్లో ఈటెల, కరీంనగర్, సిరిసిల్లల్లో కేటీఆర్ ప్రారంభించి మాట్లాడారు. అనర్హుల పింఛన్లు తొలగిస్తామని, అర్హులకు అన్యాయం జరగనివ్వబోమని అన్నారు. ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతమని, వారి మాటలు నమ్మొద్దని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరూ కలిసి రావాలని కోరారు. కరీంనగర్ : సంక్షేమ పథకాలపై అపోహలొద్దని, అర్హులందరికీ అందిస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు భరోసా ఇచ్చారు. పెరిగిన పింఛన్ల పంపిణీ(ఆసరా) కార్యక్రమాన్ని నగరంలోని వరలక్ష్మి గార్డెన్లో శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో పింఛన్ల పెంపు జరిగిందన్నారు. వృద్ధులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 పింఛన్ ఇస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్నారు. పింఛన్లపై ప్రతిపక్షాలు ఆరోపణలు మానుకోవాలన్నారు. ఆధార్‌కార్డు లేకున్నా... మరణ ధ్రువీకరణ పత్రం లేకున్నా మూడు నెలల్లోగా సర్పంచ్, ఎంపీటీసీ, కార్యదర్శి నివేదికల ఆధారంగా డెత్ సర్టిఫికెట్లు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు. పింఛన్లు కుదించామనే మాటలు అవాస్తవమని, గతంలో అర్హతలేని వారు పింఛన్లు పొందారని, వాటిని మాత్రమే తొలగిస్తామని పేర్కొన్నారు. అర్హులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదన్నారు. కుటుంబంలో ప్రతీఒక్కరికి ఆరు కిలోల బియ్యం రూపాయికే అందిస్తామని తెలిపారు. మూలమలుపుతో ఉన్న రాజీవ్ రహదారికి రూ.750 కోట్లతో మెరుగులు దిద్దుతామన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు రాజకీయాలు మానుకుని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని హితవు పలికారు. గత ప్రభుత్వాల హయాంలో నియోజకవర్గంలో 7,100 మందికి మాత్రమే పింఛన్లు అందేవని, తాజాగా మండలంలోనే 8,850 పింఛన్లు మంజూరు చేశామని వెల్లడించారు. నగర రోడ్ల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.46 కోట్లు మంజూరు చేస్తే... మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఒక్క రూపాయి కూడా అభివృద్ధి జరగలేదనడం తగదని మండిపడ్డారు. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ.. నవ తెలంగాణ నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. మేయర్ రవీందర్‌సింగ్ మాట్లాడుతూ.. కడుపునిండా అన్నం, కంటి నిండా నిద్ర కల్పించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, డెప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, జెడ్పీటీసీ ఎడ్ల శ్రీనివాస్, ఎంపీపీ వాసాల రమేశ్ పాల్గొన్నారు. -
‘ఈటెల'పైనే ఆశలు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బుధవారం తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. జిల్లాకు చెందిన రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఈ తొలి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఆయనపై జిల్లా ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. విత్త మంత్రి మనోడే కావడంతో కరీంనగర్ జిల్లాను అభివృద్ధి చేసేందుకు ఏ మేరకు కేటాయింపులు చేస్తారనే అంశంపై చర్చించుకుంటున్నారు. గతంలో పనిచేసిన కేంద్ర, రాష్ట్ర ఆర్థిక మంత్రులు బడ్జెట్లో తమ సొంత జిల్లాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఈటెల రాజేందర్ సైతం సొంత జిల్లాపై మమకారం చూపుతారా? లేదా? అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. - కరీంనగర్ సిటీ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న మధ్యమానేరు, ఎస్సారెస్పీ వరద కాలువ, ఎల్లంపల్లి సాగునీటి ప్రాజెక్టులకు ఈ బడ్జెట్లో పెద్దపీట వేయనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తే సాగు, తాగునీటి కష్టాలు తీరుతాయి. ఏడాదిలోపు మధ్యమానేరు ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో అందుకోసం అవసరమైన రూ.425 కోట్లతో పాటు పరిహారం, పునరావాసం కోసం నిర్వాసితులకు చెల్లించాల్సిన రూ.360 కోట్లను ఈ బడ్జెట్లోనే కేటాయించాలని జిల్లావాసులు కోరుతున్నారు. వరదకాలువ పనులు పూర్తి చేయడంతో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం, పునరావాసం కల్పనకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హుస్నాబాద్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు గండిపల్లి, గౌరవెల్లి, తోటపల్లి రిజర్వాయర్లను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ జలయజ్ఞంలో భాగంగా మంజూరు చేశారు. ఆయన మరణానంతరం ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ఈ మూడు జలాశయాల పనులు అడుగు కూడా ముందుకు కదల్లేదు. టీఆర్ఎస్ సర్కారు ఈ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి, పనులు పూర్తి చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. మన ఊరు-మన ప్రణాళికలో భాగంగా జిల్లాలోని చెరువుల పునరుద్ధరణకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయించాలని స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి అయ్యే వ్యయంలో రాష్ట్ర వాటాను ఈ బడ్జెట్లో ఏ మేరకు కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు మంత్రులు జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఇప్పటికే పలు వరాలు ప్రకటించారు. బడ్జెట్లో హామీల అమలుకు తగిన కేటాయింపులు చేస్తామని వాగ్దానం చేసిన నేపథ్యంలో ఆర్థిక మంత్రి తన బడ్జెట్లో సొంత జిల్లాకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారనే ఆశాభావం ప్రజల్లో నెలకొంది. జిల్లాలో ఏకైక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కొనసాగుతున్న జగిత్యాల శాసనసభ్యుడు టి.జీవన్‌రెడ్డి సైతం జిల్లా సమగ్రాభివృద్ధికి పూర్తిస్థాయిలో నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగా జగిత్యాల నియోజకవర్గంలోని సారంగపూర్ మండలంలో బీపూర్ శివారులో రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ పనుల పూర్తికి అవసరమైన రూ.60 కోట్లు కేటాయించాలని, జగిత్యాల, రాయికల్ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకానికి అవసరమైన నిధులు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ హామీలకు మోక్షం లభించేనా? ఆగస్టు 8న సీఎం కేసీఆర్ జిల్లాకు వచ్చిన సందర్భంగా అనేక వరాలు ప్రకటించారు. కరీంనగర్ జిల్లాను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం ఇచ్చిన ప్రధాన హామీలివే.. కరీంనగర్ నగర పునర్నిర్మాణ పథకం పూర్తి నగరం చుట్టూ రింగురోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు ఎన్టీపీసీలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు కాకతీయ కెనాల్ కెపాసిటీని 12 వేల క్యూసెక్కుల నుంచి 14 వేల క్యూసెక్కులకు పెంచడం ఎస్సారెస్పీ నీటిని రీజనరేట్ చేసుకోవడానికి చర్యలు వరదకాలువ స్థాయి పెంచడం ఎస్సారెస్పీ పరిధిలో ఎత్తై ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు చిన్నపాటి లిఫ్ట్‌లు ఏర్పాటు రాయికల్ వద్ద గోదావరిపై బ్రిడ్జి, చెక్‌డ్యాం నిర్మాణం వేగురుపల్లి-నీరుకుల్ల నడుమ బ్రిడ్జినిర్మాణం మానేరు నదిపై కమాన్‌పల్లి, భూపాలపల్లిని కలుపుతూ వంతెన నిర్మాణం జగిత్యాలను జిల్లాగా ఏర్పాటు చేయడం కొత్తగా ఏడు వ్యవసాయ మార్కెట్లు ఏర్పాటు చేయడం మానకొండూరు చెరువును అభివృద్ధి చేయడం కరీంనగర్లో ఇండోర్ సబ్‌స్టేషన్ ఏర్పాటు రామగుండం నగరానికి తాగునీటి కోసం ఎల్లంపల్లి ప్రాజెక్ట్నుంచి ఒక టీఎంసీ నీటిని తీసుకురావడం రామగుండంలో సింగరేణి ఆధ్వర్యంలో ఆధునాతన హాస్పిటల్ ఏర్పాటు, మైనింగ్ పాలిటెక్నిక్ ఏర్పాటు జిల్లా ఆసుపత్రిని నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయడం పెద్దపల్లిలో వందపడకల ఆసుపత్రి నిర్మాణం హుస్నాబాద్ ఆసుపత్రి స్థాయి 50 పడకలకు పెంపు మంథనిలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి స్థల సేకరణ కొండగట్టుపైన 300 ఎకరాల స్థలంలో తిరుపతి స్థాయిలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయడం ఎమ్మెల్యేల ప్రతిపాదనలకు నిధులు సమకూరే నా? ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఇటీవల అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో సమావేశమై నియోజకవర్గాల అభివృద్ధికి పలు ప్రతిపాదనలు సమర్పించారు. ఆయా ప్రతిపాదనలన్నింటికీ ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయించాలని కోరారు. నియోజకవర్గాల వారీగా పలువురు ఎమ్మెల్యేలు సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనలివే... రామగుండం బీ-థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని జెన్కో ద్వారా విస్తరింపచేయాలి. రామగుండంకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి తాగునీరు అందించేందుకు నిధులు గోదావరి పుష్కరాల దృష్ట్యా స్నానఘట్టాల నిర్మాణం, నిధులు కేటాయింపు రామగుండంలో మెడికల్ కళాశాల ఏర్పాటు అంతర్గాంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ నిర్మించాలి ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు ఎయిర్‌పోర్టు, ఐటీ పార్క్ ఏర్పాటు హుజూరాబాద్ హుజూరాబాద్, జమ్మికుంట నగరపంచాతీయలకు రూ.120 కోట్లతో తాగునీరు రూ.60 కోట్లతో హుజూరాబాద్ మోడల్ చెరువును రిజర్వాయర్‌గా మార్చడం, ఫిల్టర్‌బెడ్, పైప్లైన్ల నిర్మాణం రూ.60 కోట్లతో జమ్మికుంట నాయిని చెరువు రిజర్వాయర్ రూ.40 కోట్లతో కేసీ క్యాంప్‌లో ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం రూ.18 కోట్లతో హుజూరాబాద్ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చడం రూ.30 కోట్లతో ఇల్లందకుంటలో సీపీడడబ్ల్యూఎస్-2 నిర్మాణం మానేరు వాగుపై 11 చెక్‌డ్యాంల నిర్మాణం కోరుట్ల రూ.4.75 కోట్లతో మల్లాపూర్ మండలం సోమన్నగుట్ట అభివృద్ధి, ఘాటురోడ్డు నిర్మాణం రూ.1.50 కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణం కోరుట్ల, మెట్‌పల్లిల్లో రూ.13.75 కోట్లతో తాగునీటి పనులు కోరుట్ల వెటర్నరీ కళాశాలను వెటర్నరీ యూనివర్సిటిగా మార్చాడం కరీంనగర్ కరీంనగర్ రెనోవేషన్‌కు అదనంగా రూ.25 కోట్లు యూజీడీ పనుల పూర్తికి నిధులు కమాన్ నుంచి హౌసింగ్‌బోర్డుకాలనీ మీదుగా సదాశివపల్లికి కొత్త బైపాస్‌రోడ్డు పెద్దపల్లి పెద్దపల్లి-కూనారం నడుమ రైల్వే బ్రిడ్జి ఏర్పాటు పెద్దపల్లి ఆసుపత్రిని వంద పడుకల ఆసుపత్రిగా మార్చడం సుల్తానాబాద్‌లో ఆసుపత్రి భవన నిర్మాణం, వైద్యులకు క్వార్టర్ల నిర్మాణం పది నూతన సబ్స్టేషన్ల నిర్మాణం ఎల్లంపల్లి ప్రాజె క్ట్ నుంచి డీ-83, డీ-86 కాలువకు అనుసంధానం చేయడం సుల్తానాబాద్-మానకొండూరు మండలాలను కలిపే నీరుకుల్ల వాగుపై బ్రిడ్జి నిర్మాణం చొప్పదండి కొంపల్లి రిజర్వాయర్ నుంచి కొండగట్టు పైకి వచ్చే పైప్‌లైన్‌కు అదనంగా రూ.కోటి నిధులు కొండగట్టుపై పీహెచ్సీ ఏర్పాటు గట్టు కింద ఆలయ భూముల్లో వాణిజ్య సముదాయం రుక్మాపూర్‌లో లెదర్పార్క్కు నిధులు కేటాయించాలి మోతె, నారాయణపూర్, పోతారం రిజర్వాయర్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలి కొండగట్టులో మాస్టర్‌ప్లాన్ ఏర్పాటు మంథని మంథని మండలం వీలోచవరం వద్ద గోదావరి నదిపై రూ.630 కోట్లతో డ్యాం, బ్రిడ్జి నిర్మాణం జేఎన్టీయూహెచ్ పూర్తిస్థాయి భవన సముదాయాలు, నిర్వహణ కోసం రూ.200 కోట్లు రూ.25 కోట్లతో సీసీ రోడ్లు, కల్వర్టుల నిర్మాణం పుష్కరాల సందర్భంగా రూ.7.10 కోట్లతో 18 రహదారుల నిర్మాణం, మరమ్మతులు రూ.5 కోట్లతో ఆరెవాగుపై బ్రిడ్జి నిర్మాణం వేములవాడ రుద్రంగి చెరువును రిజర్వాయర్‌గా మార్చడం వేములవాడలో వందపడకల ఆసుపత్రి ఏర్పాటు రూ.11 కోట్లతో వేములవాడ మూలవాగుపై రెండవ బ్రిడ్జి నిర్మాణం రూ.7 కోట్ల వ్యయంతో రెండు బైపాస్‌రోడ్ల విస్తరణ రూ.15 కోట్లతో రోడ్ల నిర్మాణం మానకొండూరు బెజ్జంకిలో 50 పడకల ఆసుపత్రి వేగురుపల్లి నుంచి నీరుకుల్ల వరకు వంతెన నిర్మాణం చెరువులు, రోడ్ల అభివృద్ధి ధర్మపురి ధర్మపురిలో బస్‌డిపో ఏర్పాటు మేడారం ఆసుపత్రి స్థాయి 30 పడుకలకు పెంపు గోదావరి పుష్కరాలకు రూ.500 కోట్ల నిధులు హుస్నాబాద్ నాలుగు సబ్స్టేషన్ల నిర్మాణం వరదనీటిని ఎల్లమ్మ చెరువులోకి పైప్‌లైన్ ద్వారా మళ్లించడం వరదకాలవు నిర్వాసితులకు పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజ -
మళ్లీ తెరపైకి భీమ్రావ్ బాడా వివాదం
మంత్రి కాన్యాయ్‌ను అడ్డుకున్న బస్తీవాసులు సమస్యపై భిన్నస్వరాలు విన్పించిన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి ఈటెల నాంపల్లి: గతంలో హామీ ఇచ్చిన మేరకు భీమ్రావ్బాడా బస్తీవాసులకు న్యాయం చేయాలని కోరుతూ స్థానికులు గురువారం రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. నాంపల్లిలోని గృహకల్ప ప్రాంగణంలో ఓ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రి ఈటెల, డిప్యూటీ సీఎం వస్తున్నారని తెలుసుకున్న బస్తీ వాసులు సాయంత్రం 4 గంటలకు అక్కడికి చేరుకున్నారు. సమావేశం ముగియగానే మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి ఈటెల బస్తీవాసుల వద్దకు వచ్చి మాట్లాడారు. గతంలో బస్తీని ఖాళీ చేయించిన సమయంలో టీఆర్ఎస్ తరపున మీరే హాజరయ్యారని, బాధితులకు భరోసా ఇచ్చారని, ఈ మేరకు ఇప్పుడు అధికారంలో ఉన్నందున న్యాయం చేయాలని బస్తీవాసులు మంత్రిని కోరారు. దీనిపై స్పందించిన ఈటెల.. బస్తీ వాసులకు న్యాయం చేసేందుకు టీఆర్ఎస్ సర్కార్ చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. దీంతో బస్తీవాసులు శాంతించి మంత్రికి జిందాబాద్‌లు కొట్టారు. డిప్యూటీ సీఎం వర్సెస్ మంత్రి భీమ్రావ్ బాడా వివాదం గురువారం డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి ఈటెల రాజేందర్ల మధ్య వాగ్వివాదానికి దారితీసింది. బస్తీవాసుల ముందే ఈఅంశంపై ఇరువురు భిన్నస్వరాలు విన్పించారు. భీమ్రావ్ బాడాలో పేదలకు ఇళ్లను నిర్మించాలని ఈటె ల రాజేందర్ రెవెన్యూ మంత్రి కూడా అయిన మహమూద్ అలీని కోరారు. అయితే ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఉన్న స్థలంలో పేదలకు ఇళ్లు ఎలా ఇస్తారంటూ ఆయన ప్రశ్నించారు. దీనిపై ఈటెల మాట్లాడుతూ ముఖ్యమైన ప్రాంతాల్లో పేదలు ఉండకూడదనడం సబబుకాదన్నారు. ఈ దశలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ జోక్యం చేసుకుని వాదనలకు తెరదించారు. కాగా బస్తీ వివాదంపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి మరో రెండు నెలలు సమయం ఇస్తున్నామని, న్యాయం చేయకుంటే ఉద్యమిస్తామని గంగపుత్ర సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్.కొమురయ్య హెచ్చరించారు. -
‘మూగ' గొంతులకు ప్రాణం
జమ్మికుంట : తోటి పిల్లల్లా గలగల మాట్లాడాలని కళలుగన్న ఆ చిన్నారుల ఆశ నెరవేరబోతోంది. పిల్లల గొంతు ఎలా ఉంటుందో విందామన్నా ఆ తల్లిదండ్రుల కోరిక సమీపిస్తోంది. ‘సాక్షి' అందించిన కథనానికి స్పందించిన ప్రభుత్వం ఇన్నాళ్లు మూగబోయిన ఆ గొంతులకు ప్రాణం పోసేం దుకు ముందుకొచ్చింది. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.నాలుగు లక్షలు విడుదల చేస్తూ.. పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలంటూ హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి లేఖ పంపించింది. మిగిలిన ఖర్చులన్నీ తాను భరిస్తానంటూ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ హామీ ఇవ్వడంతో ఆ కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. జమ్మికుంట మండలం బూజునూర్కు చెందిన కోమాకుల కుమారస్వామి, రజిత దంపతులకు కుమారుడు హేమవంత్, కూతు రు కృష్ణవేణి సంతానం. పిల్లలిద్దరికీ చిన్నప్పుడే గొంతు మూగబోయింది. కళ్లముందే కొడుకు, కూతురు ఇద్దరు తిరుగుతున్నా.. వారి మాట వినే భాగ్యం కలగలేదా దంపతులకు. వారి గొంతుకు ప్రాణం పోసేందుకు ఏడాది కాదు.. రెండేళ్లు కాదు.. పదహారేళ్లు ఉన్నదంతా ఊడ్చిపెట్టి వైద్యం చేయించారు. అయినా లాభం లేకపోయింది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చూపించగా.. ఖర్చు లక్షల్లో ఉంటుందని అక్కడి వైద్యులు తెలి పారు. అంతమొత్తం ఆ దంపతులకు శక్తికి మిం చిన భారమైంది. అప్పటి నుంచి పిల్లల పరిస్థితిని చూస్తూ కన్నీరుతోనే కాలం వెల్లదీశారు. ఒకే కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతూ.. మాటలు రాకుండా.. చెవులు వినిపించకుండా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ‘సాక్షి’ సెప్టెంబర్ 11న ‘మాట్లాడాలని ఉంది..’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనికి స్పందించిన మంత్రి ఈటెల రాజేందర్ చిన్నారుల పరిస్థితిని సీఏం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఈనెల 16న సీఏం రిలీఫ్ నుంచి రూ.4లక్షలు మంజూరు చేయించారు. ఒకరికి ఆపరేషన్ చేస్తే రూ.7.50లక్షల వరకు ఖర్చవుతుందని అపోలో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మొదటి విడత ఒకరికి ఆపరేషన్ చేయాలని, మిగిలిన మొత్తాన్ని తాను సమకూర్చుతానని మంత్రి ఈటెల రాజేందర్ ఆసుపత్రికి హామీ ఇచ్చారు. త్వరలోనే పిల్లల్లో ఒకరికి మాట వస్తుందన్న విషయం తెలుసుకున్న ఆ తల్లిదండ్రుల్లో ఆనందం అంతాఇంతాకాదు. త్వరలోనే ఒకరిని అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లి ఆపరేషన్ చేయిస్తామని కుమారస్వామి, రజిత దంపతులు ఆనందంతో చెప్పారు. -
కార్టూనిస్ట్ శేఖర్ పేరిట ఏటా అవార్డులు : ఈటెల
శ్రీనగర్‌కాలనీ, న్యూస్‌లైన్: అనుకున్నది సాధించే వరకు ధైర్యంతో నిరంతరం పోరాడే వ్యక్తిత్వం శేఖర్‌దని మానవతావాదిగా, స్నేహశీలిగా సహోద్యోగులతో ఎంతో అన్యోన్యంగా మెలిగే శేఖర్ మన మధ్య లేకపోవడం విచారకరమని పలువురు ప్రముఖులు అన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఇటీవల అనారోగ్యంతో మరణించిన ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ సంతాప సభ జరిగింది. కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, సీనియర్ కార్టూనిస్ట్ మోహన్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, ప్రజాశక్తి అసిస్టెంట్ ఎడిటర్ తులసీదాస్‌తో పాటు వివిధ పత్రికల్లో పనిచేస్తున్న కార్టూనిస్టులు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఏటా శేఖర్ పేరుపై ప్రముఖ కార్టూనిస్టులకు అవార్డులు అందేలా చూస్తామన్నారు. ఇదే విషయాన్ని ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు ఎన్. రామచందర్ రావు తన సందేశంలో చెప్పారు. ఎంతో ధైర్యంతో, పట్టుదలతో తాను అనుకున్నది సాధించే స్వభావం శేఖర్‌దని కార్టూనిస్టు సుభాని చెప్పారు. కార్టూన్లలో సృజనాత్మకతను, భావాలను వ్యక్త పరచడం, ప్రజల్లో చైతన్యం కలిగించే చిత్రాలను గీయడం శేఖర్ వద్దే నేర్చుకున్నానని మరో కార్టూనిస్టు శంకర్ తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖలు శేఖర్‌తో తమ అనుభవాలను, అనుభూతులను పంచుకున్నారు. కార్యక్రమంలో సమైక్య భారతి ప్రతినిధి సత్యనారాయణ, సీనియర్ జర్నలిస్టు శంకర్ నారాయణ, దేశపతి శ్రీనివాస్, శేఖర్ సతీమణి చంద్రకళ, కుమార్తె చేతన తదితరులు పాల్గొన్నారు.