కార్టూనిస్ట్ శేఖర్ పేరిట ఏటా అవార్డులు : ఈటెల
శ్రీనగర్‌కాలనీ, న్యూస్‌లైన్: అనుకున్నది సాధించే వరకు ధైర్యంతో నిరంతరం పోరాడే వ్యక్తిత్వం శేఖర్‌దని మానవతావాదిగా, స్నేహశీలిగా సహోద్యోగులతో ఎంతో అన్యోన్యంగా మెలిగే శేఖర్ మన మధ్య లేకపోవడం విచారకరమని పలువురు ప్రముఖులు అన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఇటీవల అనారోగ్యంతో మరణించిన ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ సంతాప సభ జరిగింది.
కార్యక్రమానికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, సీనియర్ కార్టూనిస్ట్ మోహన్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, ప్రజాశక్తి అసిస్టెంట్ ఎడిటర్ తులసీదాస్‌తో పాటు వివిధ పత్రికల్లో పనిచేస్తున్న కార్టూనిస్టులు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఏటా శేఖర్ పేరుపై ప్రముఖ కార్టూనిస్టులకు అవార్డులు అందేలా చూస్తామన్నారు.
ఇదే విషయాన్ని ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు ఎన్. రామచందర్ రావు తన సందేశంలో చెప్పారు. ఎంతో ధైర్యంతో, పట్టుదలతో తాను అనుకున్నది సాధించే స్వభావం శేఖర్‌దని కార్టూనిస్టు సుభాని చెప్పారు. కార్టూన్లలో సృజనాత్మకతను, భావాలను వ్యక్త పరచడం, ప్రజల్లో చైతన్యం కలిగించే చిత్రాలను గీయడం శేఖర్ వద్దే నేర్చుకున్నానని మరో కార్టూనిస్టు శంకర్ తెలిపారు.
కార్యక్రమంలో పలువురు ప్రముఖలు శేఖర్‌తో తమ అనుభవాలను, అనుభూతులను పంచుకున్నారు. కార్యక్రమంలో సమైక్య భారతి ప్రతినిధి సత్యనారాయణ, సీనియర్ జర్నలిస్టు శంకర్ నారాయణ, దేశపతి శ్రీనివాస్, శేఖర్ సతీమణి చంద్రకళ, కుమార్తె చేతన తదితరులు పాల్గొన్నారు.