‘మూగ' గొంతులకు ప్రాణం
జమ్మికుంట :
తోటి పిల్లల్లా గలగల మాట్లాడాలని కళలుగన్న ఆ చిన్నారుల ఆశ నెరవేరబోతోంది. పిల్లల గొంతు ఎలా ఉంటుందో విందామన్నా ఆ తల్లిదండ్రుల కోరిక సమీపిస్తోంది. ‘సాక్షి' అందించిన కథనానికి స్పందించిన ప్రభుత్వం ఇన్నాళ్లు మూగబోయిన ఆ గొంతులకు ప్రాణం పోసేం దుకు ముందుకొచ్చింది. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.నాలుగు లక్షలు విడుదల చేస్తూ.. పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలంటూ హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి లేఖ పంపించింది. మిగిలిన ఖర్చులన్నీ తాను భరిస్తానంటూ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ హామీ ఇవ్వడంతో ఆ కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి.
జమ్మికుంట మండలం బూజునూర్‌కు చెందిన కోమాకుల కుమారస్వామి, రజిత దంపతులకు కుమారుడు హేమవంత్, కూతు రు కృష్ణవేణి సంతానం. పిల్లలిద్దరికీ చిన్నప్పుడే గొంతు మూగబోయింది. కళ్లముందే కొడుకు, కూతురు ఇద్దరు తిరుగుతున్నా.. వారి మాట వినే భాగ్యం కలగలేదా దంపతులకు. వారి గొంతుకు ప్రాణం పోసేందుకు ఏడాది కాదు.. రెండేళ్లు కాదు.. పదహారేళ్లు ఉన్నదంతా ఊడ్చిపెట్టి వైద్యం చేయించారు. అయినా లాభం లేకపోయింది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చూపించగా.. ఖర్చు లక్షల్లో ఉంటుందని అక్కడి వైద్యులు తెలి పారు.
అంతమొత్తం ఆ దంపతులకు శక్తికి మిం చిన భారమైంది. అప్పటి నుంచి పిల్లల పరిస్థితిని చూస్తూ కన్నీరుతోనే కాలం వెల్లదీశారు. ఒకే కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతూ.. మాటలు రాకుండా.. చెవులు వినిపించకుండా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ‘సాక్షి’ సెప్టెంబర్ 11న ‘మాట్లాడాలని ఉంది..’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనికి స్పందించిన మంత్రి ఈటెల రాజేందర్ చిన్నారుల పరిస్థితిని సీఏం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఆయన ఈనెల 16న సీఏం రిలీఫ్ నుంచి రూ.4లక్షలు మంజూరు చేయించారు. ఒకరికి ఆపరేషన్ చేస్తే రూ.7.50లక్షల వరకు ఖర్చవుతుందని అపోలో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మొదటి విడత ఒకరికి ఆపరేషన్ చేయాలని, మిగిలిన మొత్తాన్ని తాను సమకూర్చుతానని మంత్రి ఈటెల రాజేందర్ ఆసుపత్రికి హామీ ఇచ్చారు. త్వరలోనే పిల్లల్లో ఒకరికి మాట వస్తుందన్న విషయం తెలుసుకున్న ఆ తల్లిదండ్రుల్లో ఆనందం అంతాఇంతాకాదు. త్వరలోనే ఒకరిని అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లి ఆపరేషన్ చేయిస్తామని కుమారస్వామి, రజిత దంపతులు ఆనందంతో చెప్పారు.