అర్హులందరికీ ఆసరా
సంక్షేమ పథకాలపై అపోహలొద్దని, అర్హులందరికీ ఆసరా అందిస్తామని రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, కె.తారకరామారావు స్పష్టం చేశారు. పెరిగిన పింఛన్ల పంపిణీ(ఆసరా) పథకాన్ని హుజూరాబాద్, మానకొండూర్, జగిత్యాల నియోజకవర్గాల్లో ఈటెల, కరీంనగర్, సిరిసిల్లల్లో కేటీఆర్ ప్రారంభించి మాట్లాడారు. అనర్హుల పింఛన్లు తొలగిస్తామని, అర్హులకు అన్యాయం జరగనివ్వబోమని అన్నారు. ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతమని, వారి మాటలు నమ్మొద్దని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరూ కలిసి రావాలని కోరారు.
కరీంనగర్ :
సంక్షేమ పథకాలపై అపోహలొద్దని, అర్హులందరికీ అందిస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు భరోసా ఇచ్చారు. పెరిగిన పింఛన్ల పంపిణీ(ఆసరా) కార్యక్రమాన్ని నగరంలోని వరలక్ష్మి గార్డెన్‌లో శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో పింఛన్ల పెంపు జరిగిందన్నారు. వృద్ధులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 పింఛన్ ఇస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్నారు.
పింఛన్లపై ప్రతిపక్షాలు ఆరోపణలు మానుకోవాలన్నారు. ఆధార్‌కార్డు లేకున్నా... మరణ ధ్రువీకరణ పత్రం లేకున్నా మూడు నెలల్లోగా సర్పంచ్, ఎంపీటీసీ, కార్యదర్శి నివేదికల ఆధారంగా డెత్ సర్టిఫికెట్లు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు. పింఛన్లు కుదించామనే మాటలు అవాస్తవమని, గతంలో అర్హతలేని వారు పింఛన్లు పొందారని, వాటిని మాత్రమే తొలగిస్తామని పేర్కొన్నారు. అర్హులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదన్నారు. కుటుంబంలో ప్రతీఒక్కరికి ఆరు కిలోల బియ్యం రూపాయికే అందిస్తామని తెలిపారు. మూలమలుపుతో ఉన్న రాజీవ్ రహదారికి రూ.750 కోట్లతో మెరుగులు దిద్దుతామన్నారు.
ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు రాజకీయాలు మానుకుని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని హితవు పలికారు. గత ప్రభుత్వాల హయాంలో నియోజకవర్గంలో 7,100 మందికి మాత్రమే పింఛన్లు అందేవని, తాజాగా మండలంలోనే 8,850 పింఛన్లు మంజూరు చేశామని వెల్లడించారు. నగర రోడ్ల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.46 కోట్లు మంజూరు చేస్తే... మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఒక్క రూపాయి కూడా అభివృద్ధి జరగలేదనడం తగదని మండిపడ్డారు.
జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ.. నవ తెలంగాణ నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. మేయర్ రవీందర్‌సింగ్ మాట్లాడుతూ.. కడుపునిండా అన్నం, కంటి నిండా నిద్ర కల్పించడమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, డెప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, జెడ్పీటీసీ ఎడ్ల శ్రీనివాస్, ఎంపీపీ వాసాల రమేశ్ పాల్గొన్నారు.