ఆర్టీసీలో యూనిఫైడ్‌ టికెటింగ్‌ సొల్యూషన్‌ | Unified ticketing solution in RTC | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో యూనిఫైడ్‌ టికెటింగ్‌ సొల్యూషన్‌

Published Sat, Jan 30 2021 5:35 AM | Last Updated on Sat, Jan 30 2021 8:32 AM

Unified ticketing solution in RTC - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీఎస్‌ఆర్టీసీలో టికెటింగ్‌ విధానంపై వినూత్న ప్రాజెక్టుకు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దీంతో ఆర్టీసీ అధికారులు టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. టికెటింగ్, రిజర్వేషన్, ట్రాకింగ్, ఫిర్యాదులు, డేటా అంతా ఒకే యాప్‌లో రూపొందించేలా ‘యూనిఫైడ్‌ టికెటింగ్‌ సొల్యూషన్‌’ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. దేశంలో ఏ ఆర్టీసీ అమలు చేయని విధంగా ఈ ప్రాజెక్టును ఏపీఎస్‌ఆర్టీసీ చేపట్టనుంది. ప్రస్తుతం టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకోవాలంటే వెబ్‌సైట్‌కు, ట్రాకింగ్, ఫిర్యాదులకు వేర్వేరు వెబ్‌సైట్‌లను ఆశ్రయించాలి. ఇకపై ఒకే యాప్‌లో అన్ని సేవలు లభ్యమయ్యేలా యూనిఫైడ్‌ టికెటింగ్‌ సొల్యూషన్‌ విధానాన్ని అమలు చేస్తారు. ఆర్టీసీ పంపిన డ్రాఫ్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. కేంద్రం ఇప్పుడు ఆమోదముద్ర వేయడంతో ఫిబ్రవరి మొదటి వారంలో టెండర్లు పిలిచి ఎంపికైన కన్సార్షియంకు ప్రాజెక్టును అప్పగిస్తారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం రూ.30 కోట్ల నిధుల్ని అందిస్తోంది. 

పల్లె వెలుగు నుంచి..
పల్లె వెలుగు బస్సుల నుంచి హై ఎండ్‌ టెక్నాలజీ బస్సుల వరకు ఈ విధానం అమలవుతుంది. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లను కలిపి ఈ ప్రాజెక్టు అమలు చేస్తారు. క్లౌడ్‌ బేస్డ్‌ టెక్నాలజీ వినియోగించనున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో 39 శాతం మాత్రమే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ శాతం ఇంకా పెంచేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది.

యూనిఫైడ్‌ టికెటింగ్‌ సొల్యూషన్‌ అంటే?
ఏటా ఆర్టీసీలో రూ.5 వేల కోట్ల విలువైన టికెట్లు అమ్ముడవుతున్నాయి. రోజుకు 30 లక్షల టికెట్లు అమ్ముడవుతున్నట్లు ఆర్టీసీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ టికెట్లను జారీ చేయడానికి ఆర్టీసీకి ఏటా రూ.10 కోట్ల వరకు ఖర్చవుతోంది. టిమ్‌ మిషన్‌లకు రూ.7 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు, పేపర్‌ రోల్స్‌కు రూ.2 కోట్ల వరకు ఖర్చవుతోంది. యూనిఫైడ్‌ టికెటింగ్‌ సొల్యూషన్‌ ప్రాజెక్టులో ఆర్టీసీకి ఎలాంటి ఖర్చు లేకుండా టికెట్ల జారీ మొత్తం కన్సార్షియంకు టెండర్‌ విధానం ద్వారా అప్పగిస్తారు. బ్యాంకు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీ కలిపి కన్సార్షియంగా ఏర్పడి టెండర్లలో పాల్గొనాలి. అన్ని బస్‌ సర్వీసుల్లో టిమ్‌ మిషన్లకు బదులు బ్యాంకు అందించే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ–పోస్‌ మిషన్లలో టికెట్లను జారీ చేస్తారు. టెండర్లలో పాల్గొనే కన్సార్షియంకు టికెట్‌కు ఎన్ని పైసలు కమీషన్‌ అందించాలనే అంశంపై ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఏ ఆర్టీసీ బస్సులో ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయో.. ప్రధాన కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. ప్రస్తుతమున్న విధానం అయితే డిపోకు టిమ్‌ మిషన్‌ తీసుకువచ్చిన తర్వాతే టికెట్ల అమ్మకం వివరాలు తెలుస్తాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement