- ప్రయాణికులకు ఇబ్బంది కలిగించం
- నష్టనివారణ కోసమే ఈ నిర్ణయం
- తెలంగాణ ఉద్యమంతో రూ.21.80 కోట్ల నష్టం
- టోల్ పెంపుతో బీఎంటీసీపై రూ.3.33 కోట్ల భారం
- మంత్రి రామలింగారెడ్డి వెల్లడి
సాక్షి, బెంగళూరు : నష్టాలు తగ్గించుకోవడంలో భాగంగా రోడ్డు రవాణా సంస్థలోని కేఎస్ ఆర్టీసీతో పాటు మిగిలిన మూడు కార్పోరేషన్లలోని బస్సు షెడ్యూల్స్‌ను తగ్గించనున్నామని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. బెంగళూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేఎస్ ఆర్టీసీలో ప్రస్తుతం 7,791 షెడ్యూల్స్ ఉన్నాయని, దశల వారిగా ఎనిమిది శాతం షెడ్యూల్స్‌ను తగ్గించే అవకాశం ఉందన్నారు. దీని వల్ల నిర్వహణ వ్యయం తగ్గి సంస్థ నష్టాలు లేని స్థితికి చేరుకునే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు.
షెడ్యూల్స్ తగ్గించడం వల్ల ప్రజల ప్రయాణానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్త వహిస్తామని భరోసా ఇచ్చారు. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కేఎస్ ఆర్టీసీతో సహా అన్ని విభాగాలు లాభాల్లో ఉండేవంటూ ఆ పార్టీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఆ పార్టీ హయాంలో ఒక్క కేఎస్ ఆర్టీసీ మాత్రమే రూ.1.74 కోట్లు లాభాల్లో ఉండేదన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత షెడ్యూల్స్, ఉద్యోగుల సంఖ్య పెరగడంతో పాటు నిర్వహణ వ్యయం, ఇంధన ధరలు చాలా పెరిగాయన్నారు.
ఇక గత ఏడాది జరిగిన తెలంగాణ బంద్ వల్ల సంస్థకు రూ.21.80 కోట్ల నష్టం (కేఎస్‌ఆర్టీసీ-రూ.10.50 కోట్లు, ఎన్‌ఈకే ఆర్టీసీ-రూ.6.09 కోట్లు, ఎన్‌డబ్ల్యూకే ఆర్టీసీ-రూ.5.21 కోట్లు) వాటిల్లిందన్నారు. అందువల్లే 2013-14 ఏడాదికి నష్టం రావచ్చని భావిస్తున్నామన్నారు. సంస్థ మనగడ సాగించాలనే ఉద్దేశంతో తప్పనిసరి పరిస్థితుల్లో బస్ చార్జీలు పెంచామని ప్రభుత్వ చర్యలను సమర్థించుకున్నారు. దేవనహళ్లి మార్గంలో టోల్ రూపేణా బీఎంటీసీ రోజుకు రూ.38,430 చెల్లిస్తున్నామన్నారు.
టోల్ పెంచడం వల్ల ఈ మొత్తం రూ.1,29,930కు పెరుగుతుందన్నారు. అంటే రోజుకు టోల్ రూపేణ రూ.91,500 ఎక్కువ చెల్లించాల్సి వస్తుందన్నారు. దీంతో ఈ ఒక్క మార్గంలో బీఎంటీసీ గత ఏడాదితో పోలిస్తే ఇకపై రూ.3.33 కోట్లు టోల్ రూపేణా ఎక్కువ చెల్లించాల్సి వస్తుందని వివరించారు. ఇక ఈ మార్గంలో కేఎస్ ఆర్టీసీ ఏడాదికి రూ.2.97 కోట్లు చెల్లించనుందన్నారు. ఈ పెంపు వల్ల టికెట్టు ధరలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచబోమని భరోసా ఇచ్చారు.