KS RTC
-
మీ కుటుంబానికి ఉన్నారా స్నేహితులు?
Rajinikanth Dadasaheb Phalke Award 2021: ‘నా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ నా స్నేహితుడు రాజ్ బహదూర్‌కు అంకితం అన్నాడు నటుడు రజనీ కాంత్. 50 ఏళ్ల నాటి స్నేహం వారిది. ఇవాళ్టికీ రజనీకాంత్ తన స్నేహితుడి ఇంటికి వెళ్లి మంచం మీద స్నేహితుడు పడుకుంటే తాను కింద పడుకుంటాడు. కుటుంబాలు కేవలం తల్లి, తండ్రి, పిల్లలతో మనలేవు. స్నేహితులు కావాలి. గాఢమైన స్నేహాలే బతుకు నావలో సంతోషాన్ని, కష్టం వచ్చినప్పుడు సపోర్ట్నీ ఇస్తాయి. మరి మనకు ఉన్నాయా అంతటి గట్టి స్నేహాలు. మన పిల్లలకు నేర్పిస్తున్నామా ఆ సంస్కారాలు? ‘ఒక మనిషికి అసలైన నష్టం ఏమిటంటే నిజమైన మిత్రుణ్ణి కోల్పోవడమే’ అని సూక్తి. సంపదలు ఎన్ని రకాలైనా ‘స్నేహ సంపద’ వాటిలో ఉంది. స్నేహితుల్ని కోల్పోవడం అంటే సంపదను శాశ్వతంగా కోల్పోవడం. ‘నీ స్నేహితులెవరో చెప్పు... నువ్వెవరో చెప్తా’ అనేది ఎందుకంటే ఆ స్నేహితుల సంఖ్యను, వ్యక్తిత్వాన్ని బట్టి ఒక మనిషి వ్యక్తిత్వాన్ని నిర్థారించవచ్చు. కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటొచ్చు. కాని కళ్లు తడవకుండా, ఆ సమయంలో పక్కనే స్నేహితుడు లేకుండా జీవితాన్ని దాటడం కష్టం. స్నేహ సంబంధాలు నిలబెట్టు కోవడానికి సమయం ఇస్తున్నామా? స్నేహితులను కోల్పోతే మళ్లీ పొందగలమా? ‘ఫ్యామిలీ ఫ్రెండ్స్’ అనే మాట ఉంది. మనకిప్పుడు ఎంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎందరు మన ఇంటికి వచ్చి ఎందరి ఇంటికి మనం వెళ్లగలిగేలా ఉన్నాము. చెక్ చేసుకోవడం తప్పనిసరి. స్నేహంలో ఉండే ఆనందమే బలం. ఆయుష్షు. రజనీకాంత్ మరియు అతడు మొన్న ఢిల్లీలో రజనీకాంత్ తన నట జీవితానికి సంబంధించి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే’ పురస్కారాన్ని తన గురువు కె.బాలచందర్‌తో పాటు స్నేహితుడు రాజ్ బహదూర్‌కు కూడా ఇచ్చాడు. రజనీకాంత్‌కు బెంగళూరులో రాజ బహదూర్ అనే స్నేహితుడు ఉన్నట్టు చాలా మందికి తెలుసు. అయితే ఇప్పుడు మళ్లీ ఆ స్నేహం... స్నేహానికి ఉండే విలువ చర్చకు వచ్చాయి. ‘నాలోని నటుణ్ణి రాజ్ బహదూర్ గుర్తించి నన్ను మద్రాసు వెళ్లి సినిమాల్లో ట్రై చేయమని ప్రోత్సహించాడు’ అని రజనీకాంత్ అన్నాడు. ఒక స్నేహితుడు అన్న మాట, అతని ప్రోత్సాహమే ఇవాళ దేశానికి రజనీకాంత్ వంటి సూపర్‌స్టార్‌ని ఇచ్చింది. అందుకే రజనీకాంత్ ఆ స్నేహం పట్ల కృతజ్ఞతతో... ఆ స్నేహాన్ని నిలబెట్టుకుని ఉన్నాడు. ఎప్పటి స్నేహం? 1970 నాటి సమయం. అప్పుడు రజనీకాంత్ బెంగళూరులో తన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్‌గా ఉన్నాడు. బస్ కండక్టర్‌గా కర్ణాటక ఆర్.టి.సిలో ఉద్యోగంలో చేరాడు. అతని బస్ నంబర్ 10 ఏ. మెజెస్టిక్ నుంచి శ్రీనగర్ స్టాప్ల మధ్య తిరిగేది. దాని డ్రైవర్ రాజ్ బహదూర్. రాజ్ బహదూర్ రజనీ కన్నా ఏడేళ్లు పెద్దవాడు. కాని వారికి స్నేహం కుదిరింది. ‘ఆ సమయంలోనే రజనీకాంత్‌లో మంచి స్టయిల్ ఉండేది. ప్రయాణికులకు చిల్లర ఇవ్వాల్సి వస్తే కాయిన్ ఎగరేసి ఇచ్చేవాడు. ఏ కార్యక్రమాలు జరిగినా స్టేజ్ మీద నాటకం వేసేవాడు. అందరికంటే బాగా నటించేవాడు.’ అని 77 ఏళ్ల రాజ్ బహదూర్ గుర్తు చేసుకున్నాడు. అతను అప్పటి నుంచి ఇప్పటి వరకూ చామరాజ్నగర్లోనే ఉంటున్నాడు. రజనీకాంత్ అప్పట్లో దానికి దగ్గరగా ఉండే హనుమంతనగర్ లో ఉండేవాడు. డ్యూటీ సమయాల్లోనూ డ్యూటీ లేనప్పుడూ ఇద్దరూ కలిసి తిరిగేవారు. స్నేహితుడే దారి రజనీకాంత్‌ను సినిమాల్లో చేరమని రాజ్ బహదూర్ శత పోరు పెట్టాడు. కాని ఉద్యోగాన్ని వదిలి మద్రాసు వెళ్ళడం రజనీకి పెద్ద రిస్క్. నీకెందుకు నేనున్నా అన్నాడు రాజ్ బహదూర్. ఆ రోజు ల్లో రాజ్ బహదూర్ జీతం 400. అందులో 200 రజనీకాంత్‌కు పంపేవాడు. రజనీకాంత్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్న రోజులకు, స్ట్రగుల్ అయిన రోజులకు రాజ్ బహదూర్ పంపిన డబ్బే పెద్ద ఆధారం. ‘ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో కోర్స్ పూర్తయ్యాక ముగింపు ఫంక్షన్‌కు కె.బాలచందర్ చీఫ్ గెస్ట్. ఆ టైమ్‌లో ఆయన రజనీకాంత్‌ని చూసి ‘తమిళం నేర్చుకో’ అని మాత్రం చెప్పి వెళ్లిపోయారు. రజనీ నా దగ్గరకు వచ్చాడు. బాలచందర్ ఈ మాట అన్నాడ్రా అన్నాడు. అంతేకాదు.. ఇవాళ్టి నుంచి నాతో తమిళంలోనే మాట్లాడు అన్నాడు. నేను తమిళం మాట్లాడుతూ తమిళం నేర్చుకోవడంలో సాయం చేశాను’ అన్నాడు రాజ్ బహదూర్. కృష్ణ–కుచేల నిజానికి రజనీకాంత్ ఇప్పుడు కృష్ణుడు. కాని రాజ్ బహదూర్ దగ్గర ఎప్పుడూ కుచేలుడిగానే ఉంటాడు. ఫోన్లు చేయడు. మెసేజ్‌లు పెట్టడు. ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు గుట్టు చప్పుడు కాకుండా రాజ్ బహదూర్ ఇంటికి వచ్చి బెల్లు కొడతాడు. ఆర్టిసిలో రిటైర్ అయ్యి తమ్ముడి కుటుంబంతో సొంత ఇంట్లో జీవిస్తున్న రాజ్ బహదూర్ దగ్గర రజనీ కాంత్ కోసమే ఎప్పుడూ ఒక గది సిద్ధంగా ఉంటుంది. ఆ గదిలో ఒక సింగిల్ కాట్ ఉంటుంది. రాజ్ బహదూర్ దానిమీద రజనీకాంత్ కింద నిద్రపోతారు. రజనీకాంత్ వచ్చాడంటే స్నేహితులిద్దరినీ ఆ గదిలో వదిలి కుటుంబ సభ్యులు ఏమీ ఎరగనట్టుగా ఉండిపోతారు. ఇక రేయింబవళ్లు వాళ్ల కబుర్లు సాగుతాయి. రజనీకాంత్ ఒక్కోసారి రాజ్ బహదూర్ దగ్గర వారం పది రోజులు ఉండిపోతాడు. ఇద్దరూ చీకటి పడ్డాక మామూలు మనుషుల్లా బెంగళూరు రోడ్ల మీద తిరుగుతారు. కొనసాగే బంధం సినిమా రంగంలోని కృత్రిమత్వం నుంచి పారిపోవడానికి రజనీకాంత్ తన స్నేహాన్ని ఒక సాధనం చేసుకున్నాడు. ఒక్క రాజ్ బహదూర్ దగ్గర మాత్రమే రజనీ మామూలు మనిషిలా ఉండగలడు. మనల్ని భ్రమల్లో నుంచి, అహంలో నుంచి బయటపడేలా చేస్తూ ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ మన పిల్లలకు ‘మావయ్యగానో బాబాయిగానో’ ఉంటూ మన కోసం ప్రాణం పెట్టే స్నేహితులు ఉండాలని అనిపిస్తుంది. ఇలాంటి స్నేహాలు పొందడం కష్టం కాదు. కాపాడుకోవడమే కష్టం. అందుకు ప్రయత్నించినవాళ్లే ధన్యులు. -
చెంపలు వాయించింది
కర్ణాటక,మండ్య : మండ్య నగరం నుంచి పాండవపురకు వెళుతున్న కేఎస్ ఆర్టీసీ బస్సులో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకుడి చెంప వాయించింది ఓ యువతి. ప్రస్తుతం ఈ వీడియో కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. మండ్య నగరం నుంచి పాండవపురకు యువతి గురువారం బస్సులో వెళ్తుండగా అదే బస్సులో వెనక సీటులో కూర్చున్న యువకుడు యువతిని తాకడం చేశాడు. ఓపిగ్గా చూసిన యువతి పరిస్థితి శ్రుతి మించడంతో ఒక్కసారిగా ఆగ్రహంతో సదరు యువకుడి చెంప చెల్లున వాయించింది. నీ చెల్లి, తల్లి ఉంటే ఇలాగే చేస్తావా అంటూ అతడిని ప్రశ్నించింది. బస్సులో ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. ఆ వెంటనే యువకుడు బస్సు నుంచి కిందకు దిగి వెళ్లిపోయాడు. -
మృత్యుపిలుపు
♦ కేఎస్ ఆర్టీసీ, సిమెంట్ లారీ ఢీ ♦ బస్సు సీటులోనే ప్రాణం విడిచిన యువకుడు ♦ వారం రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే దారుణం.. ♦ మరో ముగ్గురు ప్రయాణికులకూ గాయాలు బంధు,మిత్రులను స్వయంగా కలిసి శుభలేఖలు అందజేసి తన వివాహానికి ఆహ్వానించాలని బయల్దేరిన యువకుడిని విధి వెక్కిరించింది. రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. బస్సులో కూర్చున్న సీటులోనే ప్రాణం విడిచాడు. పసుపు పూసిన పెళ్లి పత్రికలు కాస్తా రక్తంతో ఎరుపెక్కాయి. కదిరి అర్బన్: కదిరి మండలం ముత్యాలచెరువు సమీపంలో హిందూపురం – కదిరి రహదారిపై సోమవారం ఉదయం కేఎస్ ఆర్టీసీ బస్సు సిమెంటు లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వైఎస్సార్ జిల్లా చిలమకూరుకు చెందిన ప్రేమ్‌నజీర్‌కుమార్ (28) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నుంచి బెంగళూరుకు కేఎస్ ఆర్టీసీ బస్సు బయలుదేరింది. అనంతపురం జిల్లా కదిరి మండలం ముత్యాలచెరువు సమీపంలోకి రాగానే బెంగూళురు నుంచి వస్తున్న సిమెంటు లారీ కేఎస్ ఆర్టీసీ బస్సును వేగంగా ఢీకొంది. బస్సులో వెనుక సీట్లో కూర్చున్న చిలమకూరుకు చెందిన ప్రేమ్‌నజీర్‌కుమార్ ముందుసీటును బలంగా గుద్దుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. వైఎస్సార్‌జిల్లా పులివెందులకు చెందిన చైతన్యరెడ్డి, శకుంతల, వేమలకు చెందిన గంగరాజులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో కదిరి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పెళ్లింట విషాదం.. ప్రేమ్‌నజీర్‌కుమార్ స్వస్థలం వైఎస్సార్‌జిల్లా సింహాద్రిపురం మండలం చౌవారుపల్లి. ఉపాధి నిమిత్తం అదే చిలమకూరులో స్థిరపడ్డాడు. ప్రేమ్‌నజీర్‌కుమార్‌కు పులివెందులకు చెందిన అమ్మాయితో ఈ నెల 16న వివాహం జరగాల్సి ఉంది. పెళ్లిపత్రికలను బంధువులకు ఇచ్చేందుకు బస్సులో బయలుదేరి దుర్మరణం చెందాడు. పెళ్లింట విషాదం నెలకొంది. ట్రైసైకిల్ అదుపుతప్పి దివ్యాంగుడు.. ధర్మవరం రూరల్: ధర్మవరం మండలం రేగాటిపల్లి వద్ద సోమవారం ట్రైసైకిల్ అదుపు తప్పి కనగానపల్లి మండలం చంద్రాశ్చర్ల గ్రామానికి చెందిన దివ్యాంగుడు నాగభూషణం(50) మృతి చెందాడు. పోలీసులు, బంధువుల సమాచారం మేరకు... నాగభూషణం స్వగ్రామం నుంచి ధర్మవరానికి ట్రై సైకిల్లో వస్తుండగా రేగాటిపల్లి వద్ద అదుపు తప్పి బోల్తా పడ్డాడు. ఫెడల్ బలంగా తగలడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ ఎస్ఐ యతీంద్ర ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం
►క్రూజర్ వాహనాన్ని ఢీకొన్న కేఎస్ఆర్టీసీ బస్సు ►మహారాష్ట్రకు చెందిన ఆరుగురు దుర్మరణం సాక్షి, బెంగళూరు : కర్ణాటకలోని బాగల్‌కోట జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురిని బలిగొంది. కేఎస్ ఆర్టీసీ బస్సు... క్రూజర్ వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా, దారపాళ గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వివరాలు.. దారపాళ గ్రామానికి చెందిన 12 మంది వ్యక్తులు కేన్సర్ ఔషధం కోసం క్రూజర్ వాహనంలో గురువారం సాయంత్రం శివమొగ్గకు చేరుకున్నారు. అక్కడ ఔషధం తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. బాగల్‌కోటే జిల్లా బీళగి తాలూకా, కూర్తి క్రాస్ వద్ద ఇవాళ ఉదయం విజయపుర నుంచి హుబ్లీ వెళ్తున్న కేఎస్ ఆర్టీసీ బస్సు క్రూజర్‌ను అతివేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో క్రూజర్‌లో ప్రయాణిస్తున్న నాగేశమాళే, పాండురంగసాళుంకె, విజయాసిందతో పాటు మరో ముగ్గురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ప్రమాద తీవ్రతకు క్రూజర్ వాహనం నుజ్జు నుజ్జు కావడంతో కొన్ని మృతదేహాలు అందులోనే ఇరుక్కుపోయాయి. ప్రమాదం సమయంలో భారీ శబ్ధం రాగా ఏదో జరిగిందని భావించి చుట్టుపక్క గ్రామస్తులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడ నెలకొన్న భీతావహ పరిస్థితి చూసి చలించిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను అతికష్టం మీద బయటికి తీశారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురితోపాటు మృతదేహాలను బీళగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి కారణమైన బస్సులో ఉన్న కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. కేసు దర్యాప్తులో ఉంది. -
షెడ్యూల్స్ తగ్గిస్తాం
ప్రయాణికులకు ఇబ్బంది కలిగించం నష్టనివారణ కోసమే ఈ నిర్ణయం తెలంగాణ ఉద్యమంతో రూ.21.80 కోట్ల నష్టం టోల్ పెంపుతో బీఎంటీసీపై రూ.3.33 కోట్ల భారం మంత్రి రామలింగారెడ్డి వెల్లడి సాక్షి, బెంగళూరు : నష్టాలు తగ్గించుకోవడంలో భాగంగా రోడ్డు రవాణా సంస్థలోని కేఎస్ ఆర్టీసీతో పాటు మిగిలిన మూడు కార్పోరేషన్లలోని బస్సు షెడ్యూల్స్‌ను తగ్గించనున్నామని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. బెంగళూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేఎస్ ఆర్టీసీలో ప్రస్తుతం 7,791 షెడ్యూల్స్ ఉన్నాయని, దశల వారిగా ఎనిమిది శాతం షెడ్యూల్స్‌ను తగ్గించే అవకాశం ఉందన్నారు. దీని వల్ల నిర్వహణ వ్యయం తగ్గి సంస్థ నష్టాలు లేని స్థితికి చేరుకునే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. షెడ్యూల్స్ తగ్గించడం వల్ల ప్రజల ప్రయాణానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్త వహిస్తామని భరోసా ఇచ్చారు. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కేఎస్ ఆర్టీసీతో సహా అన్ని విభాగాలు లాభాల్లో ఉండేవంటూ ఆ పార్టీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఆ పార్టీ హయాంలో ఒక్క కేఎస్ ఆర్టీసీ మాత్రమే రూ.1.74 కోట్లు లాభాల్లో ఉండేదన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత షెడ్యూల్స్, ఉద్యోగుల సంఖ్య పెరగడంతో పాటు నిర్వహణ వ్యయం, ఇంధన ధరలు చాలా పెరిగాయన్నారు. ఇక గత ఏడాది జరిగిన తెలంగాణ బంద్ వల్ల సంస్థకు రూ.21.80 కోట్ల నష్టం (కేఎస్ఆర్టీసీ-రూ.10.50 కోట్లు, ఎన్ఈకే ఆర్టీసీ-రూ.6.09 కోట్లు, ఎన్డబ్ల్యూకే ఆర్టీసీ-రూ.5.21 కోట్లు) వాటిల్లిందన్నారు. అందువల్లే 2013-14 ఏడాదికి నష్టం రావచ్చని భావిస్తున్నామన్నారు. సంస్థ మనగడ సాగించాలనే ఉద్దేశంతో తప్పనిసరి పరిస్థితుల్లో బస్ చార్జీలు పెంచామని ప్రభుత్వ చర్యలను సమర్థించుకున్నారు. దేవనహళ్లి మార్గంలో టోల్ రూపేణా బీఎంటీసీ రోజుకు రూ.38,430 చెల్లిస్తున్నామన్నారు. టోల్ పెంచడం వల్ల ఈ మొత్తం రూ.1,29,930కు పెరుగుతుందన్నారు. అంటే రోజుకు టోల్ రూపేణ రూ.91,500 ఎక్కువ చెల్లించాల్సి వస్తుందన్నారు. దీంతో ఈ ఒక్క మార్గంలో బీఎంటీసీ గత ఏడాదితో పోలిస్తే ఇకపై రూ.3.33 కోట్లు టోల్ రూపేణా ఎక్కువ చెల్లించాల్సి వస్తుందని వివరించారు. ఇక ఈ మార్గంలో కేఎస్ ఆర్టీసీ ఏడాదికి రూ.2.97 కోట్లు చెల్లించనుందన్నారు. ఈ పెంపు వల్ల టికెట్టు ధరలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచబోమని భరోసా ఇచ్చారు. -
బాదేశారు
చార్జీలు పెంచిన కేఎస్ ఆర్టీసీ .. సామాన్యులపైనే వడ్డన అర్ధరాత్రి నుంచే అమల్లోకి ఏడాదికి రూ.123.87 కోట్ల ఆదాయం ‘వోల్వో, రాజహంస’ చార్జీలు యథాతథం సాక్షి, బెంగళూరు : రాష్ర్టంలో బస్సు చార్జీలు మళ్లీ పెంచారు. దీంతో బస్సు ప్రయాణం మరింత భారం కానుంది. కేఎస్ ఆర్టీసీతో పాటు వాయువ్య, ఈశాన్య విభాగాలకు చెందిన బస్సుల్లో టికెట్టు చార్జీలను 7.96 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది. ఆర్డినరీ సర్వీసుల్లో ఈ పెంపు 7.66 శాతంగా ఉంది. ఈ చార్జీల పెరుగుదల శనివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చింది. ఈ పెంపు వోల్వో, రాజహంస సర్వీసులకు వర్తించదు. గత ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం సగటున నెలకు లీటరు డీజిల్‌పై 60 పైసలు పెంచుకుంటూ పోతోందని.. దీని వల్ల ఏడాదికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థపై రూ. 105.05 కోట్ల భారం పడుతోందని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాకుండా జీతభత్యాలు, నిర్వహణ వ్యయం ఏడాదికి రూ.207.82 కోట్లు పెరుగుతోందని అధికారులు పేర్కొంటున్నారు. అందువల్ల సంస్థ మనుగడ కొనసాగించాలనే ఉద్దేశంతో విధిలేని పరిస్థితుల్లో చార్జీలు పెంచుతున్నట్లు కేఎస్ ఆర్టీసీ అధికారులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, తాజాగా టికెట్టు చార్జీలు పెంచడం వల్ల ఏడాదికి రూ.123.87 కోట్ల ఆదాయం రావచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. బీఎంటీసీ చార్జీలు పెంచి బాదేశారు పదిహేను రోజుల కూడా కాకుండానే ప్రభుత్వం కేఎస్ ఆర్టీసీ చార్జీలనూ పెంచింది. దీంతో అటు సిటీ సర్వీసులతో పాటు దూరప్రాంతాల ప్రయాణం కూడా మరింత ‘ప్రియం’ కానుంది. -
బస్సు ఢీకొని యువకుడి దుర్మరణం
బెంగళూరు, న్యూస్‌లైన్: కేఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు దుర్మరణం చెందిన సంఘటన ఇక్కడి మల్లేశ్వరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మంజునాథనగరలో గణేష్ (25) నివాసం ఉంటున్నాడు. వంట మాస్టర్ అయినే గణేశ్, మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో గాయిత్రీ నగర నుంచి ఇంటికి బయలుదేరాడు. మార్గం మధ్యలో మరియప్పనపాళ్యలోని హరిశ్చంద్ర ఘాట్ దగ్గర డివైడర్ దాటుతున్న సమయంలో అటువైపుగా వచ్చినకేఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన గణేష్ అక్కడిక్కడే మృతి చెందాడని, బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు మల్లేశ్వరం ట్రాఫిక్ పోలీసులు తెలిపారు