బాదేశారు
- చార్జీలు పెంచిన కేఎస్ ఆర్టీసీ ..
- సామాన్యులపైనే వడ్డన
- అర్ధరాత్రి నుంచే అమల్లోకి
- ఏడాదికి రూ.123.87 కోట్ల ఆదాయం
- ‘వోల్వో, రాజహంస’ చార్జీలు యథాతథం
సాక్షి, బెంగళూరు : రాష్ర్టంలో బస్సు చార్జీలు మళ్లీ పెంచారు. దీంతో బస్సు ప్రయాణం మరింత భారం కానుంది. కేఎస్ ఆర్టీసీతో పాటు వాయువ్య, ఈశాన్య విభాగాలకు చెందిన బస్సుల్లో టికెట్టు చార్జీలను 7.96 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది. ఆర్డినరీ సర్వీసుల్లో ఈ పెంపు 7.66 శాతంగా ఉంది. ఈ చార్జీల పెరుగుదల శనివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చింది. ఈ పెంపు వోల్వో, రాజహంస సర్వీసులకు వర్తించదు.
గత ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం సగటున నెలకు లీటరు డీజిల్‌పై 60 పైసలు పెంచుకుంటూ పోతోందని.. దీని వల్ల ఏడాదికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థపై రూ. 105.05 కోట్ల భారం పడుతోందని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాకుండా జీతభత్యాలు, నిర్వహణ వ్యయం ఏడాదికి రూ.207.82 కోట్లు పెరుగుతోందని అధికారులు పేర్కొంటున్నారు. అందువల్ల సంస్థ మనుగడ కొనసాగించాలనే ఉద్దేశంతో విధిలేని పరిస్థితుల్లో చార్జీలు పెంచుతున్నట్లు కేఎస్ ఆర్టీసీ అధికారులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, తాజాగా టికెట్టు చార్జీలు పెంచడం వల్ల ఏడాదికి రూ.123.87 కోట్ల ఆదాయం రావచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. బీఎంటీసీ చార్జీలు పెంచి
బాదేశారు
పదిహేను రోజుల కూడా కాకుండానే ప్రభుత్వం కేఎస్ ఆర్టీసీ చార్జీలనూ పెంచింది. దీంతో అటు సిటీ సర్వీసులతో పాటు దూరప్రాంతాల ప్రయాణం కూడా మరింత ‘ప్రియం’ కానుంది.