సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: పండుగ సమయాల్లో సామాన్య, పేద, మధ్య తరగతి ప్రయాణికులకు జగన్ సర్కార్ ఊరటనిచ్చింది. గతంలోలా అదనపు చార్జీల భారం మోపుతూ జేబులు గుల్ల చేయడం లేదు. ఇది వరకు ప్రతి పండుగ సమయంలో, వరుస సెలవులప్పుడు, దాదాపు రద్దీ సమయాల్లో ప్రయాణికుల నుంచి ఏపీఎస్ఆర్టీసీ సాధారణ చార్జీలకు మించి 50 శాతం వరకు అదనంగా వసూలు చేసేది. దూరాన్ని బట్టి సగటున ఒక్కో కుటుంబం రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు అదనంగా చెల్లించి ప్రయాణించాల్సి వచ్చేది.
‘సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేది సామాన్య, పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే. పండుగలు, ఇతర ప్రత్యేక సందర్భాల పేరిట వారి నుంచి అదనంగా టికెట్ వసూలు చేయడం తగదు. ఈ విషయంలో సహేతుక నిర్ణయాలు తీసుకోండి’ అని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచనల మేరకు 3000 సర్వీసుల్లోని 1.40 లక్షల సీట్లకు సంబంధించి అదనపు చార్జీల వసూళ్ల జోలికి వెళ్లడం లేదని ఆర్టీసీ చైర్మన్ ఎ.మల్లిఖార్జునరెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. గతంలో మనుగడ కోసం అంటూ ఆర్టీసీ ఫక్తు వ్యాపార ధోరణిలో కార్యకలాపాలను నిర్వర్తించేది. డిమాండ్ ఆధారంగా రెగ్యులర్ చార్జీలపై 10, 20 శాతం పెంచి వసూలు చేసేది. స్పెషల్ బస్సుల్లో 50 శాతం వరకు వసూలు చేసే వారు.
ఉదాహరణకు హైదరాబాద్ నుంచి విశాఖకు సూపర్ లగ్జరీ బస్సులో నలుగురు సభ్యులున్న ఓ కుటుంబానికి సాధారణ టికెట్ రూ.4,440 అవుతుంది. 50 శాతం పెంపుతో రూ.6,520 అవుతుంది. ఈ లెక్కన అదనపు భారం రూ.2,080. అమరావతి ఏసీ బస్సులో అయితే రూ.3,200 అదనపు భారం పడుతుంది. సీఎం వైఎస్ జగన్ నిర్ణయం వల్ల ఇప్పుడు ఏ బస్సులోనూ ఇలా అదనపు భారం ఉండదు. ఈ నిర్ణయం వల్ల ఆర్టీసీకి రోజుకు రూ.2 కోట్ల అదనపు ఆదాయం ఉండక పోయినా, సీఎం ఆదేశాల మేరకు ప్రజలకు మేలు కలుగుతోందని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు తెలిపారు.
4 టికెట్‌లపై రూ.3,600 మిగులు
గతంలో హైదరాబాద్ నుంచి అమలాపురం రావాలంటే టికెట్ రేట్లు చూసి భయపడేవాళ్లం. ప్రయివేటు ట్రావెల్స్ వారి తరహాలో ఆర్టీసీ కూడా అదనంగా వసూలు చేసేది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఒక టికెట్‌పై రూ.450 వరకు అదనపు భారం లేదు. మా కుటుంబంలో నలుగురికి రానుపోను కలిపి ఇప్పుడు రూ.3,600 అదనపు భారం తప్పినట్లే. ఇది పండుగ ఖర్చుకు కలిసి వచ్చినట్లే.
– కోడూరి సత్య మణికంఠ, ప్రయాణికుడు, అమలాపురం
Comments
Please login to add a commentAdd a comment