బస్సులోనే పడిఉన్న ప్రేమ్‌నజీర్‌కుమార్ మృతదేహం
♦ కేఎస్ ఆర్టీసీ, సిమెంట్ లారీ ఢీ
♦ బస్సు సీటులోనే ప్రాణం విడిచిన యువకుడు
♦ వారం రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే దారుణం..
♦ మరో ముగ్గురు ప్రయాణికులకూ గాయాలు
బంధు,మిత్రులను స్వయంగా కలిసి శుభలేఖలు అందజేసి తన వివాహానికి ఆహ్వానించాలని బయల్దేరిన యువకుడిని విధి వెక్కిరించింది. రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. బస్సులో కూర్చున్న సీటులోనే ప్రాణం విడిచాడు. పసుపు పూసిన పెళ్లి పత్రికలు కాస్తా రక్తంతో ఎరుపెక్కాయి.
కదిరి అర్బన్:
కదిరి మండలం ముత్యాలచెరువు సమీపంలో హిందూపురం – కదిరి రహదారిపై సోమవారం ఉదయం కేఎస్ ఆర్టీసీ బస్సు సిమెంటు లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వైఎస్సార్ జిల్లా చిలమకూరుకు చెందిన ప్రేమ్‌నజీర్‌కుమార్ (28) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నుంచి బెంగళూరుకు కేఎస్ ఆర్టీసీ బస్సు బయలుదేరింది. అనంతపురం జిల్లా కదిరి మండలం ముత్యాలచెరువు సమీపంలోకి రాగానే బెంగూళురు నుంచి వస్తున్న సిమెంటు లారీ కేఎస్ ఆర్టీసీ బస్సును వేగంగా ఢీకొంది.
బస్సులో వెనుక సీట్లో కూర్చున్న చిలమకూరుకు చెందిన ప్రేమ్‌నజీర్‌కుమార్ ముందుసీటును బలంగా గుద్దుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. వైఎస్సార్‌జిల్లా పులివెందులకు చెందిన చైతన్యరెడ్డి, శకుంతల, వేమలకు చెందిన గంగరాజులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో కదిరి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
పెళ్లింట విషాదం..
ప్రేమ్‌నజీర్‌కుమార్ స్వస్థలం వైఎస్సార్‌జిల్లా సింహాద్రిపురం మండలం చౌవారుపల్లి. ఉపాధి నిమిత్తం అదే చిలమకూరులో స్థిరపడ్డాడు. ప్రేమ్‌నజీర్‌కుమార్‌కు పులివెందులకు చెందిన అమ్మాయితో ఈ నెల 16న వివాహం జరగాల్సి ఉంది. పెళ్లిపత్రికలను బంధువులకు ఇచ్చేందుకు బస్సులో బయలుదేరి దుర్మరణం చెందాడు. పెళ్లింట విషాదం నెలకొంది.
ట్రైసైకిల్ అదుపుతప్పి దివ్యాంగుడు..
ధర్మవరం రూరల్: ధర్మవరం మండలం రేగాటిపల్లి వద్ద సోమవారం ట్రైసైకిల్ అదుపు తప్పి కనగానపల్లి మండలం చంద్రాశ్చర్ల గ్రామానికి చెందిన దివ్యాంగుడు నాగభూషణం(50) మృతి చెందాడు. పోలీసులు, బంధువుల సమాచారం మేరకు... నాగభూషణం స్వగ్రామం నుంచి ధర్మవరానికి ట్రై సైకిల్‌లో వస్తుండగా రేగాటిపల్లి వద్ద అదుపు తప్పి బోల్తా పడ్డాడు. ఫెడల్ బలంగా తగలడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ ఎస్‌ఐ యతీంద్ర ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.