గౌహతి : వాహన యజమానులకు రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్‌న్యూస్ చెప్పబోతున్నాయి. వాహన యజమానులు తమ వాహనాన్ని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేసేముందు ఎలాంటి రోడ్డు పన్ను చెల్లించాల్సినవసరం లేకుండా రాష్ట్రాల రవాణా మంత్రుల బృందం ప్రతిపాదనలను రూపొందించింది. అంతేకాక తేలికగా కొత్త రిజిస్ట్రర్ నెంబర్ పొందేలా కూడా మార్గదర్శకాలను తయారుచేసింది. వీటిని ప్రస్తుతం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తేబోతున్నాయి. ఈ ప్రతిపాదనలు రెండేళ్ల కంటే ఎక్కువ కాలం నాటి వాహనాలకు లేదా రెండు రాష్ట్రాల మధ్య పన్ను రేటు 2 శాతం తక్కువగా ఉంటే అమల్లోకి వస్తుంది.
ఈ విషయంపై 12 మంది రవాణా మంత్రుల బృందం గౌహతిలో సమావేశమైంది. ఈ సమావేశంలో వాహనాల బదిలీ, ఆన్‌లైన్‌లోనే ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి డ్రైవింగ్ లైసెన్సును బదిలీ చేయడం వంటి వాటిపై నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో రోడ్డు, రవాణాలో జరుగుతున్న అవినీతిని నిర్మూలించడమే కాకుండా, ప్రజలకు వేధింపులు తగ్గించవచ్చని మంత్రులు నిర్ణయించారు. రవాణా రంగానికి సంబంధించి అన్ని సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. త్వరలోనే రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ అడ్వయిజరీ, రూల్స్‌తో కేంద్ర ప్రభుత్వం ముందుకు రాబోతోంది.
ప్రస్తుతం వాహన రిజిస్ట్రేషన్‌ను, డ్రైవింగ్ లైసెన్స్‌ను బదిలీ చేయడానికి వాహనదారులు ఆర్‌టీఓ నుంచి ఎన్‌ఓసీ తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాతే కొత్త నెంబర్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రక్రియలేమీ అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే ఈ ప్రక్రియలన్నీ ముగించేలా మంత్రుల బృందం మార్గదర్శకాలను తీసుకొచ్చింది. దీనికోసం నేషనల్ ఇన్‌ఫర్మేటిక్స్ సెంటర్ రెండు సెంట్రల్ ఆన్‌లైన్ డేటా బేస్‌లను రూపొందించింది. దానిలో ఒకటి వాహన్-4 దీనిలో వాహన రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేయాలి. రెండు సారథి-4 దీనిలో అంతకముందు రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా లైసెన్స్ తొలగించి, కొత్త దాన్ని జారీచేస్తారు. మంత్రుల బృంద ప్రతిపాదనల మేరకు సెంట్రల్ డేటాబేస్‌లో ప్రతి లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదే.
Comments
Please login to add a commentAdd a comment