
హైదరాబాద్: అసలే చెల్లని డ్రైవింగ్ లైసెన్స్..ఆపై మద్యం తాగి నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఒకరిని బలిగొన్న టిప్పర్ లారీ డ్రైవర్‌ను కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. డ్రైవింగ్ లైసెన్స్ చెల్లకపోయినప్పటికీ అతడికి వాహనం ఇచ్చిన టిప్పర్ యజమానిపై కూడా కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కూకట్‌పల్లి నివాసి ఉప్పర సుంక రామాంజనేయులు (53) భవన నిర్మాణ సూపర్‌వైజర్.
ఈ నెల 14న రాత్రి 10.20 గంటలకు కూకట్‌పల్లి బీజేపీ కార్యాలయం వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ లారీ (ఏపీ29టి157) ఢీకొట్టింది. తీవ్రగాయాలైన రామాంజనేయులను ఆసుపత్రిలో చేర్పించగా చికిత్సపొందుతూ మృతి చెందిన విషయం విదితమే. అయితే ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ గాజులరామారం కైసర్‌నగర్‌కు చెందిన డ్రైవర్ షేక్‌పాషా మద్యం తాగి వాహనం నడిపినట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా చెల్లని డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమైనట్టు తేల్చారు. దీంతో షేక్‌పాషాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. టిప్పర్ యజమాని షేక్ రహీంపై కూడా కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment