Vehicle owners
-
రిపేరు హక్కు ఉద్యమంలో భాగంగా ఏసీఎంఏ..
న్యూఢిల్లీ: వాహనాలను వినియోగదారులు ఎవరిదగ్గరైనా మరమ్మతు చేయించుకునే హక్కును సాధించుకునేందుకు అంతర్జాతీయంగా సాగుతున్న ఉద్యమానికి తాము కూడా మద్దతునిస్తున్నట్లు దేశీ ఆటో విడిభాగాల తయారీ సంస్థల సమాఖ్య ఏసీఎంఏ వెల్లడించింది. వివరాల్లోకి వెడితే.. వైర్లెస్ విధానంలో కనెక్టెడ్‌గా ఉంటున్న వాహనాల డేటా అంతా కూడా వాటి తయారీ సంస్థలకు చేరుతోంది. దీంతో వాటికి ఏమైనా రిపేర్లు వస్తే బైట వేరే వారి దగ్గర మరమ్మతు చేయించుకోనివ్వకుండా కంపెనీలు నిరోధించేందుకు ఆస్కారం ఏర్పడుతోంది. ఫలితంగా వినియోగదారులు తాము కోరుకున్న చోట రిపేరు చేయించుకునే హక్కులకు భంగం కలుగుతోంది. తప్పనిసరిగా కంపెనీనే ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే రిపేర్ హక్కుల ఉద్యమం తెరపైకి వచ్చింది. వారంటీ వ్యవధి ముగిసిపోయిన వాహనాలకు వచ్చే మరమ్మతుల్లో 70 శాతం భాగాన్ని స్వతంత్ర రిపేర్ షాపులే చేస్తున్నాయి. కొనుగోలు అనంతర సేవలకు సంబంధించిన ఆఫ్టర్‌మార్కెట్ విభాగం దేశీయంగా 10.1 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో వినియోగదారులు కోరుకుంటున్న రిపేర్ హక్కులకు మద్దతునిస్తున్న ఇతర అంతర్జాతీయ సంస్థలతో పాటు తామూ సంఘీభావం ప్రకటిస్తున్నట్లు ఏసీఎంఏ తెలిపింది. రైట్ టు రిపేర్ కింద దేశీయంగానూ చట్టం తీసుకొస్తే భారత్‌లో ఆఫ్టర్‌మార్కెట్ విభాగం మరింతగా విస్తరించగలదని పేర్కొంది. అంతర్జాతీయంగా అమెరికాలో ఈ ఉద్యమం మొదలైంది. -
వాహనదారులకు కేంద్రం తీపికబురు
వాహనదారులకు కేంద్రం శుభవార్త అందించింది. డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్, పర్మిట్ గడువును ఈ ఏడాది జూన్ 30 వరకు కేంద్రం పెంచింది. కరోనా పాజిటివ్ కేసుల పెరుగుతున్న కారణంగా వాటిని రెన్యువల్ చేసుకోవడంలో వాహనదారులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కేంద్రం తాజాగా గడువును పొడిగించింది. అంటే గత ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ఎక్స్పైరీ అయిన వాటి గడువు 2021 జూన్ 30 వరకు చెల్లుబాటు కానున్నట్లు పేర్కొంది. గతంలో ఇచ్చిన గడువు ఈ నెల 31తో ముగుస్తుండటంతో తాజాగా గడువు పెంచింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు అడ్వైజరీని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసింది. మోటార్ వెహికిల్ యాక్ట్-1988, సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్-1989 కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటికీ ఈ గడువు పొడిగింపు వర్తిస్తుంది. చదవండి: సూయజ్‌కు అడ్డంగా నౌక.. గంటకు రూ.3వేల కోట్ల నష్టం -
బంకుల్లో నిలువు దోపిడీ.!
నిలువ నీడలేక మాడిపోవాలి. గుక్కెడు నీళ్లు దొరక్క అల్లాడిపోవాలి. భద్రత లేక బంకుల్లో బిక్కుబిక్కుమనాలి. ఇంధనం తక్కువ పోసినా.. చిల్లర దోపిడీ సాగుతున్నా భరించాలి. పెట్రోలు బంకుల్లో కొలతల్లో మోసాలు సాగిపోతున్నాయి. అధికారుల దాడులు అరుదై పోతున్నాయి. ఫలితంగా వినియోగదారుల జేబుకు చిల్లులు పడుతున్నాయి. సాక్షి, విజయనగరం : పెట్రోలు బంకుల్లో కొలతల్లో మోసాలకు అంతులేకపోవటంతో వినియోగదారులు దోపిడీకి గురవుతున్నారు. బంకుల్లో కనీసం తాగునీరు, మరుగుదొడ్లు, నీడ లేకపోయినా అధికారులు పట్టించుకోవటంలేదు. నిర్ణీత మొత్తానికి డిజిటల్ మీటర్లు ఫిక్స్ చేసినా.. ఇంధనం పోసే సమయంలో చేతివాటం చూపుతున్నారు. లీటరుకు కనీసం 25 మిల్లీలీటర్లు నుంచి 100 మిల్లీలీటర్లు వరకు తరుగు వస్తుందని వినియోగదారుల ఆరోపణ. ఇలా ప్రతీ బంకులో రోజూ పదుల లీటర్లలోనే దోపిడీ యథేచ్ఛగా సాగిపోతోంది. మరికొన్ని చోట్ల చిల్లర దోపిడీ జరుగుతోంది. వాహన టైర్లలో గాలి ఒత్తిడి సరిగా లేకపొతే ఇంధనం అధికంగా వినయోగమవుతోంది. ఇంధన వృథాను అరికట్టేందుకు గాలి నింపే యంత్రాలను కచ్చితంగా నెలకొల్పాలి. ఎక్కడా వీటి జాడే లేదు. చాలా చోట్ల స్పీడ్, పవర్ పెట్రోలు అంటూ... లీటరుకు రూ.5 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. కానరాని భద్రత జిల్లా వ్యాప్తంగా 98 పెట్రోలు బంకులున్నాయి. వీటిలో కనీస భద్రత చర్యలు తీసుకోవటం లేదు. బంకుల్లో అలంకార ప్రాయంగా ఇసుక బకెట్లు, అగ్ని నివారణ పరికరాలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల మరుగుదొడ్లు నిర్వహణ ఘోరంగా ఉండటంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. బంకుల్లో సెల్ఫోన్లను నిషేధించినా అమలు కావటంలేదు. సాక్షాత్తు సిబ్బంది ఫోన్లను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. పెట్రోలు కొట్టే సమయంలో మొబైల్ వాడితే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. చెత్త డబ్బాలు సైతం కానరావు. తూకాల్లో తేడాలపై జిల్లా అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
వాహన యజమానులకు గుడ్‌న్యూస్
గౌహతి : వాహన యజమానులకు రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్‌న్యూస్ చెప్పబోతున్నాయి. వాహన యజమానులు తమ వాహనాన్ని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేసేముందు ఎలాంటి రోడ్డు పన్ను చెల్లించాల్సినవసరం లేకుండా రాష్ట్రాల రవాణా మంత్రుల బృందం ప్రతిపాదనలను రూపొందించింది. అంతేకాక తేలికగా కొత్త రిజిస్ట్రర్ నెంబర్ పొందేలా కూడా మార్గదర్శకాలను తయారుచేసింది. వీటిని ప్రస్తుతం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తేబోతున్నాయి. ఈ ప్రతిపాదనలు రెండేళ్ల కంటే ఎక్కువ కాలం నాటి వాహనాలకు లేదా రెండు రాష్ట్రాల మధ్య పన్ను రేటు 2 శాతం తక్కువగా ఉంటే అమల్లోకి వస్తుంది. ఈ విషయంపై 12 మంది రవాణా మంత్రుల బృందం గౌహతిలో సమావేశమైంది. ఈ సమావేశంలో వాహనాల బదిలీ, ఆన్లైన్లోనే ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి డ్రైవింగ్ లైసెన్సును బదిలీ చేయడం వంటి వాటిపై నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో రోడ్డు, రవాణాలో జరుగుతున్న అవినీతిని నిర్మూలించడమే కాకుండా, ప్రజలకు వేధింపులు తగ్గించవచ్చని మంత్రులు నిర్ణయించారు. రవాణా రంగానికి సంబంధించి అన్ని సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. త్వరలోనే రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ అడ్వయిజరీ, రూల్స్‌తో కేంద్ర ప్రభుత్వం ముందుకు రాబోతోంది. ప్రస్తుతం వాహన రిజిస్ట్రేషన్‌ను, డ్రైవింగ్ లైసెన్స్‌ను బదిలీ చేయడానికి వాహనదారులు ఆర్టీఓ నుంచి ఎన్ఓసీ తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాతే కొత్త నెంబర్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రక్రియలేమీ అవసరం లేకుండా ఆన్లైన్లోనే ఈ ప్రక్రియలన్నీ ముగించేలా మంత్రుల బృందం మార్గదర్శకాలను తీసుకొచ్చింది. దీనికోసం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రెండు సెంట్రల్ ఆన్లైన్ డేటా బేస్‌లను రూపొందించింది. దానిలో ఒకటి వాహన్-4 దీనిలో వాహన రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేయాలి. రెండు సారథి-4 దీనిలో అంతకముందు రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా లైసెన్స్ తొలగించి, కొత్త దాన్ని జారీచేస్తారు. మంత్రుల బృంద ప్రతిపాదనల మేరకు సెంట్రల్ డేటాబేస్‌లో ప్రతి లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదే. -
'చిన్న'తప్పే.. పెద్దశిక్ష!
వారికి పట్టుమని పదేళ్లు లేకుంటాయ్.. కానీ బైక్‌ను మాత్రం రయ్.. రయ్‌మని గిరిగిరా తిప్పేస్తుంటారు.. మరోదిక్కు వెనక ఓ తండ్రి తాపీగా కూర్చొని.. తమ పిల్లాడికి బండి ఇచ్చి నడిపిస్తుంటాడు.. ఇలా చిన్న పిల్లలు ద్విచక్రవాహనాలను తీసుకుని ఇష్టానుసారంగా నడిపిస్తూ.. ప్రమాదాలకు కారణమవుతున్నారు. కొన్నిసార్లు వారే ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.. ఫలితంగా కుటుంబాల్లో తీరని విషాదం అలుముకుంటుంది. ఇలాంటి సంఘటనలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెరిగిపోయాయి.. వీటిపై దృష్టిసారించిన పోలీస్ యంత్రాంగం బాలురు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైనా.. పోలీసులకు పట్టుబడినా సంబంధిత బండి యజమానులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారు.. గద్వాల క్రైం: పాలబుగ్గలా పసి మొగ్గలు హద్దులు దాటుతున్నారు. బడిలో పాఠ్యపుస్తకాలతో.. ఆటలతో హుషారుగా చదువుకోవాల్సిన సమయంలో.. ఆకతాయి చేష్టలతో రోడ్లపై ద్విచక్రవాహనాలు నడుపుతూ పాదచారుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నారు. కొన్నిసార్లు తల్లిదండ్రులే స్వయంగా వారి చేతికి వాహనాలు ఇచ్చి రోడ్లపైకి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు ఆకతాయి చేష్టలతో వాహనాన్ని అత్యంత వేగంతో నడిపి దానిని అదుపు చేసే సామర్థ్యం లేక ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీంతో అటు వాహనదారులు, ఇటు పాదచారులు సైతం భయాందోళనకు గురవుతున్నారు. అతి గారాబంతో.. పిల్లలను అదుపు చేయాల్సిన పెద్దలు సైతం వారిపై పెంచుకున్న ప్రేమతో వారిని దండించడంలో వెనకడుగు వేస్తున్నారు. అతిగారాబం చూపుతూ.. పిల్లలు వాహనాలు నడపడం ఓ స్టేటస్ భావిస్తూ.. పిల్లలు చేసే పనులకు అడ్డు చెప్పడం లేదు. మరి కొంతమంది తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్తున్న పిల్లలకు వాహనాలు ఇచ్చి మరీ ప్రోత్సహిస్తున్నారు. పోలీసుల తనిఖీలో మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడిన సందర్భంలో వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇస్తున్నా ఫలితం లేకపోతుంది. గద్వాల జిల్లాకేంద్రంలో ఇప్పటి వరకు 200 మంది బాలురకు పోలీసులు ప్రత్యేక కౌన్సెలింగ్ పోలీసులు ఇచ్చారు. అయినా వారిలో మార్పు కనిపించడం లేదు. ఫలితంగా తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ట్రాఫిక్ వ్యవస్థ కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ వీటిని పూర్తిస్థాయిలో అరికట్టలేకపోతున్నారు. నిబంధనల ప్రకారం.. సాధరణంగా వాహనాలు నడపాలంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. రవాణా శాఖ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి. రోడ్డు నియమ, నిబంధనలు పాటించాలి. కానీ బాలురకు ఇందులో ఏ ఒక్క దానిపైనా అవగాహన ఉండదు. అయినా వాహనాలపై రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్తుంటారు. ప్రత్యేక జిల్లా ఏర్పాటు తర్వాత జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్, ట్రాఫిక్ ఎస్ఐ నింబధనలపై విస్తృత ప్రచారం కల్పిస్తూ జరిమానాలు విధిస్తున్నారు. వివరాలు వెల్లడిస్తున్న పట్టణ ఎస్ఐ ఇదిగో సాక్ష్యం.. గద్వాలలోఆదివారం సాయంత్రం నాగర్‌కర్నూల్ జిల్లా ఈగలపెంటకు చెందిన ఓ బాలుడు(15) గద్వాలకు చెందిన కాపు శ్రీనివాస్‌రెడ్డి ద్విచక్రవాహనాని ఇప్పించుకొని పట్టణంలోని సుంకులమ్మమెట్ ప్రాంతంలో వాయువేగంతో దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో పట్టణానికి చెందిన పబ్బతి లక్ష్మీనారాయణ(60) ఆ దారి వెంట నడుస్తూ వెళ్తుండగా బాలుడు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో లక్ష్మీనారాయణ మృతిచెందాడు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ప్రమాదం చేసింది బాలుడని గుర్తించారు.దీంతో పోలీసులు ప్రమాదానికి కారణమైన బాలుడిని బాల నేరస్థుడిగా గుర్తించి బాలసదన్‌కు తరలించారు. బాలుడికి వాహనం ఇచ్చిన శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు పట్టణ ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. కఠిన చర్యలు.. బాలురు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం. ఎవరైనా అతిక్రమించి ప్రమాదాలకు కారణమైనా, పోలీసులకు చిక్కినా తల్లిదండ్రులు, వాహన యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటాం. పట్టణంలో వీటిపై ప్రత్యేక నిఘా ఉంచాం. ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాల్సిందే. తప్పు చేస్తూ దొరికిపోతే ఎంతవారిపైనైనా కఠిన చర్యలు తప్పవు. -
రవాణాశాఖలో ఆన్లైన్ సేవలకి అవాంతరాలు
సాక్షి, సిటీబ్యూరో: రవాణా శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆటోమేటెడ్ ఆన్లైన్ పౌరసదుపాయాలు తొలిరోజే వాహన దారులకు చుక్కలు చూపించాయి. మంగళవారం స్లాట్ నమోదు చేసుకొన్న వారంతా ఫీజు చెల్లింపుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు కొత్తగా ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ విధానంపై అవగాహన లేక చాలామంది నేరుగా ఆర్టీఏ కార్యాలయాలకు వచ్చి ఉసూరుమంటూ వెనుదిరిగారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 10 ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో అన్ని రకాల రవాణా కార్యకలాపాలకు (ట్రాన్సాక్షన్స్) కలిపి ప్రతి రోజు సుమారు 10 వేల దరఖాస్తులు వస్తుంటాయి. కొత్తగా ప్రవేశపెట్టిన స్లాట్ పద్ధతి వల్ల కేవలం 4 వేల దరఖాస్తులు మాత్రమే ఆన్లైన్ ద్వారా అందాయి. చాలామంది ఆర్టీఏ కార్యాలయాలకు వచ్చి వెనుదిరిగారు. ప్రతి రోజు 150 కొత్త వాహనాలు నమోదయ్యే ఖైరతాబాద్ సెంట్రల్ కార్యాలయంలో కేవలం 20 వాహనాలే నమోదయ్యాయి. ఒక్క లెర్నింగ్ లైసెన్సులు, డ్రైవింగ్ లైసెన్సులు (ఈ రెండింటికి చాలా కాలంగా స్లాట్ బుకింగ్ ఉంది.) మినహా మిగతా 56 రకాల పౌరసదుపాయాలపై ఆన్లైన్ దరఖాస్తులు సగానికి పైగా పడిపోయాయి. నగరంలోని సికింద్రాబాద్, ఉప్పల్, మెహదీపట్నం, మలక్‌పేట్, అత్తాపూర్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, కూకట్పల్లి, చాంద్రాయణగుట్ట, కొండాపూర్ తదితర అన్నిచోట్ల వాహన వినియోగదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ సేవా కేంద్రాల్లో ఇక్కట్లు... హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 1400 ఈ సేవ, మీ సేవ కేంద్రాల్లో ఆన్లైన్ సేవల కోసం స్లాట్ బుకింగ్, ఫీజు చెల్లింపు సదుపాయం ఉన్నట్లు రవాణా అధికారులు స్పష్టం చేశారు. కానీ చాలా చోట్ల స్లాట్ బుకింగ్‌కు మాత్రమే అవకాశం లభించింది. ఫీజు చెల్లింపునకు ఆప్షన్ లేకపోవడంతో స్లాట్ న మోదు చేసుకున్నప్పటికీ ఫీజు చెల్లించలేక ఆర్టీఏ సేవలను పొందలేకపోయారు. దీంతో ఒకటికి రెండు సార్లు ఇటు ఈ సేవా కేంద్రాలకు, అటు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లవలసి వచ్చింది. ఈ సేవ కేంద్రాలకు ఆర్టీఏకు మధ్య సాంకేతిక సమస్యలు తలెత్తాయి. లింకు ఏర్పాటు కాకపోవడం వల్లనే ఫీజు చెల్లింపునకు ఆప్షన్ లేకుండా పోయిందని ఈ సేవా నిర్వాహకులు తెలిపారు. గ్రేటర్ పరిధిలోని కేవలం 50 ఈ సేవా కేంద్రాల్లో మాత్రమే ఫీజు చెల్లింపునకు అవకాశం లభించింది. ఇప్పటి వరకు కేవలం లెర్నింగ్ లైసెన్సులు, డ్రైవింగ్ లైసెన్సులకు మాత్రం స్లాట్లు నమోదయ్యే ఈ సేవా కేంద్రాల్లో ఒక్కసారిగా 58 రకాల సేవలకు సంబంధించి స్లాట్లు నమోదు చేయవలసి రావడంతో పనిభారం పెరిగి గందరగోళం నెలకొంది. నిబంధనల ప్రకారం స్లాట్ నమోదు చేసుకొని, ఫీజు చెల్లించి వచ్చిన వాళ్లలో కొందరు ఆలస్యంగా వచ్చినట్లు భావించిన అధికారులు పలు చోట్ల రూ.25 చొప్పున ఆలస్యపు రుసుము వసూలు చేసినట్లు వినియోగదారులు విస్మయం వ్యక్తం చేశారు. గందరగోళం... మరోవైపు ఆన్లైన్ సేవల అమలులో కొన్ని చోట్ల ఆర్టీఏ ఉద్యోగులకు సైతం సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చాలా చోట్ల ఆర్టీఏ కౌంటర్లు ఖాళీగా కనిపించాయి. ఒకవైపు వినియోగదారులు లేకపోవడం వల్ల మరోవైపు సిబ్బంది గందరగోళం వల్ల కొంతసేపు స్తబ్ధత కనిపించింది. నగరంలోని ప్రధాన కార్యాలయాల్లో సాంకేతిక నిపుణులను ఏర్పాటు చేసినప్పటికీ సమస్యలు తొలగిపోలేదు. దీంతో ప్రాంతీయ రవాణా అధికారులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. తొలిరోజు తలెత్తిన సాంకేతికపరమైన ఆటంకాల వల్ల వాహనాల యాజమాన్య బదిలీలు, డూప్లికేట్ ఆర్సీ, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్, వివిధ రకాల డాక్యుమెంట్ల రెన్యూవల్స్ వంటివన్నీ నిలిచిపోయాయి. -
వాహన యజమానులతో సినీ నిర్మాతల చర్చలు సఫలం
సాక్షి, హైదరాబాద్: సినీరంగ ప్రముఖులు, వాహన యజమానుల మధ్య నెలకొన్న వివాదం సమసిపోయిందని, డిమాండ్‌కు తగ్గట్టుగానే వాహనాలు తీసుకుని అద్దె చెల్లిస్తామని నిర్మాతల మండలి సభ్యుడు డి.సురేశ్‌బాబు స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో వాహన యజమానులు, సినీ పరిశ్రమ ప్రముఖుల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయని నిర్మాత దిల్‌రాజు తెలిపారు. తాను చనిపోయినట్లు దుష్ర్పచారం చేస్తున్న వారిపై నటుడు వేణుమాధవ్ తలసానికి ఫిర్యాదు చేశారు. అనేక వ్యాధుల కారణంగా తాను చనిపోయినట్లు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్న వెబ్సైట్లు, చానెళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
అలాంటోళ్లకు బండిస్తే యజమానికి జైలే!
హైదరాబాద్: ఫ్రెండే కదా.. తెలిసినవాడే కదాని లైసెన్స్ లేకున్నాసరే బండి చేతికిస్తే.. మీ చేతికి సంకెళ్లు, మీకు జైలు తప్పదని హెచ్చరిస్తున్నారు పోలీసులు! లెసెన్స్ లేనివారు డ్రైవింగ్ చేయడమేకాదు, అది లేనివారికి వాహనం ఇవ్వడం కూడా నేరంగానే పరిగణిస్తామని చెబుతున్నారు. టూ, త్రీ, ఫోర్ వీలర్ వాహనాలన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేశారు. నగరంలో లైసెన్స్ లు లేకుండా వాహనాలు నడిపి పట్టుబడ్డ 300 మందికి గోషామహల్ ట్రాఫిక్ శిక్షణా కేంద్రంలో పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎ.వి.రంగనాథ్.. డ్రైవింగ్ లెసైన్సులు లేనివారికి వాహనాలు ఇస్తే డ్రైవర్‌తో పాటు యజమాని కూడా జైలుశిక్ష అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం మూడుసార్లకు మించి పట్టుబడే వాహనదారుల లెసైన్సులు రద్దు చేస్తామన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లు లేని ఆటోడ్రైవర్లు ఈ నెల 15లోగా వాటిని పొందాలని సూచించారు. -
1.. 2.. 3.. ఎంతైనా రెడీ
- ఫ్యాన్సీ నంబర్ల కోసం వాహన యజమానుల మధ్య పోటీ - కాసులు కురిపిస్తున్న నంబర్ల సెంటిమెంట్ - రవాణా శాఖకు ఏటా రూ.20 కోట్ల పైనే ఆదాయం తణుకు : సెంటిమెంట్.. ఒకచోట కూర్చోనివ్వదు. నిలబడనివ్వదు. సామాన్యుడు మొదలుకుని ప్రముఖుల వరకు నిత్యజీవితంలో చాలా విషయాల్లో సెంటిమెంట్‌పై ఆధారపడటం సర్వసాధారణం. ఇదే రవాణా శాఖకు భారీ ఆదాయం తెచ్చిపెడుతోంది. కొందరు సెంటిమెంట్‌తో.. మరికొందరు ఇష్టంతో ప్రత్యేక నంబర్లను తమ వాహనాలకు తగిలించుకునేందుకు ఆరాటపడుతుంటారు. సులభంగా పలికేలా ఉండటంతోపాటు తమకు సెంటిమెంట్‌గా కలిసొచ్చే నంబర్ల కోసం ఎంత సొమ్మయినా వెచ్చించేందుకు పోటీ పడుతున్నారు. రవాణా శాఖ ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని ఫ్యాన్సీ నంబర్లను వేలం వేస్తూ కోట్లాది రూపాయల ఆదాయం పొందుతోంది. ఇది ఎంతగా పెరిగిపోయిందంటే.. ఒక్క మన జిల్లాలోనే ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా రవాణా శాఖకు ఏటా రూ.20 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. అతి తక్కువ వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యే ఒక్క తణుకు యూనిట్ కార్యాలయం పరిధిలోనే 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.75.65 లక్షల ఆదాయం ఫ్యాన్సీ నంబర్ల ద్వారానే సమకూరింది. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.36.18 లక్షల ఆదాయం వచ్చింది. ఈ లెక్కన జిల్లాలో ఏటా ఫ్యాన్సీ నంబర్ల కోసమే రూ. కోట్లు వెచ్చిస్తున్నట్టు తెలుస్తోంది. రూ.లక్ష నుంచి రూ.2 లక్షల పైనే.. రూ.5 లక్షలు పెట్టి వాహనం కొనుగోలు చేస్తే తనకు నచ్చిన నంబర్ కోసం రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదు. ప్రధానంగా 1, 9, 1111, 555, 9999 వంటి నంబర్లు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు వరకు ధర పలుకుతున్నాయి. ఒక నంబర్ కోసం ఒకరికంటే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటే వేలం నిర్వహించి సీల్డ్ టెండర్ ద్వారా అత్యధికంగా బిడ్ వేసిన వారికి నంబర్ కేటాయిస్తున్నారు. ఈ పోటీ ఎంత ఎక్కువగా ఉంటే రవాణా శాఖకు అంత ఆదాయం సమకూరుతోంది. కనీస ధరలు ఇలా : వాహనదారులు తమకు నచ్చిన నంబర్ దక్కించుకోవాలంటే ముందుగా ప్రభుత్వం నిర్దేశించిన రుసుం చెల్లించాలి. నంబర్ల క్రేజ్‌ను బట్టి రూ.వెయ్యి నుంచి రూ.50 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. - 1, 9, 999, 9999 నంబర్లకు రూ.50 వేలు - 99, 333, 555, 666, 777, 888. 2222, 3333, 4444, 5555, 6666, 7777, 8888 నంబర్లకు రూ.30 వేలు - 123, 222, 369, 444, 567, 786, 1111, 1116, 3366, 3456, 4455 నంబర్లకు రూ. 20 వేలు - 3, 5, 6, 7, 111, 234, 306, 405, 789, 818, 909, 1188, 1234, 1314, 1818, 1899,2277, 2772, 2345, 2727, 2799, 3636, 3663, 3699, 4554, 4567, 4599, 5678, 6336, 6633, 6789, 7227, 7722, 8118, 8811, 9009, 9099 నంబర్లకు రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. వీటి కోసం ఎవరి నుంచి పోటీ లేనప్పుడు నిర్ణయించిన ధరకే నంబర్లు ఇచ్చేస్తారు. అలా కాకుండా ఒకే నంబర్‌ను ఎక్కువ మంది కోరుకుంటే వేలం వేసి ఎక్కువ ధర చెల్లించేందుకు ముందుకొచ్చే వారికి కేటాయిస్తారు. ఏరోజుకారోజు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వాహన యజమానులు ఫ్యాన్సీ నంబర్ల కోసం అప్పటికి ఉన్న సిరీస్ ఆధారంగా కరెంట్ రిజర్వేషన్ ద్వారా రూ.వెయ్యి చెల్లించి పొందవచ్చు. నేతల పేరిట పైరవీలు : జిల్లాలో ఏలూరు డెప్యూటీ ట్రాన్స్‌పోర్టు కార్యాలయంతోపాటు భీమవరం ప్రాంతీయ కార్యాలయం, తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, పాలకొల్లులో రవాణా శాఖ కార్యాలయాలు ఉన్నాయి. ఎక్కడికక్కడ వేర్వేరు సిరీస్ నంబర్లు కేటాయిస్తుంటారు. కొత్త సిరీస్ ప్రారంభమైతే పైరవీల హడావుడి మొదలవుతుంది. ఒకరు మంత్రి పేరు చెబితే.. మరొకరు ఎమ్మెల్యే.. ఇంకొకరు ఉన్నతాధికారుల పేర్లు చెప్పి రవాణాశాఖ కార్యాలయాల్లో హంగామా చేస్తుంటారు. ఒకే నంబర్ కోసం ఇద్దరు ప్రముఖులు పోటీ పడితే వారి క్యాడర్‌ను బట్టి అధికారులు మరో వర్గానికి నచ్చజెప్పి రెండో వర్గానికి ఖర్చు పెరగనీయకుండా నంబర్ కేటాయించేందుకు కృషి చేస్తుంటారు. కరెంట్ రిజర్వేషన్ అమలు చేస్తున్నాం సామాన్య, మధ్యతరగతి వాహనదారులకు నంబర్లు అందుబాటులో ఉండేలా కరెంట్ రిజర్వేషన్ అమలు చేస్తున్నాం. ఇది మంచి ఫలితాలు ఇస్తోంది. దీనివల్ల రోజువారీ నంబర్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతోపాటు ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరుతోంది. ఇటీవల కాలంలో రిజిస్ట్రేషన్ చేయించుకునే వాహనదారుల్లో ఎక్కువ శాతం ఫ్యాన్సీ నంబర్లకే మొగ్గు చూపుతున్నారు. - పి.సీతాపతిరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, తణుకు