
నాలుగైదు రోజుల్లో ఆర్టీసీ ‘విభజన’ కసరత్తు పూర్తి
* నివేదికను తొలుత బోర్డుకు సమర్పించనున్న అధికారులు
* నగరంలో ఉన్నట్టుగా సీమాంధ్రలోనూ కల్యాణమండపం, ఆసుపత్రి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఆస్తులు, అప్పులను తెలంగాణ-సీమాంధ్రల మధ్య విభజించే అంశం మరో నాలుగైదు రోజుల్లో కొలిక్కి రానుంది. దీనికి సంబంధించి అధికారులు వారం రోజులుగా వేగంగా కసరత్తు చేస్తున్నారు. బోర్డుకు సమర్పించేందుకు వీలుగా ప్రాథమిక నివేదికను సిద్ధం చేస్తున్నారు. కార్పొరేషన్ ఆస్తులను 58:42 పద్ధతిలో విభజిస్తున్నారు. ప్రస్తుతం కార్పొరేషన్ తీవ్ర నష్టాల్లో ఉన్నందున వాటిని పరిగణనలోకి తీసుకుంటున్నారు.
ఈ నష్టాలు గత 10 నెలలుగా రికార్డు స్థాయికి చేరుకోవటంతో... అదీ గత జనవరిలో మరింత తీవ్రంగా ఉండటంతో ఏప్రిల్ వరకు ఉన్న పరిస్థితిని అధికారులు తాజాగా సిద్ధం చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి అత్యంత విలువైన స్థలాలున్నాయి. వీటి విలువ రూ.65 వేల కోట్ల వరకు ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఏ ప్రాంతంలో ఉన్న స్థలాలు ఆ ప్రాంతానికే దక్కనున్నాయి. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో ఉన్న ఆర్టీసీ కల్యాణ మండ పం, తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రి తరహాలో సీమాంధ్రలో కూడా వాటిని నిర్మించాలని నివేదికలో పొందుపరచనున్నారు. అప్పులు, నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ వాటిని నిర్మించే పరిస్థితిలో లేనందున ప్రభుత్వం అందుకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని అందులో పేర్కొంటున్నారు. 123 డిపోలు, వాటి పరిధిలో ఉన్న పదమూడున్నర వేల బస్సులను ఆయా ప్రాంతాలకే కేటాయిస్తారు.
కొత్తగా జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద కొనే బస్సులను కూడా 58:42 పద్ధతిలో రెండు ప్రాంతాలకు కేటాయించాలని నిర్ణయించారు. ఆయా డిపోల పరిధిలో ప్రస్తుతం 45 వేల డ్రైవర్లు, 42 వేల కండక్టర్లు కలిపి మొత్తం 1.24 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో సీమాంధ్రకు చెందిన వారు 70 వేల మంది ఉన్నారు. ఏ ప్రాంతానికి చెందిన వారిని ఆ ప్రాంతానికే కేటాయిస్తారు. నగరంలోని ప్రధాన కార్యాలయం, రీజియన్ కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారుల పంపిణీ మాత్రం జరగాల్సి ఉంది. ఓ ప్రాంతానికి చెందిన వారు మరో ప్రాంతంలో పనిచేస్తున్న వారి సంఖ్య కేవలం వందల్లోనే ఉండటంతో వీరి పంపిణీ కూడా సవ్యంగానే సాగనుంది. ఈ మొత్తం కసరత్తును మరో మూడునాలుగు రోజుల్లో పూర్తి చేసి ఆర్టీసీ బోర్డు ముందుంచనున్నారు. ఇందులో దీనిపై చర్చించి అవసరమైన మార్పు చేర్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేయనున్నారు.