చిక్కుముడి విప్పే బాధ్యత ‘షీలాభిడే’దే
ఆస్తులు, అప్పుల పంపిణీపై ఆర్టీసీ ఈడీల కమిటీ సమావేశంలో తీర్మానం
దీనిపై త్వరలో బోర్డు సమావేశంలో చ ర్చించాలని నిర్ణయం
రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడే బాధ్యతా కమిటీకే అప్పగింత
హైదరాబాద్: ఆర్టీసీ ఆస్తులు, అప్పులను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంచే విషయం లో నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించే బాధ్యతను షీలాభిడే కమిటీకి అప్పగించాలని ఆర్టీసీ ఈడీల కమిటీలో నిర్ణయించారు. ఆర్టీసీ ఆస్తులపై ఇటీవల ఓ ప్రైవేటు కన్సల్టెన్సీ మూల్యాం కన చేయడాన్ని తెలంగాణ ఉద్యోగులు తీవ్రంగా తప్పు పట్టడం, బస్భవన్ మినహా మిగతా ఆస్తుల్లో ఆంధ్రప్రదేశ్కు వాటా ఇవ్వొద్దని గట్టిగా పట్టుబడుతుండటంతో పంపిణీపై ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. ఇది క్రమంగా పీటముడిగా మారటంతో ఆర్టీసీ విభజనలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ విభజన వ్యవహారాలను పర్యవేక్షిం చేందుకు గతంలో ఏర్పాటు చేసిన ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ల కమిటీతో ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు మంగళవారం భేటీ అయి చర్చించారు.
ఈడీల కమిటీ సహా ప్రతి విభాగంలో అధికారులు, సిబ్బంది, కార్మికులు రెండుగా విడిపోయిన నేపథ్యంలో ఏకాభిప్రాయం వచ్చే అవకాశం కనిపించటం లేదు. ఈ నేపథ్యంలో అంతర్గతంగా చర్చించి ఓ నిర్ణయానికి రావటం సాధ్యం కాదని తేల్చిన అధికారులు ఇక ఆస్తులు, అప్పుల పంపకంలో రెండు రాష్ట్రాలతో చర్చించి సరైన నిర్ణయం తీసుకునే బాధ్యతను షీలాభిడే కమిటీకి అప్పగించాలని తీర్మానించారు.
‘ఈ అంశాలపై బుధవారం మరోసారి భేటీ అయి మినిట్స్ రూపొందించి సభ్యుల సంతకాలు తీసుకుని తదుపరి ఆర్టీసీ బోర్డు సమావేశంలో ఉంచాలి, వాటిపై పాలకమండలి ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తే దానిని కమిటీ ముందుంచి రెండు రాష్ర్ట్ర ప్రభుత్వాల ద్వారా కేంద్రానికి పంపాలి. ఏకాభిప్రాయానికి రాని పక్షంలో రెండు ప్రభుత్వాలతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుని కేంద్రానికి నివేదించే బాధ్యతను షీలాభిడే కమిటీకి అప్పగించాలి’ అని నిర్ణయించారు.
మరోసారి గళం విప్పిన ఈడీ జయరావు..:
ఈ భేటీని కేవలం ఆస్తులు, అప్పుల పంపకంపై చర్చించేందుకే పరిమితం చేసినప్పటికీ సీనియర్ ఈడీ జయరావు మరోసారి ఉద్యోగుల పంపకంలో అప్షన్ అంశాన్ని లేవనెత్తినట్టు తెలిసింది. ఆంధ్రాలో కలసిన పోలవరం ముంపు ప్రాంతానికి చెందిన తనను తెలంగాణ అధికారిగా పరిగణించాలని కోరుతున్న విషయం తెలిసిందే. ఆర్టీసీలో అంతర్గతంగా తన విషయంపై ఏకపక్ష నిర్ణయం తీసుకోకుండా... ప్రభుత్వానికి నివేదించాలనే డిమాండును లేవనెత్తినట్టు తెలిసింది. దీనిపై మరో సమావేశం ఏర్పాటు చేసి చర్చిద్దామని ఎండీ పూర్ణచంద్రరావు ఆయనకు హామీ ఇచ్చినట్టు సమాచారం.