అయ్యో ఆర్టీసీ | special story on RTC | Sakshi
Sakshi News home page

అయ్యో ఆర్టీసీ

Published Fri, Aug 11 2017 2:14 AM | Last Updated on Sun, Sep 17 2017 5:23 PM

అయ్యో ఆర్టీసీ

అయ్యో ఆర్టీసీ

ప్రైవేటుకు బాటలు..సంస్థకు బీటలు
సొంత నియామకాలకు చెల్లుచీటీ..
ఇక అంతా ఔట్‌సోర్సింగే
చివరకు సెక్యూరిటీ బాధ్యతా ‘ప్రైవేటు’కే..
18 శాతం నుంచి 28 శాతానికి
పెరిగిన ‘అద్దె’ బస్సులు
తార్నాక ఆస్పత్రి ఫార్మసీ ప్రైవేటుకు
టైర్‌ రీ ట్రేడింగ్‌ యూనిట్‌కు తాళం..
రేపోమాపో సొంత ప్రింటింగ్‌ ప్రెస్‌ మూత


ఆర్టీసీ.. సగటు ప్రయాణికుడిపైనే తప్ప మరెవరిపై ఆధారపడకుండా ఇన్నాళ్లూ తన మనుగడను సుస్థిరం చేసుకుంటూ సాగిన ఈ సంస్థ ఇప్పుడు క్రమంగా ‘పరాన్న జీవి’గా మారుతోంది! సంస్థ నిండా సొంత కార్మికులు.. అవసరాలను తీర్చుకునేందుకు సొంత అనుబంధ సంస్థలు.. ఈ రాజఠీవీని చరిత్ర పుటల్లోకి తోసి.. ‘ప్రైవేటు’పై ఆధారపడి కుంటి నడకకు సిద్ధమైంది. సొంతంగా సిబ్బందిని సమకూర్చుకోకుండా ప్రైవేటు సంస్థల ద్వారా ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో ఏర్పాటు చేసుకోవటం, సొంత అనుబంధ సంస్థలను మూసేసి సేవలన్నింటినీ ప్రైవేటు సంస్థలకు అప్పగించటం... వెరసి ప్రపంచంలోనే గొప్ప రవాణా సంస్థగా గిన్నిస్‌ రికార్డు సాక్షిగా వెలుగొందిన ఆర్టీసీ ఇప్పుడు ప్రైవేటు చాటున మిణుకుమిణుకుమంటోంది.   

ఐదేళ్లుగా నియామకాల్లేవ్‌
దేశంలో ప్రభుత్వపరంగా ప్రజా రవాణా వ్యవస్థలున్న రాష్ట్రాల్లో మన ఆర్టీసీ(ఉమ్మడి రాష్ట్రం)దే అగ్రస్థానం. లక్షన్నర మంది సిబ్బందితో కళకళలాడేది. రాష్ట్ర విభజన తర్వాత కూడా 57 వేల మందితో ఉనికి చాటుకుంది. కానీ నష్టాల బూచీతో బుగులుపడి నియామకాల విషయంలో వెనుకడుగు వేసింది. దాదాపు ఐదేళ్లుగా నియామకాల్లేవు. దీంతో సిబ్బంది సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఇద్దరి పనిని ఒకరితో చేయించే విధానం రావటంతో మరిన్ని పోస్టులు కాలగర్భంలో కలిసిపోయాయి. కండక్టర్ల నియామకం ఇక చేపట్టొద్దన్న ఆలోచనతో ఉంది. దూరప్రాంతాల సర్వీసుల్లో డ్రైవర్లకే టిమ్‌ యంత్రాలు ఇచ్చి కండక్టర్‌ లేని సర్వీసులు నడుపుతోంది. హైదరాబాద్‌లో కూడా స్మార్ట్‌ కార్డులు, వాటిని గుర్తించే సెన్సార్ల ఏర్పాటుతో కండక్టర్‌ పోస్టులకు మంగళం పాడబోతోంది.
సిబ్బంది సంఖ్య.. 2015 మే: 56,000 ప్రస్తుతం: 53,700

‘హైర్‌’ హవా..
కొత్త బస్సు వేయడమంటేనే భారంగా భావిస్తోంది ఆర్టీసీ. అందుకే హైర్‌(అద్దె) బస్సుల వైపు మొగ్గుచూపుతోంది. ఒకప్పుడు నామమాత్రంగా ఉన్న అద్దె బస్సులు ఇప్పుడు విరివిగా కనిపిస్తున్నాయి. కొత్త రూట్లు గుర్తించి టెండర్లు పిలిచి అద్దె బస్సులను రోడ్లపైకి ఎక్కిస్తోంది. గతంలో మొత్తం బస్సుల సంఖ్యలో 18 శాతానికి మించకుండా అద్దె బస్సులు తీసుకునేవారు. ఇప్పుడు గేట్లు బార్లా తెరిచి దాన్ని 28 శాతానికి పెంచేశారు.
అద్దె బస్సుల సంఖ్య..2015 మే:1,643ప్రస్తుతం:2,184

∙తగ్గుతున్న షెడ్యూళ్లు...
జనాభా పెరిగేకొద్ది వాహనాల సంఖ్య పెరగటం సాధారణం. పదేళ్ల క్రితం రాష్ట్రంలో 28 లక్షల వాహనాలుంటే ఇప్పుడు 77 లక్షలను మించాయి. ఈ సూత్రం ఆర్టీసీ బస్సులకు కూడా వర్తించాలి. కానీ కొంతకాలంగా ఆర్టీసీ బస్సు షెడ్యూళ్ల సంఖ్య తగ్గిపోతోంది. ఏటేటా వాటిని తగ్గించుకుంటూ వస్తోంది. దీంతో ప్రయాణికులు ఇతర రవాణా సాధనాల వైపు మళ్లుతున్నారు.
ఆర్టీసీ బస్‌ షెడ్యూళ్ల సంఖ్య..2015 మే: 8,842 ప్రస్తుతం: 7,822

అంతా ఔట్‌సోర్సింగ్‌
ఆర్టీసీలో ఔట్‌సోర్సింగ్‌ హవా పెరుగుతోంది. కార్మికులు డిమాండ్‌ చేసిన దానికంటే ప్రభుత్వం ఎక్కువ ఫిట్‌మెంట్‌(44 శాతం) ప్రకటించడంతో సంస్థలో కొత్త పోకడ మొదలైంది. భారీగా పెరిగిన జీతాలను భరించటం సంస్థకు ఇబ్బందిగా మారింది. ఉన్న సిబ్బందికి జీతాలిచ్చేందుకే నెలనెలా దిక్కులు చూస్తోంది. ఈ పరిస్థితిలో కొత్త నియామకాల ఊసే ఎత్తడం లేదు. విభాగాల వారీగా పత్రికా ప్రకటన జారీ చేస్తూ ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో ఖాళీలు భర్తీ చేస్తోంది. ఇటీవల సెక్యూరిటీ సిబ్బంది నియామకానికి ఇదే పద్ధతి అనుసరించింది. తాజాగా ఉప్పల్‌ వర్క్‌షాపులోని టైర్‌ రీ ట్రేడింగ్, క్యాంటీన్, డిపో మెయింటెనెన్స్‌ సిబ్బందిని ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన నియమించుకునేందుకు ప్రకటన విడుదల చేసింది.

అనుబంధ సంస్థలకు తాళం
ఆర్టీసీ అనుబంధ సంస్థలు ఒక్కొక్కటిగా ప్రైవేటుపరమవుతున్నాయి. ఇటీవల తార్నాకలోని ఆర్టీసీ ప్రధాన ఆస్పత్రిలో మందుల సరఫరా విభాగాన్ని ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. వరంగల్‌లోని టైర్‌ రీ ట్రేడింగ్‌ యూనిట్‌ను మూసేసింది. కరీంనగర్, ఉప్పల్‌లోని యూనిట్ల ఉత్పత్తి తగ్గించుకుంది. కొద్ది రోజుల్లో అవి కూడా మూతపడతాయన్న వాదన వినిపిస్తోంది. మియాపూర్‌లో ఉన్న సొంత ప్రింటింగ్‌ ప్రెస్‌కు కొద్దిరోజుల్లో తాళం పడబోతోంది. ప్రింటింగ్‌ అవసరాలను ప్రైవేటుకు అప్పగించి సిబ్బంది సంఖ్యను భారీగా కుదించింది. ఇప్పటికే బస్‌ బాడీ తయారీ పనులను ఎక్కువగా ప్రైవేటుకు అప్పగిస్తోంది. వెరసి సొంత యూనిట్‌ను కూడా మూసే అవకాశం ఉందనే సంకేతాలిస్తోంది.
సాక్షి, హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement