సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రైళ్లపైన ‘మహాలక్ష్మి’ ఎఫెక్ట్ పడింది. ప్రతిరోజు కిక్కిరిసి పరుగులు తీసే మెట్రో రైళ్లలో మహిళా ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తరువాత మధ్యతరగతి మహిళలు, ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులు, విద్యారి్థనులు కొంతమేరకు సిటీ బస్సుల్లోకి మారారు. దీంతో గతేడాది 5.10 లక్షలు దాటిన మెట్రో ప్రయాణికులు ప్రస్తుతం 4.8 లక్షల నుంచి 4.9 లక్షల మధ్య నమోదవుతున్నట్లు ఎల్‌అండ్‌టీ అధికావర్గాలు పేర్కొన్నాయి. ఏటేటా ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండగా మహాలక్ష్మి పథకం కారణంగా ఈ ఏడాది మహిళా ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు పేర్కొన్నాయి.
నగరంలోని మూడు ప్రధాన కారిడార్‌లలో మెట్రో రైళ్లు ప్రతి రోజు 1034 ట్రిప్పులు తిరుగుతున్నాయి. రద్దీ ఎక్కువగా ఉన్న నాగోల్–రాయదుర్గం, ఎల్‌బీనగర్–మియాపూర్ రూట్‌లలో ప్రతి 3 నిమిషాలకు ఒకటి చొప్పున మెట్రో అందుబాటులో ఉంది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ రూట్‌లో మాత్రం ప్రయాణికుల ఆదరణ తక్కువగా ఉండడంతో ఈ రూట్లో ప్రతి 15 నిమిషాలకు ఒకటి చొప్పున రైళ్లు నడుస్తున్నాయి. డిసెంబర్ 9వ తేదీ నుంచి మహాలక్ష్మి పథకం అమల్లోకి వచి్చన తరువాత మహిళా ప్రయాణికులు తగ్గారు. ఈ ఏడాదిలో ఆరున్నర లక్షలు దాటవచ్చునని అధికారులు అంచనా వేయగా, అందుకు భిన్నంగా మహాలక్ష్మి కారణంగా సుమారు 5 నుంచి 10 శాతం ప్రయాణికులు తగ్గడం గమనార్హం.
గతేడాది రికార్డు స్థాయిలో రద్దీ...
గత సంవత్సరం జూలై మొదటి వారంలో రికార్డుస్థాయిలో 5.10 లక్షల మంది మెట్రోల్లో ప్రయాణం చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు చరిత్రలో మొట్టమొదటిసారి ప్రయాణికుల సంఖ్య 5 లక్షలు దాటింది. రహదారులపైన వాహనాల రద్దీ, కాలుష్యం తదితర కారణాల దృష్ట్యా నగరవాసులు మెట్రోకు ప్రాధాన్యతనిస్తున్నారు. మరోవైపు వేగంగా, ఎలాంటి ఆటంకాలు లేనివిధంగా పూర్తి ఏసీ సదుపాయంతో ప్రయాణాన్ని అందజేయడంతో కూడా ఇందుకు మరో కారణం. నగరవాసులే కాకుండా పర్యాటకులు, వివిధ పనులపైన హైదరాబాద్‌కు వచ్చిన వాళ్లు సైత మెట్రోల్లోనే ఎక్కువగా పయనిస్తున్నారు. గతేడాది లెక్కల ప్రకారం మియాపూర్–ఎల్‌బీనగర్ కారిడార్‌లో ప్రతిరోజు 2.60 లక్షల మంది పయనించగా, నాగోల్–రాయదుర్గం కారిడార్‌లో 2.25 లక్షల మంది రాకపోకలు సాగించారు.
జూబ్లీస్ బస్‌స్టేషన్ నుంచి మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ వరకు రోజుకు 25,000 మంది ప్రయాణం చేశారు. కానీ మహాలక్ష్మి పథకం కారణంగా ఈ మూడు కారిడార్‌లలో కలిపి 30 వేల మందికి పైగా మహిళలు సిటీబస్సుల్లోకి మారినట్లు అంచనా. ప్రత్యేకంగా ఈ రెండు నెలల్లోనే ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అని ఎల్‌అండ్‌టీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మహాలక్ష్మి పథకంతో పాటు మరికొన్ని అంశాలు కూడా కారణం కావచ్చునన్నారు. మరోవైపు మెట్రోస్టేషన్‌లలో రాయదుర్గం, ఎల్‌బీనగర్, అమీర్‌పేట్, మియాపూర్ స్టేషన్‌ల నుంచి అత్యధిక మంది రాకపోకలు సాగిస్తున్నారు.
వర్క్‌ఫ్రమ్ హోమ్ కూడా...
నగరంలో మెట్రో రైళ్లను ప్రారంభించినప్పటి నుంచి ఐటీ కారిడార్‌లకు రాకపోకలు సాగించే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మెట్రో సేవలను గణనీయంగా వినియోగించుకున్నారు. క్రమంగా విద్యార్థులు, వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు మెట్రో శాశ్వత ప్రయాణికులుగా మారారు. ప్రస్తుతం ప్రతి రోజు 1.40 లక్షల మంది సాఫ్ట్‌వేర్ నిపుణులు, ఐటీ ఉద్యోగులు మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు. కానీ కొన్ని సంస్థలు ఇంకా ‘వర్క్‌ప్రమ్ హోమ్’ను కొనసాగిస్తున్నాయి.
దీంతో చాలా మంది ఇంటి వద్ద నుంచే పని చేస్తున్నారు. ఈ కారణంగా మెట్రోల్లో ప్రయాణం చేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల సంఖ్య ఆశించిన స్థాయిలో లేదని అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి నాటికి సుమారు మెట్రో ప్రయాణికుల సంఖ్య 6.7 లక్షలకు చేరుకోవచ్చునని అంచనాలు వేయగా వివిధ కారణాల వల్ల అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment