సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జీరో టికెట్ జారీ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమవుతోంది. మహిళలకు ఈ నెల 9 మధ్యాహ్నం నుంచి ఉచిత ప్రయాణ వసతి అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నా, వారికి ఎలాంటి టికెట్ జారీ చేయటం లేదు.
అయితే ఈ పథకం వల్ల ఆర్టీసీ నష్టపోయే ఆదాయాన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేయటం ద్వారా సమకూర్చనుంది. అందువల్ల ప్రతినెలా ఎంతమంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు, అందువల్ల ఆర్టీసీ ఎంత ఆదాయాన్ని కోల్పోయింది.. అన్న లెక్కలను ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. టికెట్‌పై చార్జీ సున్నా అని చూపించినా, ఆ మహిళ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణించిందో టికెట్‌లో నమోదవుతుంది.
అంతదూరం ప్రయాణానికి వాస్తవంగా వసూలు చేయాల్సిన టికెట్ మొత్తం కూడా అందులో ఉంటుంది. వాటి ఆధారంగానే ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. ఈ జీరో టికెట్ విధానాన్ని సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంది. ఆ ప్రక్రియ ఇప్పుడు పూర్తి కావటంతో ప్రయోగాత్మకంగా గురువారం కొన్ని డిపోల్లో వీటిని జారీ చేసి పరిశీలించారు. శుక్రవారం నుంచి అన్ని డిపోల పరిధిలో జీరో టికెట్ జారీ చేయనున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
గుర్తింపు కార్డు తప్పనిసరి
తెలంగాణలో నివసించే మహిళలకు మాత్రమే మహాలక్ష్మి పథకం వర్తిస్తుంది. దీంతో శుక్రవారం నుంచి కండక్టర్‌కు మహిళలు కచ్చితంగా తెలంగాణ ప్రాంత నివాసితులుగా ధ్రువపరిచే ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు లేదా నివాస ప్రాంతాన్ని తెలిపే గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. జిరాక్స్ కాపీ చూపించినా సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. అయితే శుక్రవారం ఎవరైనా గుర్తింపు కార్డు మరిచిపోతే, మళ్లీ మరిచిపోవద్దని హెచ్చరించి జీరో టికెట్ జారీ చేయనున్నారు. ఆ తర్వాత మాత్రం అనుమతించరని అధికారులు చెబుతున్నారు.
నిధుల విడుదలపై హర్షం
మహాలక్ష్మి పథకానికి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆర్టీసీకి రూ.374 కోట్లు విడుదల చేయటంపై కార్మిక సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. అలాగే బకాయి ఉన్న ఇతర మొత్తాలను కూడా అందించి ఆర్టీసీని ఆదుకోవాలని ఎన్‌ఎంయూ నేతలు నరేందర్, కమాల్‌రెడ్డి, చెన్నారెడ్డి, ఖదీర్ తదితరులు కోరారు. ఇక ప్రజావాణి మాదిరి ఆర్టీసీ కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు 15 రోజులకోసారి కార్మిక వాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment