
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, మహిళలపై జరుగుతున్న అత్యాచారాల్లో తెలంగాణనే నంబర్‌వన్‌గా నిలుస్తోందని గణాంకాలు చెబుతున్నాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి డోలిశర్మ అన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం లిక్కర్ విక్రయాలు పెంచడం మినహా మరేమీ చేయలేదని విమర్శించారు. కనీసం మహిళల సంక్షేమం కోసం ఒక బోర్డును కూడా ఏర్పాటు చేయలేదని అన్నారు.
శుక్రవారం ఆమె గాందీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ మోడల్ విఫలమయిందని చెప్పిన డోలి శర్మ, కర్ణాటకలో మహిళల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషిచేస్తోందని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో కూడా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ ఇచి్చన హామీలను నిలబెట్టుకుంటున్నామన్నారు. తెలంగాణలో పార్టీ మహిళలకు మహాలక్ష్మి పేరుతో ప్రతి మహిళకు నెలకు రూ.2,500 నగదు, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం లాంటి హామీలనిచ్చిందని, ఈ పథకాల పట్ల మహిళల నుంచి మంచి స్పందన కనిపిస్తోందని, ఈ పథకాలతో కాంగ్రెస్ పార్టీకి మహిళలు పట్టం కట్టడం ఖాయమని చెప్పారు.
టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ జెట్టి కుసుమకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, అధికారంలోకి వచి్చన మొదటి రోజు నుంచే బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆబద్ధాలు ఆడుతూ కాలం వెళ్లదీస్తోందని విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment