సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంశం శుక్రవారం శాసనసభలో అధికార కాంగ్రెస్– ప్రతిపక్ష బీఆర్‌ఎస్ సభ్యుల మధ్య వాదోపవాదాలకు కారణమైంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం ఉదయం చర్చ ప్రారంభమైంది. చర్చను కాంగ్రెస్ సభ్యుడు వేముల వీరేశం ప్రారంభించిన అనంతరం యెన్నం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు.
ఈ ఇద్దరూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరును విమర్శిస్తూ ప్రసంగించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తరుణంలో బీఆర్‌ఎస్ పక్షాన పల్లా రాజేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలతో దుమారం మొదలైంది. ప్రజా పాలన అంటూ ఘనంగా చెప్పుకొని చివరకు 30 మోసాలు, 60 అబద్ధాలు అన్నట్టుగా గవర్నర్ ప్రసంగం సాగిందని ఆయన విమర్శించారు.
ప్రజాభవన్‌లో మంత్రుల జాడెక్కడ.. ఆరు నిమిషాలు కూడా లేని సీఎం
ప్రజాభవన్‌లో స్వయంగా తానే విన్నపాలు వింటానని ముఖ్యమంత్రి పేర్కొన్నా ఇప్పటివరకు ఆరు నిమిషాలకు మించి ఉండలేకపోయారని పల్లా రాజేశ్వరరెడ్డి విమర్శించారు. మంత్రులు ఉంటామన్నా వారి జాడ కూడా లేదని, ఉన్నతాధికారులు వస్తారని చెప్పినా వారూ కనిపించటం లేదని, చివరకు డేటా ఎంట్రీ ఆపరేటర్లు మాత్రమే విన్నపాలు నమోదు చేసుకుంటున్నారన్నారు. కొద్ది రోజుల్లో డ్రాప్ బాక్సులు పెట్టి అభ్యర్థనలను వాటిల్లో వేయమనేలా ఉన్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు. ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ, ఫలితాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
చాలినన్ని బస్సులు లేకుండా మహిళా ప్రయాణికులకు ఇబ్బందులు
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కూడా సరిగ్గా అమలు కావడం లేదనీ, చాలినన్ని బస్సులు, ట్రిప్పులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పల్లా రాజేశ్వరరెడ్డి చెప్పుకొచ్చారు. ఈ పథకంతో ఆటోవాలాలు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇప్పటికే 21 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వారి కుటుంబాలకు రూ.20 లక్షలు చొప్పున ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ తరుణంలో మంత్రి శ్రీధర్‌బాబు కలగజేసుకుని, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణపథకాన్ని బీఆర్‌ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంటే స్పష్టం చేయాలని ప్రశ్నించారు.
పేద ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని, దీనికి బడ్జెట్‌లో నిధులు ప్రతిపాదిస్తామని పునరుద్ఘాటించారు. తాము మహిళలకు ఉచిత ప్రయాణాన్ని వ్యతిరేకించటం లేదని, బస్సుల సంఖ్య పెంచాలనీ, ఆటోడ్రైవర్లకు ప్రతినెలా రూ.10 వేలు చొప్పున సాయం అందించాలని పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
బెంజికార్లు దిగని బీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు ఆటోడ్రైవర్లను రెచ్చగొడుతున్నారు: కాంగ్రెస్
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ అమలు చేయాలని బీఆర్‌ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కలగజేసుకుని, ఆర్టీసీ ఉద్యోగులను నాటి ప్రభుత్వం పట్టించుకోకుండా వారిని గాలికొదిలేసిందని, ఇప్పుడేమో ఆటోడ్రైవర్లను ఆత్మహత్యలవైపు పురిగొల్పుతున్నారని ఆరోపించారు. బెంజ్ కార్లు దిగని ఈ ఫ్యూడల్స్ ఇప్పుడు ఆటోల్లో ప్రయాణిస్తూ వారిని అవమానిస్తున్నారని విమర్శించారు. తమ బంధువైన రిటైర్డ్ ఆర్టీసీ ఈడీని ఆర్టీసీ ఎండీగా నాలుగేళ్లు కొనసాగించి సంస్థను భ్రషు్టపట్టించిన చరిత్ర గత ప్రభుత్వానిదని ఆరోపించారు. పేద మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుండటాన్ని గత పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారని, ఆటోడ్రైవర్లను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొంటున్నారని మరో మంత్రి సీతక్క విమర్శించారు.
కవితపై ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య ఆరోపణలు..
ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, యాదాద్రి అభివృద్ధి పేరిట యాడాను ఏర్పాటు చేసి వందల కోట్ల నిధులను దుర్వీనియోగం చేశారని, సగం నిధులు ఎమ్మెల్సీ కవిత, నాటి మంత్రి జగదీశ్‌రెడ్డికి ముట్టాయని ఆరోపించా రు. దీంతో బీఆర్‌ఎస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెల్‌లోకి వచ్చారు. వారిపై స్పీకర్ ఆగ్ర హం వ్యక్తం చేయటంతో తిరిగి తమ స్థానాల వద్దకు చేరుకున్నారు. సభలో లేని వారి గురించి సభ్యుడు మాట్లాడిన అభ్యంతరకర మాటల్ని రికార్డుల నుంచి తొలగించాలని బీఆర్‌ఎస్ సభ్యుడు ప్రశాంతరెడ్డి కోరగా, పరిశీలించి నిర్ణ యం తీసుకుంటానని స్పీకర్ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment