TS: విద్యార్థినులకు ఎలక్ట్రిక్‌ స్కూటీలు | Congress Promises Electric Scooters For Girl Students In Telangana, Here's All You Need To Know - Sakshi
Sakshi News home page

TS: విద్యార్థినులకు ఎలక్ట్రిక్‌ స్కూటీలు

Published Sun, Dec 24 2023 9:24 AM | Last Updated on Sun, Dec 24 2023 11:41 AM

Congress promises electric scooters for girl students in Telangana - Sakshi

హైదరాబాద్: కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరగానే మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వెసులుబాటు కల్పించింది. కళాశాలల్లో చదువుతున్న విద్యార్థునులకు సైతం బస్సు చార్జీల నుంచి ఆర్థిక వెసులుబాటు లభించింది. మరోవైపు 18 సంవత్సరాలు నిండిన విద్యార్థినులకు ఎలక్ట్రిక్‌ స్కూటీ పథకం వర్తించనుండటంతో వారికి మరింత పెద్దపీట వేస్తునట్లవుతుంది.

దీంతో కాలేజీ విద్యార్థినులకు ‘ఎలక్ట్రిక్‌ స్కూటీ’లపై ఆశలు రేకెతిస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోఇచ్చిన హామీల అమలుకు ఒక్కో అడుగు పడుతుండటంతో ఎలక్ట్రిక్‌ స్కూటీల పథకానికి కూడా అంకురార్పణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికలలోపు పథకాన్ని ప్రారంభించి కొత్త యువ ఓటర్లను ఆకర్షించే వ్యూహంతో కాంగ్రెస్‌ అడుగులు వేస్తుండటంతో ఎలక్ట్రిక్‌ స్కూటీ పథకం కోసం అధికార యంత్రాంగం ముందస్తు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పథకం కోసం మార్గదర్శకాలు రూపకల్పనకు కసరత్తు సాగుతోంది.      

రెగ్యులర్‌ విద్యార్థునులకే.. 
పేద కుటుంబాలకు చెందిన  18 ఏళ్లు నిండి చదువుకునే అమ్మాయిలకు  ఎలక్ట్రిక్‌ స్కూటీలు  పథకం కింద వాహనాలు పంపిణీ జరగనుంది. రెగ్యులర్‌గా కాలేజీలకు వెళ్లే వారికి మాత్రమే పథకం వర్తించేలా కార్యాచరణకు రంగం సిద్ధమవుతోంది. విద్యార్థిని కుటుంబం బీపీఎల్‌గా గుర్తింపునకు కుటుంబ రేషన్‌  కార్డు పరిగణనలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

రెండు లక్షల మందికిపైనే... 
18 ఏళ్లు నిండిన అమ్మాయిలు ఎంతమంది ఉంటారనే దానిపై అధికార యంత్రాంగం గణాంకాలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రం మొత్తం మీద వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో సుమారు 5,279 డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, మెడికల్, వృత్తి, వివిధ మేనేజ్‌మెంట్‌ కాలేజీలు ఉండగా అందులో గ్రేటర్‌ పరిధిలోని  హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో సుమారు 1,784 కాలేజీలు ఉన్నాయి. మొత్తమ్మీద ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి డిగ్రీ, ఇతరత్రా కోర్సులు చదువుతున్న  పేదల విద్యార్థినులు సుమారు 5 లక్షల మంది వరకు ఉండగా.. వీరిలో 2 లక్షల మంది మహానగర పరిధిలో ఉన్నట్లు ప్రాథమిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీరిలో సైతం ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న వారు 70 వేల మంది వరకు ఉండవచ్చని అంచనా. తొలి విడతలో  సర్కారు కాలేజీలో చదువుతున్న విద్యార్థినులకు మాత్రమే ప్రాధాన్యమిచ్చేలా నిబంధనల రూపకల్పన జరుగుతున్నట్లు సమాచారం. 
˘
పెద్ద మొత్తంలోనే ఖర్చు.. 
ఎలక్ట్రిక్‌ స్కూటీల పథకం పెద్ద ఖర్చుతో కూడుకున్నదే. బహిరంగ మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ స్కూటీ సామర్థ్యం బట్టి రూ.40 వేల నుంచి  రూ. 1.5 లక్షకు పైగా పలుకుతోంది. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి సంస్థలకు ఎలక్ట్రిక్‌ టు వీలర్లపై  ఫేమ్‌ (ఫాస్టర్‌ అడాప్షన్‌ ఆఫ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఇన్‌ ఇండియా)–2 పథకం కింద రాయితీ అందిస్తోంది. ఈ పథకం కింద ఒక్కో ఈవీ టు వీలర్‌కు దాని ఎక్స్‌–ఫ్యాక్టరీ ధరలో గరిష్టంగా 40 శాతానికి సమానంగా సబ్సిడీ అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాయితీలకు  అనుగుణంగా  ఈ పథకం అమలు కోసం అధికారులు విధివిధానాలు రూపొందిస్తున్నారు. తొలి విడతలో సర్కారు కాలేజీలో చదువుతున్న విద్యార్థినులకు ప్రాధాన్యమిస్తే సుమారు 70 వేల మంది  వరకు లబ్ధి చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. కనీసం ఒక్క స్కూటీకి సగటున రూ. 50 వేల చొప్పున ధర లెక్కిస్తే సుమారు రూ. 350 కోట్ల ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. సబ్సిడీ లేకుండా మాత్రం లెక్కిస్తే «ఖర్చు రెట్టింపు కావచ్చని అధికారులు అంచనా వెస్తున్నారు. 

లైసెన్సులు కత్తిమీద సామే.. 
ఎలక్ట్రిక్‌ స్కూటీలకు  డ్రైవింగ్‌ లైసెన్స్‌లు తప్పనిసరి కానుంది. లైసెన్స్‌ తీయడం విద్యార్థునులకు కత్తిమీద సామే. చాలా మందికి వాహనం నడపడం వచ్చినప్పటికీ.. డ్రైవింగ్‌ లైసె¯న్సులు లేవు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండానే వాహనాలతో రోడ్లు ఎక్కుతున్నారు.  వారికి రహదారి భద్రత గురించి అవగాహన తక్కువగా ఉండటంతో.. రోడ్డు ప్రమాదాల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.  ఇన్సూరెన్స్‌ వర్తించే అవకాశం సైతం ఉండదు. వాహనాలు నడిపే వారికి  ట్రాఫిక్‌ సిగ్నళ్లు, డ్రైవింగ్‌ నిబంధనలు, రోడ్డు భద్రతా చర్యల గురించి అవగాహన అవసరం. డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం ఆధార్, ఓటర్‌ ఐడీ, బ్యాంక్‌ పాస్‌ బుక్‌ లేదా పాస్‌పోర్ట్, అడ్రస్‌ ప్రూఫ్, టెన్త్‌ మెమో, పాన్‌ కార్డు అవసరం ఉంటుంది. డ్రైవింగ్‌ పరీక్షలో నెగ్గితే ముందుగా లెర్నింగ్‌ లైసెన్స్‌..ఆ తర్వాత పర్మనెంట్‌ లైసెన్స్‌ ఇస్తారు.  

ట్రాఫిక్‌జాం సమస్య మరింత..  
మహా నగరంలో కోటిన్నర జనాభా ఉండగా..  నిత్యం 70 లక్షల వాహనాలు రోడ్డెక్కుతుంటాయి. అందులో ద్విచక్ర వాహనాలు 40 లక్షల వరకు ఉన్నాయి. ప్రధాన రోడ్లన్నీ  ట్రాఫిక్‌తో కిటకిటలాడుతున్నాయి. ఇక స్కూల్స్, కాలేజీ సమయంలో వాహనాలు ముందుకు కదలని పరిస్థితి. ఇక విద్యార్థినులకు  ఎల్రక్టానిక్‌ స్కూటర్లు అందుబాటులో వస్తే మరింత ట్రాఫిక్‌ పెరిగే అవకాశముంది. 

ఇంజినీరింగ్‌ విద్యార్థులే అధికం.. 
18 సంవత్సరాలకు పైబడిన వారు అంటే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని డిగ్రీ, పీజీ, ఇతర మేనేజ్‌మెంట్‌ కోర్సులు, ఇంజినీరింగ్‌ విద్యార్థులే ఉంటారు. మహానగర  పరిధిలో డిగ్రీ, పీజీ, వివిధ మేనేజ్‌మెంట్, వృత్తి కోర్సులు అభ్యసిస్తున్న వారికంటే ఇంజినీరింగ్‌ విద్య అభ్యసిస్తున్న విద్యారి్థనులే అధికం. అందులో సైతం ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థినులు అధికంగా ఉన్నారు. ఎలక్ట్రిక్‌ స్కూటీ పథకం కింద కేవలం సర్కారు కాలేజీ విద్యార్థినులకు ప్రాధాన్యమిస్తే ప్రైవేటు ఇంజినీరింగ్‌ విద్యారి్థనులు అర్హత కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. 

కొత్త ఓటర్లు 4.5 లక్షలపైనే.. 
గ్రేటర్‌ పరిధిలో సుమారు 1.08 కోట్ల వరకు ఓటర్లు ఉండగా అందులో 18 సంవత్సరాలు నిండిన నమోదైన కొత్త ఓటర్లు 4.5 లక్షల మంది ఉన్నారు. వీరిలో మహిళలు 3 లక్షల మంది వరకు ఉండగా.. అందులో కాలేజీ చదువుతున్న విద్యార్థినులు 2 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. కాంగ్రెస్‌ ఎన్నికల హామీలో ఎలక్ట్రిక్‌ స్కూటీ పథకం ప్రకటించడంతో కొత్తగా ఓటు హక్కు వినియోగించుకున్న విద్యార్థులనుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. 

విద్యార్థునులకు ఎంతో ఉపయోగం  
ఉచిత ఎలక్ట్రికల్‌ వెహికల్‌ విద్యారి్థనులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పేద విద్యార్థులకు రోజువారీ రవాణా ఖర్చు ఇబ్బందులు తప్పుతాయి.  పెట్రోల్‌ ఖర్చు ఉండనందున ఇంటి అవసరాలకు సైతం బైక్‌ను వాడుకోవచ్చు.  
– టి.శ్వేత–హబ్సిగూడ 

సంక్రాంతి వరకు అందజేయాలి  
ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన విధంగా  ఎలక్ట్రికల్‌ స్కూటీలు అందించాలి. విద్యార్థినుల సమయం ఆదా అవుతుంది. ఎలాంటి ఖర్చు లేకుండా అనుకున్న గమ్యానికి త్వరగా చేరుకోవచ్చు. సంక్రాంతి వరకు బైకులను పంపిణీ చేయాలి 
– పుష్ప–ఓయూ పీజీ విద్యార్థాని

కాంగ్రెస్‌ మాట నిలబెట్టుకోవాలి.. 
అమ్మాయిలకు స్కూటీ రక్షణగా ఉంటుంది. ఏ సమయంలోనైనా బయటికి వెళ్లి రావచ్చు. ఎలక్ట్రికల్‌ స్కూటీలు పంపిణీ చేసి కాంగ్రెస్‌ మాట 
దనిలబెట్టుకోవాలి.     – షేక్‌ తబ్‌సుమ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement