ఆదిలాబాద్: జిల్లాలో ప్రజా పాలన కార్యక్రమ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి జనవరి 6వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈమేరకు కలెక్టరేట్‌లో నాలుగు జిల్లాల ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులతో ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క బుధవారం సమీక్ష నిర్వహించారు.
కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని వారికి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమాన్ని జైనథ్ మండలం జామిని గ్రామంలో అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇందులో మంత్రి సీతక్కతో పాటు జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్‌ల అమలుకు సంబంధించి స్వీకరించనున్న నిర్ణీత ప్రొఫార్మాతో కూడిన దరఖాస్తులు జిల్లాకు చేరగా వాటిని పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ సిబ్బందికి అందజేశారు.
సర్వం సిద్ధం!
జిల్లాలోని 468 గ్రామ పంచాయతీలు, ఏకైక ఆదిలాబాద్ మున్సిపాలిటీలో నేటి నుంచి జనవరి 6వరకు గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నారు. ఇందు కోసం గ్రామాలు, వార్డుల వారీగా ఇప్పటికే తహసీల్దార్, ఎంపీడీవో, ఎంపీవోల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను నియమించారు. అలాగే ఏ వార్డు, ఏ గ్రామంలో ఎప్పుడు సభ నిర్వహించాలనే దానిపై ఇప్పటికే ప్రత్యేక షెడ్యూలును రూపకల్పన చేసిన అధికారులు వాటి వివరాలను పంచాయతీ కార్యదర్శులు, వార్డు ప్రత్యేకాధికారులకు అందజేశారు.
ఆ షెడ్యూలు ప్రకారం సంక్షేమ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వంద మంది కుటుంబాలకు ఒకటి చొప్పున కౌంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. పంచాయతీ కారోబార్, ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్‌ను గ్రామ పంచాయతీల్లో, అలాగే ము న్సిపల్, మెప్మా సిబ్బందిని మున్సిపల్ పరిధిలో దరఖాస్తుల స్వీకరణ కోసం నియమించారు. అప్లికేషన్లు అందజేసేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా షామియానాలు, కుర్చీల ఏర్పాటుతో పాటు తాగునీటి వసతి కల్పించనున్నారు.
అధికారికంగా దరఖాస్తు ప్రతుల అందజేత..
కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలైన మహాలక్ష్మి రూ.2500 ఆర్థికసాయం, రూ.500 గ్యాస్ సిలిండర్, రైతు భరోసా కింద ఎకరానికి రూ.15వేలు, కౌలు రైతులకు రూ.12వేలు, ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, చేయూత ద్వారా వివిధ కేటగిరీల వారికి పింఛన్ వంటివి ఇందులో ఉన్నాయి. లబ్ధిదారుల ఎంపికలో భాగంగా నిర్ణీత ప్రొఫార్మాతో కూడిన దరఖాస్తులు ప్రభుత్వం నుంచే జిల్లాకు చేరాయి. డీఆర్‌డీఏ కార్యాలయానికి చేరిన వీటిని బుధవారం ఎంపీడీవోల ద్వారా అన్ని పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ సిబ్బందికి పంపిణీ చేశారు.
వారి పరిధిలోని అర్హులైన వారికి వీటిని అందజేయనున్నారు. తమకు ఏ పథకాలు అవసరమని భావిస్తారో వాటి వివరాలను అర్హులైన వారు పూర్తి చేయాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తుకు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు ఒక ఫొటోను జత చేసి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో అందజేస్తే అక్కడి సిబ్బంది వాటిని స్వీకరించి వారికి రశీదులు అందజేస్తారు. అనంతరం రోజువారీగా అందిన దరఖాస్తులను ఏ రోజుకారోజు పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది ఆన్‌లైన్ చేయడంతో పాటు ఉన్నతాధికారులకు అందజేయనున్నారు.
మున్సిపల్ పరిధిలో రణదీవేనగర్‌లో షురూ..!
ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని రణదీవేనగర్ కాలనీలోని సవారీబంగ్లా వద్ద గురువారం ప్రారంభించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఏ.శైలజ తెలిపారు. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పే ర్కొన్నారు. ఉదయం 8గంటలకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని ఆమె సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment