సారూ..! మా గ్రామాల‌కు 'మహాలక్ష్మి' కరుణించేదెలా? | - | Sakshi
Sakshi News home page

సారూ..! మా గ్రామాల‌కు 'మహాలక్ష్మి' కరుణించేదెలా?

Published Mon, Dec 11 2023 12:00 AM | Last Updated on Mon, Dec 11 2023 1:05 PM

- - Sakshi

ఆదిలాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రజా రవాణా వ్యవస్థను మహిళలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకం చాలామందికి చేరడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ కలిపి మొత్తం 487 సర్వీసులున్నాయి.

రోజుకు సుమారు లక్ష యాభై వేల మంది మహిళా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలోని ఎన్నో మారుమూల గ్రామాలకు నేటికీ బస్సు సౌకర్యం లేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన దుస్థితి. దీంతో వారిపై రవాణా భారం పడుతుంది. ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్య పథకాన్ని ప్రవేశపెట్టినప్పటికీ ఎంతోమంది అతివలు ఈ అదృష్టానికి నోచుకోవడం లేదు.

కారణాలు అనేకం..
ఆదాయం సరిగా రావడం లేదని ఉద్దేశంతో జిల్లాలోని పలు గ్రామాలకు ఆర్టీసీ బస్సులను నడపడం మానేసింది. కరోనా మహమ్మారి అనంతరం పెద్ద సంఖ్యలో పల్లెలకు బస్సులను నిలిపివేసిన ఆర్టీసీ..తిరిగి ఆయా రూట్లలో పునరుద్ధరించడంలో వెనకడుగు వేసింది. ఆదాయం సరిగా రావడం లేదని, రహదారి సౌకర్యం సరిగా లేదనే కారణాలతో బస్సులను పూర్తిస్థాయిలో నిలిపేయడం వలన పల్లె ప్రజానీకానికి ప్రజా రవాణా వ్యవస్థ దూరమవుతోంది.

మండల, జిల్లా కేంద్రాలకు నిత్యం రాకపోకలు సాగించే మహిళలే పల్లె వెలుగు బస్సుల్లో అధికంగా ప్రయాణిస్తుంటారు. వారు బస్సు సౌకర్యం లేక ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన నేపథ్యంలో అన్ని రూట్లకు బస్సులను నడిపితే పెద్ద సంఖ్యలో మహిళలకు ఈ పథకం లబ్ధి చేకూరుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆర్టీసీ బస్సు వెళ్లని గ్రామాలెన్నో..
► జిల్లాలోని 18 మండలాల్లో 556 గ్రామాలు ఉండగా, వీటిలో ఆర్టీసీ బస్సు వెళ్లని గ్రామాలు ఎన్నో ఉన్నాయి.
► సిరికొండ మండల కేంద్రానికే బస్సు లేకపోవడం గమనార్హం. అలాగే మండల పరిధిలో ఉన్న 52 గ్రామాలకు ఆర్టీసీ సౌకర్యం లేదు. ముఖ్యంగా విద్యార్థుల కోసం ఉదయం, సాయంత్రం సమయంలో బస్సులను ప్రత్యేకంగా నడిపేవారు. ప్రస్తుతం వాటిని నిలిపివేయడంతో ఆయా గ్రామాలవాసులు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.
► ఇచ్చోడ మండలంలో 32 గ్రామాలు ఉండగా ఒక్క గ్రామానికి కూడా బస్సు వెళ్లని పరిస్థితి.
► బజార్‌హత్నూర్‌ మండలంలోని 64 గ్రామాలు ఉండగా ఇందులో 54 బస్సు సౌకర్యానికి దూరంగా ఉంటున్నాయి.

► తాంసి మండలంలోని తాంసి మండల కేంద్రం, గిరిగాం, అంబుగాం, అట్నం గూడా, భీంపూర్‌ మండలంలోని గొల్లఘాట్‌, గుబిడిపల్లి, గుంజాల గ్రామాలకు, జైనథ్‌ మండలంలోని మాకోడ,పిప్పల్‌ గావ్‌ గ్రామాలకు బస్సు సదుపాయం అందుబాటులో లేదు.

► నేరడిగొండ మండల కేంద్రం నుంచి గతంలో బొందిడి గ్రామం వరకూ ఓ సర్వీస్‌ నడిపేవారు. ప్రస్తుతం దానిని నిలిపివేయడంతో అటువైపుగా ఉన్న వడూరు, బొందిడి, భవా ని తండా, గంభీర్‌ తండా, దర్బా, దర్బాతండా సుర్దాపూర్‌, రేంగన్‌వాడి గ్రామాలకు వెళ్లే వారికి ప్రైవేట్‌ వాహనాలే దిక్కువుతున్నాయి.
► బేల మండలంలోని బాధి, హేటి, దేవో జిగూడ, భవానిగూడ, రాయిపూర్‌ తండా, దుబ్బగూడా వంటి పల్లెలకు బస్సు సౌకర్యం లేదు. అలాగే ఉట్నూరు, నార్నూరు, ఇంద్రవెల్లి, గాదిగూడ, తలమడుగు, బోథ్‌ మండలాల్లోనూ ఎన్నో గ్రామాల జనం ప్రజా రవాణా వ్యవస్థకు దూరమవుతున్నారు.

బస్సు సౌకర్యం కల్పించాలి!
సిరికొండలోని మండల పరిషత్‌ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వర్తిస్తున్నాను. బస్సు సౌకర్యం లేక నేను ఇచ్చోడ నుంచి సిరికొండకు ప్రైవేట్‌ వాహనాల్లో రావాల్సి వస్తుంది. సమయానికి వాహనాలు లేక అప్పుడప్పుడు ఆలస్యమవుతుంది. ఇప్పటికై నా మండలానికి బస్సు సౌకర్యం కల్పించాలి. – ఉష, ఉపాధ్యాయురాలు, సిరికొండ

మహాలక్ష్మి వర్తించట్లే..!
మా గ్రామాలకు బస్సే రానప్పుడు మహాలక్ష్మి పథకం ఎట్ల వర్తిస్తది. పథకంతోని పైసలు లేకుండా ఎంత దూరమైనా పోవచ్చని చెప్తున్నరు. ఇట్లాంటి పథకం పెట్టినట్టు చాలామంది మహిళలకు తెల్వది. ఈ పథకం గురించి అందరికీ చెప్పుడే కాకుండా దీన్ని వాడుకునేలా ప్రచారం చేయాలి. – సంగీత, గిరిజాయి, బజార్‌హత్నూర్‌

బస్సు నడిపిస్తే మంచిగుంటది..
అప్పట్లో మా ఊరు సైడు బస్సు నడిచేది. ఇప్పుడు బంద్‌ అయింది. అప్పటినుంచి ఆటోలల్లనే నేరడిగొండకు పోతున్నం. ఇప్పుడు ఫ్రీగా బస్సులో పోవచ్చని చెబుతున్నరు. సార్లు మళ్లా మా ఊరికి బస్సు నడిపేట్లు చూస్తే మంచిగుంటది. – ఆడే పారు బాయి, రెంగన్వాడి, నేరడిగొండ

అప్పుడే ఫాయిదా..!
మా ఊరుకు సక్కగా రోడ్డు గాని బస్సు సౌకర్యం గాని లేదు. అసలు మాకు బస్సు ఫ్రీ చాలు అయిందనే విషయమే తెలవదు. ఫ్రీగా బస్సు ఎక్కాలంటే మా ఊరు నుంచి ఆటో ఎక్కి సోన్‌ కాస్‌ గ్రామం లేకపోతే బేల వరకు పో వాల్సి వస్తది. అక్కడ నుంచి వేరే దగ్గరికి పో వాలనుకుంటే ఫ్రీ బస్సు ఫాయిదా అవుతది. – తులబాయి, రాయ్‌పూర్‌ తండా, బేల
ఇవి చ‌ద‌వండి: ఎంపీ సీటుపై ‘బండి’ ఫోకస్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement