గణనీయంగా మారిన ఆర్థిక గణాంకాలు
2014–15లో రెవెన్యూ ఖర్చు రూ.62,306 కోట్లు.. 2024–25లో రూ.2.01 లక్షల కోట్లు
రూ.50 వేల కోట్ల నుంచి లక్ష కోట్లు దాటిన సొంత పన్నుల ఆదాయం
అప్పుడు రూ.72,658 కోట్ల అప్పులు.. ఇప్పుడు రూ.5 లక్షల కోట్లకు పైనే..
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల క్రితం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి మిగులు బడ్జెట్‌తో విడిపోయింది. 2014–15 ఆర్థిక సంవత్సరానికి గాను అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో రాష్ట్ర ఖజానా ప్రారంభ నిల్వ రూ.2,544 కోట్లుగా చూపెట్టారు. ఆ ఏడాది అసెంబ్లీ అనుమతి పొందిన మొత్తం బడ్జెట్ రూ.1.06 లక్షల కోట్లు. లక్ష కోట్ల నుంచి అంచెలంచెలుగా పెరిగిన తెలంగాణ బడ్జెట్ పరిమాణం ఇప్పుడు రూ.2.75 లక్షల కోట్లకు చేరుకుంది.
అంటే బడ్జెట్ ప్రతిపాదనలు దాదాపుగా మూడు రెట్లు పెరిగాయన్న మాట. ప్రతిపాదనల మాట అటుంచితే బడ్జెట్ ఖర్చులో కూడా ఏటేటా పెరుగుదల కనిపిస్తోంది. 2014–15 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ ఖర్చు రూ.62,306 కోట్లు కాగా, ఆ తర్వాత వరుసగా రూ.97,922 కోట్లు, రూ.1.33 లక్షల కోట్లు.. ఇలా పెరుగుతూ 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2.01 లక్షల కోట్లకు చేరింది.
సొంత పన్ను ఆదాయమే కీలకం..
ఏ రాష్ట్రమైనా ఆర్థిక వనరులు సమకూర్చుకోవడంలో, ముఖ్యంగా రాష్ట్ర సొంత ఆదాయాన్ని (ఎస్‌వోటీ) పెంచుకోవడంలో సఫలీకృతమైతే ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉన్నట్టే. ఈ కోణంలో పదేళ్ల తెలంగాణ రాష్ట్రం సుస్థిరతను సాధించిందని, సొంత పన్నుల ఆదాయం భారీగా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రం ఏర్పడిన రోజు 2014–15 ఆర్థిక సంవత్సరంలో రూ.50 వేల కోట్ల వరకు ఉన్న సొంత పన్నుల ఆదాయం ఇప్పుడు 2024–25 ఆర్థిక సంవత్సర ప్రతిపాదనల్లో లక్ష కోట్లు దాటింది.
అప్పుల కుప్పలే
పదేళ్లలో తెలంగాణ అప్పుల మూటను కూడగట్టుకుంది. రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి రూ.72,658 కోట్ల అప్పులుండగా.. ఇప్పుడు బడ్జెట్ లెక్కల ప్రకారం రూ.5 లక్షల కోట్లు దాటాయి. నికర అప్పు, పూచీకత్తులతో కలిపితే రూ.7 లక్షల కోట్లు దాటుతోంది. తలసరి ఆదాయంలో గణనీయ వృద్ధి సాధించిన రాష్ట్రం, తలసరి అప్పులోనూ అదే స్థాయిలో వృద్ధి సాధించడం గమనార్హం. అప్పులకు వడ్డీల చెల్లింపులకే రూ.22 వేల కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించాల్సి వస్తోంది. 2036 కల్లా కాళేశ్వరం ప్రాజెక్టుకు చేసిన ఖర్చు రూ.86 వేల కోట్లు, వడ్డీ రూ.54 వేల కోట్లు కలిపి రూ.1.40 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ ఒక్క ప్రాజెక్టు కోసమే ఏటా రూ.12 వేల కోట్లు చెల్లించాల్సి వస్తుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. అయితే గోదావరి జలాలను ఎత్తిపోయడం ద్వారా లక్షల ఎకరాలకు సాగు నీరందించే ప్రాజెక్టు కోసం పదేళ్లలో రూ.84 వేల కోట్లు ఖర్చు చేయగలగడం, రైతుబంధు లాంటి పథకాలను ప్రవేశపెట్టి సజావుగా అమలు చేస్తుండడం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సాధించిన విజయాలుగానే చెప్పుకోవాలి. కానీ అప్పులు పెరిగినా ఆస్తుల కల్పన ఆశించిన స్థాయిలో జరగలేదనే అపవాదు కూడా తెలంగాణకు ఉంది. 2014–15లో ఆస్తుల కల్పన కింద చేయాల్సిన మూలధన వ్యయం రూ.15వేల కోట్లు దాటితే, 2024–25లో అది రూ.29,669 కోట్లకు మాత్రమే చేరింది. ఇవి కేవలం ప్రతిపాదనలే కాగా, ఖర్చు అంతకంటే తక్కువే ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment