బీసీ సంక్షేమ శాఖ మంత్రి కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తున్న కృష్ణయ్య తదితరులు
పంజగుట్ట (హైదరాబాద్): రాష్ట్ర బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి కేటాయించిన రూ.6,229 కోట్లు ఏమాత్రం సరిపోవని, దాన్ని రూ.20 వేల కోట్లకు పెంచాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు వందలాది మంది విద్యార్థులు, యువకులతో కలిసి గురువారం ఖైరతాబాద్‌లోని బీసీ సంక్షేమ శాఖమంత్రి కార్యాలయం ముందు నిరసన తెలిపారు.
సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్‌ల నాయకత్వంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. మొత్తం రాష్ట్ర బడ్జెట్ రూ.2.9 లక్షల కోట్లు అయితే.. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల సంక్షేమానికి రూ.6,229 కోట్లు కేటాయిస్తే ఏమూలకు సరిపోతుందని ప్రశ్నించారు. బడ్జెట్‌లో కొత్త పథకాలేవీ లేవని, పెరిగిన ధరలకు అనుగుణంగా ఉపకార వేతనాలు, మెస్‌చార్జీల పెంపు ప్రస్తావనే లేదని, కాలేజీ కోర్సులు చదివే విద్యార్థులకు మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్ చేస్తామన్న ముఖ్యమంత్రి హామీకి బడ్జెట్ కేటాయింపుల్లేవని విమర్శించారు. ఈ విద్యా సంవత్సరంలో 119 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తా మన్న హామీకి బడ్జెట్ లేదని కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment