తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2024-25ను రాష్ట్ర ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థికసంవత్సరానికి రూ.2,75,891 కోట్ల ఓట్-ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను సమర్పించారు.
బడ్జెట్ స్వరూపం
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2024-25 స్వరూపం ఇలా ఉంది. మొత్తం రూ.2,75,891 కోట్లకు బడ్జెట్ సమర్పించగా ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు కాగా మూలధన వ్యయం రూ.29,669 కోట్లుగా ఉంది.
కేటాయింపులు ఇలా..
తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలైన ఆరు గ్యారెంటీల అమలు కోసం 2024-25 బడ్జెట్‌లో అత్యధికంగా రూ.53,196 కోట్లు కేటాయించింది. ఇక మిగిలిన కేటాయింపులు ఇలా ఉన్నాయి.. ఐటీ శాఖకు రూ.774 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.40,080 కోట్లు, పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.19,746 కోట్లు, ఎస్సీ, ఎస్టీ గురుకుల భవనాల కోసం రూ.1,250 కోట్లు, గృహ నిర్మాణానికి రూ.7,740 కోట్లు, నీటి పారుదల శాఖకు రూ.28,024 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.8 వేల కోట్లు కేటాయించింది.
త్వరలోనే రూ.2 లక్షల రుణమాఫీకి కార్యాచరణ
రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఎదురుచూస్తున్న రుణమాఫీకి సంబంధించి మంత్రి భట్టీ విక్రమార్క కీలక ప్రకటన చేశారు. రూ. 2 లక్షల రుణమాఫీ కోసం త్వరలోనే కార్యాచరణ మొదలు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా రైతులకు ఏటా రూ.15,000 పంట పెట్టుబడి సాయం, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ.12 వేలు, వరి పంటకు క్వింటాల్ రూ.500 చొప్పున కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment