పట్టణాలకు మరిన్ని నిధులు
మున్సిపాలీటీలన్నింటిని సమాన దృష్టితో చూస్తామని, ప్రతి నగర పాలక సంస్థ హైదరాబాద్ తరహ ఎదిగేలా ప్రణాళికలు రూపొందిస్తామని మున్సిపల్ శాఖను కొత్తగా చేపట్టిన మంత్రి కె.తారక రామారావు అన్నారు. మున్సిపల్ శాఖ బడ్జెట్ తయారీపై కేటీఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. గత ఏడాది బడ్జెట్ కేటాయింపులను పరిశీలించి, కొత్త బడ్జెట్ అంచనాలను తయారు చేయాలని అధికారులను అదేశించారు. గతంలో కన్నా పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి పనులు ఎక్కువ అయినందున ఆ మేరకు ఈ బడ్జెట్‌లో కేటాయింపులు కూడా పెరుగుతాయని కేటీఆర్ చెప్పారు.
కొత్త మార్కెట్ల నిర్మాణం, నగర పంచాయతీలకు భవనాలు, శ్మశాన వాటికలు, స్వచ్ఛ వాహనాల కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. నగరంలోని చెరువుల పునరుధ్దరణ కోసం ప్రత్యేకంగా కేటాయింపులు ఉంటాయని తెలిపారు. బడ్జెట్ సమీక్ష తర్వాత వంద రోజుల్లో సాధించాల్సిన లక్ష్యాలపై శాఖల వారీగా చర్చించారు. సమావేశంలో మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంజీ గోపాల్, సీడీఎంఏ దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి, ఇతర ఉన్నాతాధికారులు పాల్గొన్నారు.