ఆరుకు.. ఊరుకు.. ఆరు గ్యారంటీలకు రూ.53 వేల కోట్లు | 53 thousand crores for Congress six guarantees in Telangana | Sakshi
Sakshi News home page

ఆరుకు.. ఊరుకు.. ఆరు గ్యారంటీలకు రూ.53 వేల కోట్లు

Published Sun, Feb 11 2024 2:07 AM | Last Updated on Sun, Feb 11 2024 2:07 AM

53 thousand crores for Congress six guarantees in Telangana - Sakshi

ప్రభుత్వం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి..
అప్పులు, మిత్తీలతో తీవ్ర భారం ఇన్నాళ్లూ తెలంగాణను అబద్ధాలకు పర్యాయపదంగా మార్చారు. ఆ అబద్ధాలు వినడం అలవాటైన వారికి మా బడ్జెట్‌ కొత్తగా అనిపించవచ్చు. అప్పులు చేసిన రైతులు మిత్తీలు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నట్టుగా.. ఇరిగేషన్‌ శాఖ అప్పులు, మిత్తీలతో ప్రభుత్వం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది.
– సీఎం రేవంత్‌ రెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: ఆరు ‘గ్యారంటీ’లకు.. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ కాంగ్రెస్‌ సర్కారు తమ తొలి బడ్జెట్‌ను తెచ్చింది. మొత్తంగా రూ.2,75,891 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టగా.. అందులో ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.40,080 కోట్లు కేటాయించింది. మొత్తం బడ్జెట్‌ పద్దులో ఈ రెండింటికి కలిపి మూడో వంతు మేర నిధుల కేటాయింపు ఉండటం గమనార్హం.

మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు్ల, చేయూత, యువ వికాసం హామీల అమలుకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించింది. గ్రామాల వికాసానికి తోడ్పడేలా రాష్ట్ర ఆర్థిక సంఘం సూచించిన మేరకు భారీగా నిధులు ఇస్తున్నట్టు పేర్కొంది. ఈ రెండింటితోపాటు సంక్షేమం, విద్యా రంగానికి గణనీయంగా ప్రతిపాదనలు చేసింది. అయితే కీలకమైన వ్యవసాయ శాఖతోపాటు వైద్యారోగ్య రంగానికి కోతపెట్టింది. 

అప్పుల సమీకరణ ఎక్కువే..
శనివారం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్ర మార్క 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గతబడ్జెట్‌లో ప్రతిపాదించిన రుణాల­కంటే ఏకంగా 50 శాతం ఎక్కువగా ఈసారి అప్పుల పద్దు చూపారు. 2023–24లో బహిరంగ మార్కెట్‌ నుంచి రూ.40,615.68 కోట్లు రుణ సమీ కరణ చేయనున్నట్టు పేర్కొ­నగా, ఈసారి ఏకంగా రూ.59,625 కోట్లకు పెంచారు.

ఇతర రుణాలు కూడా కలిపి గత బడ్జెట్‌లో రూ.55,277.698 కోట్లు చూపగా.. ఈసారి మొత్తంగా రూ.68,585.21 కోట్ల మేర రుణాలు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం బడ్జెట్‌లో ఇది 25శాతం కావడం గమనార్హం. ఇక గతంలో చేసిన అప్పుల వాయిదాలు, వడ్డీల చెల్లింపుకోసం తాజా బడ్జెట్‌లో రూ.35,868 కోట్లు చూపెట్టారు. ఇది మొత్తం బడ్జెట్‌లో 12శాతానికిపైనే.

తగ్గిన రాష్ట్ర వృద్ధిరేటు
రాష్ట్ర వృద్ధిరేటు 2022–23తో పోలిస్తే 14.7 శాతం నుంచి 2023–24లో 11.3 శాతానికి తగ్గిందని, వ్యవసాయ వృద్ధిరేటు మైనస్‌లో పడిపోయిందని ¿¶ట్టి  వెల్లడించారు. అయితే ఇది ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ మాత్రమేనని, జూన్‌లో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్‌లో.. బడ్జెట్‌ పరిమాణం, శాఖల కేటాయింపుల్లో మార్పు­లు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

పన్ను ఆదాయంపైనే ఆశలు
ఈ సారి బడ్జెట్‌లో పన్నుల ఆదాయం అంచనా రూ.20 వేల కోట్లు పెరిగింది. రాష్ట్ర వృద్ధిరేటు నిలకడగా ఉన్న నేపథ్యంలో సొంత పన్ను రాబడుల అంచనాను రూ.1.38 లక్షల కోట్లుగా చూపారు. గత బడ్జెట్‌ ప్రతిపాదనలతో పోలిస్తే ఇది రూ.7వేల కోట్లు ఎక్కువ. దీంతోపాటు కేంద్ర పన్నుల్లో వాటా, పన్నేతర ఆదాయం, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌లు కలిపి ఈసారి రెవెన్యూ రాబడుల రూపంలో రూ.2,05,601.50 కోట్లు సమకూరుతాయని అంచనా వేశారు.

గత బడ్జెట్‌లో రెవెన్యూ రాబడుల అంచనా రూ.2,16,566.97 కోట్లుకాగా.. తాజాగా సవరించిన అంచనాల్లో రూ.1,78,172.95 కోట్లుగానే ఉంది. అంటే గత బడ్జెట్‌ కంటే రూ.11వేల కోట్లు తక్కువగా.. సవరించిన అంచనాల కంటే రూ.27 వేలకోట్లు ఎక్కువగా రెవెన్యూ రాబడులను చూపారు.

బడ్జెట్‌లో కొన్ని కీలక అంశాలివీ..
► ప్రతి మండలంలో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ 
► గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో రెండు ఎంబీఏ కాలేజీలు 
► ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ గృహాలు 
► త్వరలో ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం 
► 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్‌పై త్వరలో మార్గదర్శకాలు 
► మూసీ ప్రక్షాళనకు రూ.1,000 కోట్లు 
► కాంగ్రెస్‌ చేపట్టిన ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యం 

కీలక కేటాయింపుల తీరు ఇదీ..
సంక్షేమ రంగాలకు గత బడ్జెట్‌లో రూ.33,416 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.45,149 కోట్లకు పెంచారు. అయితే ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, కల్యాణలక్ష్మి కోసం ప్రత్యేక పద్దులు చూపలేదు. సంక్షేమశాఖలకు కేటాయించిన నిధుల్లోంచే వీటికి ఖర్చు చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. విద్యాశాఖకు గత బడ్జెట్‌కన్నా ఒక శాతం అధికంగా రూ.21 వేల కోట్లు ఇచ్చారు.

వ్యవసాయ రంగానికి గతంలో కంటే రూ.7వేల కోట్లు తక్కువగా.. రూ.19,746 కోట్లే చూపారు. రైతుబంధు పథకం అమలును సమీక్షించే క్రమంలో నిధులు తగ్గాయి. వైద్యారోగ్య శాఖ పద్దులో గతంతో పోలిస్తే రూ.700 కోట్లు తగ్గాయి. 4 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వీలుగా గృహనిర్మాణ శాఖ రూ.25వేల కోట్ల నిధులు కోరగా.. రూ.7,400 కోట్లు మాత్రమే కేటాయించారు. హౌజింగ్‌ శాఖ భూములు అమ్మి ఇళ్లు కట్టించే అవకాశం ఉందని అంటున్నారు.

ప్రతిపాదనలు, వాస్తవ ఖర్చుకు భారీ వ్యత్యాసం
2023–24 బడ్జెట్‌లో ప్రతిపాదించిన నిధులు, చేసిన వాస్తవ ఖర్చులకు చాలా తేడా ఉందని కాంగ్రెస్‌ సర్కారు బడ్జెట్‌ గణాంకాల్లో పేర్కొంది. గత ఏడాది బడ్జెట్‌ రూ.2,90,296 కోట్లుకాగా.. సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.2,24,624.87 కోట్లకే పరిమితమైంది. ఆ మొత్తానికి రూ.50 వేల కోట్లు అదనంగా కలిపి.. తాజాగా రూ.2,75,890.69 కోట్లతో 2024–25 బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

► పన్ను రాబడుల విషయానికి వస్తే.. 2023–24లో రూ.1,31,028.65 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేయగా, రూ.13 వేల కోట్లు తక్కువగా రూ.1,18,195.10 కోట్లు మాత్రమే సమకూరుతున్నట్టు సవరణ బడ్జెట్‌లో అంచనా వేశారు.
► కేంద్ర పన్నుల్లో వాటా కింద గత బడ్జెట్‌ ప్రతిపాదనల కంటే రూ.2 వేల కోట్లు ఎక్కువగా రూ.23,216.52 కోట్లు అందనున్నట్టు సవరణ బడ్జెట్‌లో పేర్కొన్నారు. అయితే పన్నేతర ఆదాయం అంచనాల మేరకు రూ.22,808.31 కోట్లు సమకూరుతున్నట్టు వివరించారు.
► 2023–24 బడ్జెట్‌లో గ్రాంట్స్‌ ఇన్‌ ఎయిడ్‌ పద్దు కింద కేంద్రం నుంచి రూ.41,259.17 కోట్లు వస్తాయని అంచనా వేయగా.. సవరించిన అంచనాల్లో కేవలం రూ.13,953.02 కోట్లే అందుతున్నట్టు తేల్చారు.
► బహిరంగ మార్కెట్‌ రుణాలు ఆశించిన మేర సమకూరాయి. కేంద్రం నుంచి రూ.4,102 కోట్లు వస్తాయనుకుంటే, రూ.1,500 కోట్లే అందనున్నట్టు సవరించిన అంచనాలు చెప్తున్నాయి. 

సంక్షేమానికి రూ.45,149 కోట్లు
తాజా బడ్జెట్‌లో శాఖల వారీగా కేటాయించిన ప్రభుత్వం 
సంక్షేమశాఖలకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది. గత కొన్నేళ్లుగా కేటాయింపులు అరకొరగా ఉండడంతో సతమతమవుతున్న సంక్షేమ శాఖలకు, అనుబంధ విభాగాలకు తాజా బడ్జెట్‌ కాస్త ఊరట ఇచ్చే విధంగా ఉందని ఆర్థిక నిపుణులు అన్నారు.  సంక్షేమ శాఖలకు అనుబంధంగా ఉన్న ఆర్థిక సహకార సంస్థలకు కొత్త కార్యక్రమాలు చేపట్టేలా కేటాయింపులున్నాయి. గడిచిన రెండేళ్లతో పోలిస్తే ఈ దఫా కేటాయింపులు భారీగా పెరిగాయి. ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమం, బీసీ సంక్షేమ శాఖలతో పాటు మైనార్టీ సంక్షేమ శాఖలకు 2024–25 సంవత్సరంలో రూ.45,149 కోట్లను తాజా బడ్జెట్లో కేటాయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఈ బడ్జెట్‌లో నాలుగు సంక్షేమ శాఖలకు గతేడాది కంటే రూ.11,733 కోట్లు అధికంగా కేటాయించారు. తాజాగా జరిపిన కేటాయింపుల్లో అత్యధికంగా ఎస్సీ అభివృద్ధి శాఖకు కేటాయించారు. గత కేటాయింపులతో పోలిస్తే ఈ దఫా గిరిజన సంక్షేమ శాఖకు అదనంగా రూ.9,048 కోట్లు కేటాయించడం గమనార్హం. 2023–24 వార్షిక బడ్జెట్లో దళితబంధు పథకం కింద రూ.17,700 కోట్లు కేటాయించినప్పటికీ ప్రభుత్వం పైసా ఖర్చు చేయకపోగా.. ఈసారి బడ్జెట్లో దళితబంధు ప్రస్తావనే లేదు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు కూడా గత బడ్జెట్‌ కంటే రూ.1,771 కోట్లు అధికంగా కేటాయించారు. మైనార్టీ సంక్షేమ శాఖకు కూడా గత బడ్జెట్‌ కంటే రూ.62 కోట్లు పెరిగాయి.  

విద్యకు రూ.21 వేల కోట్లు
గత ఏడాది కన్నా 1.05 శాతం అదనం
గత ఏడాదితో పోలిస్తే విద్యారంగానికి మధ్యంతర బడ్జెట్‌లో 1.05 శాతం నిధులు పెరిగాయి. గత ఏడాది మొత్తం బడ్జెట్‌లో ఈ రంగానికి రూ.16,092 కోట్లు (6.7శాతం) ఇవ్వగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 21,389 కోట్లు (7.5శాతం) కేటాయించారు. అయితే పాఠశాల విద్యలోనే ఈ పెరుగుదల ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో పోలిస్తే రూ.13 వేల కోట్ల నుంచి రూ.17,931 కోట్లకు నిధులు పెంచారు.

టీచర్లకు ఇంక్రిమెంట్లు ఇవ్వడం వల్ల పెరిగిన వేతనాలు, పీఆర్‌సీ వల్ల పెరిగే జీతాలకే ఈ నిధులు సరిపోయే అవకాశముంది. గత ప్రభుత్వం  చేపట్టిన ‘మన ఊరు–మనబడి’ఊసే బడ్జెట్‌లో కనిపించలేదు. మండలానికో ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్, బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించింది. ఉన్నతవిద్యకు రూ.2,959.10 కోట్లు, సాంకేతికవిద్యకు రూ. 487.64 కోట్లు కేటాయించారు. 65 ఐటీఐలను కొత్తగా తేబోతున్నట్టు చెప్పినా, ఇవి ప్రైవేట్‌ రంగంలోనే అని స్పష్టత ఇచ్చింది. నైపుణ్య వర్సిటీపె అధ్యయనం చేస్తున్నట్టు వెల్లడించింది.

కల్యాణలక్ష్మికి కానరాని ప్రత్యేక పద్దు
సంక్షేమ శాఖల నిధుల నుంచే ఖర్చు చేసే అవకాశం 
పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థికసాయం అందించే కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల ప్రత్యేక పద్దు తాజా బడ్జెట్‌లో కానరాలేదు. ఇదివరకు ఈ పథకాలకు ప్రత్యేకంగా పద్దులు కేటాయించగా, ఈసారి వాటి ఊసెత్తలేదు. ఈ పథకాలకు 2023–24, 2022–23 ఆర్థిక సంవత్సరాల్లో రూ.3210 కోట్లు, రూ. 2,750 కోట్లు కేటాయించారు. సంక్షేమ శాఖల ద్వారానే ఈ పథకాలు అమలవుతున్నాయి. ఈసారి సంక్షేమశాఖలకు నిధులు పెంచడంతో ఈ రెండు పథకాల నిర్వహణను వాటికే అప్పగించినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో  కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలకు అదనంగా తులం బంగారం ఇస్తామని ప్రకటించారు. కానీ, తాజా బడ్జెట్‌లో ఆ రెండు పథకాల ప్రస్తావన లేకపోగా, తులం బంగారం అంశాన్ని కూడా చేర్చలేదు.   

ఇందిరమ్మ ఇళ్లకు అప్పులే దిక్కా?
రూ.20,000 కోట్లు కావాల్సి ఉండగా.. కేటాయించింది రూ.7,740 కోట్లే
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లను భారీ ఎత్తున చేపట్టాలని నిర్ణయించిన కాంగ్రెస్‌ ప్రభు­త్వం అందుకు కావాల్సిన నిధుల విషయంలో మాత్రం స్పష్టతనివ్వలేదు. తాజా బడ్జెట్‌లో పేదల ఇళ్ల కోసం రూ.7740 కోట్లను ప్రతిపా­దిం­చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో నియోజక­వర్గానికి 3500 ఇళ్లు చొప్పున నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు బడ్జెట్‌ ప్రసంగంలో భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆ ఇళ్లను పూర్తి చేయాలంటే రూ.20 వేల కోట్ల వరకు అవసరమవుతాయి. గృహనిర్మాణ శాఖ కూడా రూ.25 వేల కోట్లు కావాలని ఆర్థిక శాఖను కోరింది. కానీ నిధులు అతి తక్కువగా ప్రతిపాదించటం విశేషం. 

అందుకే కేటాయింపులు తగ్గించారా?
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నేరుగా నిధులు కేటాయించకుండా, కేంద్రం ఇచ్చే సాయం, రుణాలతో చేపట్టనుందన్న మాటలూ వినిపిస్తున్నాయి. ఇప్పటికే హడ్కో నుంచి రూ.3 వేల కోట్లను రుణంగా తీసుకోవాలని గృహనిర్మాణ సంస్థ నిర్ణయించింది.

పట్టణ ప్రగతి పక్కకే! 
పురపాలనకు రూ.11,692 కోట్లు
రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి బడ్జెట్‌లో తక్కువ కేటాయింపులే జరిగాయి. హైదరాబాద్‌ (జీహెచ్‌ఎంసీ) మిన­హా రాష్ట్రంలోని 129 మునిసిపాలిటీలు, 12 కార్పొరేషన్లలో అభివృద్ధి పనులు, జీతభత్యా­లు, నిర్వహణ వ్యయాల కింద ఈ మొత్తం కేటాయించారు. గత ఏడాది బడ్జెట్‌లో జరిపిన రూ. 11,372 కోట్ల కేటాయింపుల కన్నా ఈసారి రూ.320 కోట్లు మాత్రమే అధికం.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని భావి­స్తున్న మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టుకు ఈసారి రూ.1,000 కోట్లు కేటాయించారు. కాగా గత ప్రభుత్వంలో పట్టణ ప్రగతి పేరిట చేపట్టిన కార్యక్రమాల ఊసు ఈసారి లేకపో­వడంతో ఆ కార్యక్రమాన్ని ఎత్తివేసిన­ట్టేనని పురపాలక వర్గాలు చెబుతున్నాయి. స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులు, హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టులకు బడ్జెట్‌ కేటాయింపులు లేకపోవడం గమనార్హం.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement