సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్‌పై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. కేంద్ర బడ్జెట్‌పై స్పందించని కేసీఆర్, రాష్ట్ర బడ్జెట్ మీద మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈమేరకు అసెంబ్లీ ప్రాంగణంలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణకు ద్రోహం చేసిన కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ అసెంబ్లీ తీర్మానం చేస్తే కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారుజ కేంద్ర బడ్జెట్ పై మాట్లాడని కేసీఆర్... రాష్ట్ర బడ్జెట్‌ను విమర్శించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు.
బీజేపీతో ఒప్పందంలో భాగంగానే అసెంబ్లీ కి వచ్చిన మొదటి రోజే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ టార్గెట్ చేస్తున్నాడని సీతక్క విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బీజేపీ మెప్పుకోసమే ఆయన రాష్ట్ర బడ్జెట్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు ఆరు నెలల తర్వాత అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావడమే అందుకు నిదర్శనమని అన్నారు.
కాగా తెలంగాణ బడ్జెట్.. రాష్ట్ర ప్రజల ఆశలపై నీళ్లు జల్లేలా ఉందని కేసీఆర్ మండిపడ్డారు. తమ పాలనలో ఎన్నో పథకాలు పెడితే.. వాటన్నింటిని కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందని మండిపడ్డారు. రైతులకు, మత్య్సకారులకు.. ఇలా వర్గానికి మేలు చేసేలా లేదు. ఐటీ, పారిశ్రామిక విధానాలు లేవు. తెలంగాణ బడ్జెట్ ఒట్టి గ్యాస్.. ట్రాష్. బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ఒత్తి ఒత్తి ఆర్థిక మంత్రి మాట్లాడారే తప్ప.. కొత్తగా ఏమీ చెప్పలేదు. ఏదో కథ చెప్పినట్లు.. రాజకీయ ప్రసంగంలా ఉందే తప్పా.. ఏ ఒక్క వర్గానికి మేలు చేసేలా లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment